46 కోట్లు.. రాధ ఫిర్యాదుపై సోదరి అంబిక సవాల్
ABN, Publish Date - Sep 23 , 2026 | 05:03 PM
దక్షిణాది చిత్ర పరిశ్రమలో ఒకప్పుడు స్టార్ సిస్టర్స్‌గా ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొన్న ప్రముఖ నటీమణులు రాధ, అంబికల మధ్య మొదలైన ఆర్థిక, ఆస్తి వివాదం మరింత ముదిరి.. సంచలనంగా మారింది.
దక్షిణాది చిత్ర పరిశ్రమలో ఒకప్పుడు స్టార్ సిస్టర్స్ (Star Sisters)గా ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొన్న ప్రముఖ నటీమణులు రాధ (Radha Nair), అంబిక (Ambika)ల మధ్య మొదలైన ఆర్థిక, ఆస్తి వివాదం మరింత ముదిరి.. సంచలనంగా మారింది. సంతకం చేసిన తన ఖాళీ చెక్కులను దొంగిలించి ఏకంగా రూ. 46 కోట్లు కాజేసేందుకు ప్రయత్నించారంటూ రాధ ఇటీవల చెన్నై పోలీస్ కమిషనర్‌ను ఆశ్రయించి, తన సోదరి అంబికతో పాటు సోదరుడు మల్లికార్జునపై క్రిమినల్ ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఈ తీవ్ర ఆరోపణలపై నటి అంబిక తాజాగా గళం విప్పారు. తనపై వచ్చిన అభియోగాలన్నింటినీ తీవ్రంగా ఖండిస్తూ, రాధ ఫిర్యాదును న్యాయపరంగా ఎదుర్కొనేందుకు సిద్ధమంటూ బహిరంగంగా సవాల్ విసిరారు.
నాలుగు గోడల మధ్య పరిష్కరించుకోవాల్సిన కుటుంబ వివాదాన్ని మీడియా ముందుకు తీసుకురావడం తీవ్ర బాధ కలిగించిందని అంబిక ఆవేదన వ్యక్తం చేశారు. రాధ నివాసంలోని గదిలోకి చొరబడి తాను చెక్కులను దొంగిలించాననడంలో ఎంతమాత్రం వాస్తవం లేదని తేల్చిచెప్పారు. అసలు రాధకు తెలియకుండా ఆమె గదిలో నుంచి చెక్కులు ఎలా తీసుకోగలమని ప్రశ్నించిన అంబిక, స్వయంగా రాధే ఆ చెక్కులను తనకు అందజేసిందని వెల్లడించారు. ‘‘చెక్కులను స్వయంగా ఇచ్చింది రాధే.. ఆ తర్వాత బ్యాంకుకు వెళ్లి పేమెంట్లను ఉద్దేశపూర్వకంగా ఆపేసింది కూడా రాధే’’ అని స్పష్టం చేశారు. సొంత తోబుట్టువు అయి ఉండి తనపై దొంగతనం నేరం మోపడం మానసికంగా ఎంతో కలచివేసిందని పేర్కొన్నారు.
ఈ చెక్కుల వివాదం వెనుక సుదీర్ఘకాలంగా కొనసాగుతున్న కుటుంబ ఆస్తులు, వ్యాపార లావాదేవీల అంశాలు ఉన్నాయని అంబిక వివరించారు. ముఖ్యంగా ‘ARS గార్డెన్స్’తో తమ కుటుంబానికి దశాబ్దాల అనుబంధం ఉందని, ఆ సంస్థను తన కన్నబిడ్డలా భావించానని భావోద్వేగానికి లోనయ్యారు. అటువంటి సంస్థ పేరును తన ప్రమేయం లేకుండా ‘RR గార్డెన్స్’గా మార్చడం తనను ఎంతగానో క్షోభకు గురిచేసిందన్నారు. అలాగే ఆస్తులు, వ్యాపారంతో పాటు బంగారు ఆభరణాల విషయంలోనూ తమ మధ్య చాలాకాలంగా విభేదాలు ఉన్నాయని, తమ కుటుంబానికి చెందిన విలువైన బంగారు నగలు కూడా రాధ వద్దే ఉన్నాయని ఆమె ఎదురు ఆరోపణలు చేశారు. ఈ సమస్యల పరిష్కారానికి తాను గతంలోనే సంబంధిత అధికారులను సైతం ఆశ్రయించానని గుర్తుచేశారు.
మరోవైపు, ఈ వ్యవహారంలో చట్టపరమైన పోరాటానికి అంబిక సిద్ధమయ్యారు. రాధ ఇచ్చిన చెక్కులు బ్యాంకులో బౌన్స్ కావడంతో, ఆమెపై చట్టప్రకారం న్యాయపరమైన చర్యలు చేపట్టేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు అంబిక తరఫు న్యాయవాది స్పష్టం చేశారు. రాధ పోలీసులకు ఇచ్చిన తప్పుడు ఫిర్యాదును న్యాయస్థానంలో గట్టిగా సవాలు చేస్తామని తెలిపారు. ఇకపై ఈ కుటుంబ సమస్యను పదేపదే మీడియా ముందుకు తీసుకురాబోనని, చట్టం, అధికారుల నిర్ణయానికే తుది న్యాయాన్ని వదిలేస్తున్నానని అంబిక స్పష్టం చేయడంతో, ఈ స్టార్ సిస్టర్స్ లీగల్ వార్ కోలీవుడ్‌తో పాటు దక్షిణాదిలో హాట్ టాపిక్‌గా మారింది.
ఇవి కూడా చదవండి:
జానీ మాస్టర్ వైఫ్ సుమలతకు షాక్.. ఆమె కార్యవర్గం రద్దు
బాలయ్య సరికొత్త అవతార్.. కొరటాల ప్లాన్ మామూలుగా లేదుగా!
ఇదైనా పక్కానా.. మళ్లీ మారుతుందా 'వెంకీమామ'