జానీ మాస్టర్ వైఫ్ సుమలతకు షాక్.. ఆమె కార్యవర్గం రద్దు

ABN , Publish Date - Sep 23 , 2026 | 04:29 PM

ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ భార్య సుమలత నాయకత్వంలోని ప్రస్తుత పాలకవర్గాన్ని తెలుగు ఫిల్మ్ ఫెడరేషన్ రద్దు చేస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. అసోసియేషన్‌లో నెలకొన్న అంతర్గత విభేదాలు, వివాదాల నేపథ్యంలో ఫెడరేషన్ జోక్యం చేసుకుని ఈ కీలక చర్య చేపట్టింది.

Jani Master and Sumalatha

తెలుగు ఫిల్మ్ అండ్ టీవీ డ్యాన్సర్స్ అండ్ డ్యాన్స్ డైరెక్టర్స్ అసోసియేషన్ (TFTDDA)లో ఊహించని కీలక పరిణామం చోటుచేసుకుంది. ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ భార్య సుమలత నాయకత్వంలోని ప్రస్తుత పాలకవర్గాన్ని తెలుగు ఫిల్మ్ ఫెడరేషన్ రద్దు చేస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. అసోసియేషన్‌లో నెలకొన్న అంతర్గత విభేదాలు, వివాదాల నేపథ్యంలో ఫెడరేషన్ జోక్యం చేసుకుని ఈ కీలక చర్య చేపట్టింది. దీంతో తెలుగు సినీ డ్యాన్సర్స్ అసోసియేషన్ అధ్యక్ష పదవిని సుమలత కోల్పోవాల్సి వచ్చింది. ఇటీవల ఈ అసోసియేషన్‌లో ఎటువంటి పరిణామాలు చోటు చేసుకున్నాయో తెలియంది కాదు. ఇష్యూని చక్కదిద్దడానికి చిరంజీవి, బాలకృష్ణ వంటి వారితో పాటు ఫిల్మ్ ఛాంబర్ కూడా ప్రయత్నించింది కానీ, యూనియన్ అధికశాతం మెంబర్స్ మార్పును కోరుకోవడంతో.. మళ్లీ ఎన్నికలు జరిపేలా ఫెడరేషన్ సంచలన నిర్ణయం తీసుకుంది. బుధవారం అసలేం జరిగిందంటే..


ఈ వివాదం పరిష్కారానికి ఫిల్మ్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో సుమలత, రఘు మాస్టర్ వర్గాల సభ్యులతో అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ కీలక భేటీకి మొత్తం 225 మంది డ్యాన్సర్లు హాజరయ్యారు. ఈ సందర్భంగా నిర్వహించిన అభిప్రాయ సేకరణలో సుమలతకు సభ్యుల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురైంది. మొత్తం సభ్యులలో కేవలం 11 మంది మాత్రమే సుమలతకు అనుకూలంగా నిలవగా, ఏకంగా 214 మంది సభ్యులు రఘు మాస్టర్ వర్గానికి సంపూర్ణ మద్దతు ప్రకటించారు. మెజారిటీ సభ్యులు సుమలత నాయకత్వంపై అసంతృప్తి వ్యక్తం చేయడంతో ఫెడరేషన్ ఆమె కార్యవర్గాన్ని తక్షణమే రద్దు చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది.


కార్యవర్గం రద్దు కావడంతో డ్యాన్సర్స్ అసోసియేషన్‌కు నూతన పాలకవర్గాన్ని ఎన్నుకునేందుకు రంగం సిద్ధమైంది. ఈ క్రమంలోనే వచ్చే నెల అక్టోబర్ 11వ తేదీన అసోసియేషన్ ఎన్నికలను నిర్వహించనున్నట్లు ఫెడరేషన్ పెద్దలు సమావేశంలో వెల్లడించారు. పారదర్శక పద్ధతిలో ఎన్నికలు పూర్తి చేసి కొత్త కార్యవర్గాన్ని బాధ్యతల్లోకి తీసుకురావాలని నిర్ణయించారు. ఈ పరిణామంతో యూనియన్ వర్గాల్లో నెలకొన్న రాజకీయాలు, సమీకరణాలు తీవ్ర ఉత్కంఠను రేపుతున్నాయి. అలాగే, ప్రస్తుత పరిస్థితులపై జానీ మాస్టర్ అండ్ సుమలత ఎలా రియాక్ట్ అవుతారో చూడాల్సి ఉంది.

ఇవి కూడా చదవండి:

బాలయ్య సరికొత్త అవతార్.. కొరటాల ప్లాన్ మామూలుగా లేదుగా!

ఇదైనా ప‌క్కానా.. మ‌ళ్లీ మారుతుందా 'వెంకీమామ‌'

ది ప్యారడైజ్.. ముందు భారీ టార్గెట్! హిట్ అవ్వాలంటే.. అన్ని కోట్లు రావాలా?


Updated Date - Sep 23 , 2026 | 04:29 PM