Trisha: విజయ్‌కు శుభాకాంక్షలు తెలిపిన పార్తీబన్!
ABN , Publish Date - Jun 04 , 2026 | 12:38 PM
ప్రముఖ నటుడు పార్దీబన్... తమిళనాడు సీఎం విజయ్‌ను కలిసి అభినందించారు. ఎన్నికల సమయంలో త్రిషపై అనుచిత వ్యాఖ్యలు చేసిన పార్దీబన్ ఇప్పుడు సీఎంను కలవడం సోషల్ మీడియాలో కొత్త చర్చకు దారి తీసింది.
రాజకీయాల్లోనే కాదు సినిమా రంగంలోనూ శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరు. ఇక సినిమా వాళ్ళు రాజకీయ రంగంలోకి వెళితే... ఆ అభిప్రాయం మరింత వేగంగా మారిపోయే ఛాన్స్ ఉంది. ఓ విజయం, ఓ ఓటమి మనిషితో ఏ పనైనా చేయిస్తుంది! తాజాగా ప్రముఖ దర్శకుడు, నటుడు పార్తీబన్ (Parthiban) విషయంలోనూ అదే జరిగింది. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల సమయంలో నటి త్రిష (Trisha) గురించి పార్తీబన్ అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఆమె బయటకు రాకుండా ఉంటే బాగుంటుందని, కొన్ని విషయాలలో తల దూర్చకుంటే బెటర్ అని అన్నారు. అయితే పార్తీబన్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో తన ఉద్దేశ్యం అది కాదని, త్రిషను ఉద్దేశించి తాను ఆ మాటలు అనలేదని... పార్తీబన్ సెలవిచ్చారు. అయితే ఎవ్వరూ ఊహించని విధంగా విజయ్ టీవీకే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా నిలవడం, సీఏం పదవిని విజయ్ చేపట్టడంతో చాలామందికి ఆ విషయం మింగుడు పడటం లేదు. సినిమా రంగంలోని విజయ్ ప్రత్యర్థులు సైతం తేలు కుట్టిన దొంగల మాదిరి అయిపోయారు. అయితే ఎన్నికల ముందు ఆయన్ని రాజకీయంగా విమర్శించిన చాలామంది విజయ్ సీఎం అయ్యాక ఆయన్ని స్వయంగా కలిసి శుభాకాంక్షలు తెలియచేశారు. కాస్తంత ఆలస్యమైన పార్దీబన్ ఇప్పుడా పనిచేశారు.
సీఎం విజయ్ (Vijay)ను కలిసి, ఆయన్ని అభినందిస్తూ రాయల్ దుస్తుల్లో ఉన్న ఫోటోను ప్రెజెంట్ చేశారు. తమిళనాడు రాజకీయాల్లో సంచలనం సృష్టించిన విజయ్‌కు అభినందిస్తున్నట్టు తెలిపారు. పార్దీబన్‌లో పాటే సీనియర్ నటుడు ఎమ్మెస్ భాస్కర్ సైతం విజయ్‌ను కలిసి శాలువతో సత్కరించి, అభినందనలు చెప్పారు. మొత్తానికి రాజకీయ పరమైన అభిప్రాయాలు ఎలా ఉన్నా... తోటి నటుడిని, సహచరుడిని ఇలా అభినందించడం, ఆయన సీఎం కావడం పట్ల హర్షం వ్యక్తం చేయడం మంచి విషయమే! అయితే తన గురించి అనుచిత వ్యాఖ్యలు చేసిన పార్దిబన్ ఇప్పుడు తన చెలికాడు విజయ్‌ను కలవడంపై త్రిష ఎలా స్పందిస్తుందో చూడాలి.

ఇవి కూడా చదవండి:
Peddi Review: రామ్‌చరణ్ స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్ చిత్రం 'పెద్ది’ ఎలా ఉందంటే..
‘పెద్ది’ పోరాటానికి తెలంగాణలోనూ లైన్ క్లియర్! పెరిగిన టికెట్ల ధరలు
NBK 111: ‘నో మోర్ వింటేజ్, ఓన్లీ న్యూ ఏజ్’.. సరికొత్త అవతారంలో బాలయ్య