మోక్షజ్ఞ ఎంట్రీకి వశిష్ట మైండ్ బ్లోయింగ్ ప్లాన్
ABN , Publish Date - Oct 09 , 2026 | 03:57 PM
నందమూరి నటసింహం బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ వెండితెర అరంగేట్రంపై టాలీవుడ్‌తో పాటు తెలుగు సినీ ప్రియుల్లో ఎప్పటినుంచో భారీ ఆసక్తి నెలకొనడం, ఈ మధ్య అధికారిక ప్రకటన రావడం తెలిసిందే. ఇప్పుడా ఆసక్తిని రెట్టింపు చేసేలా.. తాజాగా ఓ వార్త వైరల్ అవుతోంది.
నందమూరి నటసింహం బాలకృష్ణ (Nandamuri Balakrishna) తనయుడు మోక్షజ్ఞ (Mokshagna) వెండితెర అరంగేట్రంపై టాలీవుడ్‌తో పాటు తెలుగు సినీ ప్రియుల్లో ఎప్పటినుంచో భారీ ఆసక్తి నెలకొంది. ‘బింబిసార’తో బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టి, ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవితో ‘విశ్వంభర’ వంటి మెగా ఫాంటసీ చిత్రాన్ని పూర్తి చేసిన యువ దర్శకుడు మల్లిడి వశిష్ట (Mallidi Vassishta) దర్శకత్వంలో మోక్షజ్ఞ డెబ్యూ ప్రాజెక్ట్ లాక్ అయిన సంగతి తెలిసిందే. అయితే, ఈ చిత్రాన్ని ఎలా తీర్చిదిద్దబోతున్నారు? కథాంశం ఏంటి? అనే అంశాలపై సినీ వర్గాల్లో రోజుకో క్రేజీ వార్త చక్కర్లు కొడుతోంది. ఈ క్రమంలో దర్శకుడు వశిష్ట సిద్ధం చేసిన మాస్టర్ ప్లాన్ గురించిన తాజా అప్‌డేట్స్ నందమూరి అభిమానులకు పూనకాలు తెప్పిస్తున్నాయి.
దర్శకుడు వశిష్ట తన బలమైన సోషియో-ఫాంటసీ జానర్‌నే మోక్షజ్ఞ కోసం ఎంచుకున్నారని తెలుస్తోంది. ‘బింబిసార’ తరహాలోనే ఫాంటసీ అంశాలకు తోడు హై-వోల్టేజ్ మాస్ కమర్షియల్ ఎలిమెంట్స్‌ను సమపాళ్లలో మేళవించి పక్కాగా స్క్రిప్ట్ సిద్ధం చేసినట్లు సమాచారం. ఈ చిత్రంలో టైమ్ ట్రావెల్, పునర్జన్మల కాన్సెప్ట్ అత్యంత కీలక పాత్ర పోషించనున్నాయని టాక్. మోక్షజ్ఞ బాడీ లాంగ్వేజ్‌కు సరిపోయేలా పాత్రను డిజైన్ చేశారని, కథ ప్రారంభంలో చాలా జాలీగా, సరదాగా కనిపించే యువకుడిగా పరిచయమై.. కథ ముందుకు సాగే కొద్దీ అనూహ్య పరిస్థితుల ప్రభావంతో అత్యంత శక్తివంతమైన రోల్‌లోకి మారిపోతారని, ఆయనలోని పలు కోణాలను ఈ చిత్రంలో సరికొత్తగా ఆవిష్కరించనున్నారని తెలుస్తోంది.
ఈ ప్రాజెక్ట్‌కు అతిపెద్ద హైలైట్ నటసింహం నందమూరి బాలకృష్ణ ఎంట్రీనే కానుంది. కేవలం మోక్షజ్ఞను పరిచయం చేయడమే కాకుండా, సినిమాను నెక్స్ట్ లెవెల్‌కు తీసుకెళ్లేలా సెకండాఫ్‌లో అత్యంత కీలకమైన మలుపు వద్ద బాలయ్య ఎంట్రీని వశిష్ట ప్లాన్ చేశారట. బాలయ్య పాత్ర ఎంటర్ అవ్వడంతోనే స్క్రీన్‌ప్లే మరింత గ్రిప్పింగ్‌గా మారి కథ స్థాయి అమాంతం పెరుగుతుందని టాక్ నడుస్తోంది. అన్నింటికీ మించి.. బాలకృష్ణ, మోక్షజ్ఞ ఇద్దరూ కలిసి ఒకే ఫ్రేమ్‌లో కనిపించే సన్నివేశాలు వెండితెరపై నందమూరి అభిమానులకు కన్నుల పండుగగా నిలవనున్నాయని అంటున్నారు. నిజమే అయితే మాత్రం.. ఈ సీన్స్ థియేటర్లను షేక్ చేయడం ఖాయం.
ఈ చిత్రాన్ని దసరా పర్వదినం సందర్భంగా అధికారికంగా పూజా కార్యక్రమాలతో ప్రారంభించి, 2026 చివరిలో లేదా 2027 ఆరంభంలో రెగ్యులర్ షూటింగ్‌ను పట్టాలెక్కించేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ చిత్రంలో భారీ గ్రాఫిక్స్, విస్తృతమైన వీఎఫ్ఎక్స్ వర్క్ ఉండటంతో.. షూటింగ్ ప్రారంభం నుంచే పారలల్‌గా పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడా ఏకకాలంలో పూర్తి చేసేలా షెడ్యూల్స్ ప్లాన్ చేస్తున్నారు. ఎక్కడా ఆలస్యం కాకుండా ఒక ఖచ్చితమైన టైమ్‌లైన్‌తో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని వశిష్ట ప్రణాళికలు రచిస్తున్నారట. మొత్తం మీద మోక్షజ్ఞ ఎంట్రీ కేవలం రొటీన్ లాంచ్ మూవీలా కాకుండా, నందమూరి చరిత్రలోనే ఓ చిరస్మరణీయ దృశ్యకావ్యంగా నిలిచేలా వశిష్ట గట్టి కసరత్తే చేస్తున్నారని మాత్రం స్పష్టమవుతోంది.
ఇవి కూడా చదవండి:
‘జై హనుమాన్’లో మమితా బైజు.. ప్రశాంత్ వర్మా, అసలేం తీస్తున్నావ్..
మణిరత్నం సినిమా కోసం విజయ్ సేతుపతి సంచలన నిర్ణయం
సుమలత పిటిషన్‌తో డాన్సర్స్ అసోసియేషన్ ఎన్నికలకు హైకోర్టు బ్రేక్..