2.5 కోట్లతో భారతీరాజా స్మారక మండపం.. సీఎం విజయ్‌పై ప్రశంసలు
ABN , Publish Date - Aug 26 , 2026 | 10:19 AM
భారతీయ చలనచిత్ర పరిశ్రమలో తనదైన ముద్ర వేసి, ఇటీవల కన్నుమూసిన దిగ్గజ దర్శకుడు, నటుడు భారతీరాజా గౌరవార్థం రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
భారతీయ చలనచిత్ర పరిశ్రమలో తనదైన ముద్ర వేసి, ఇటీవల కన్నుమూసిన దిగ్గజ దర్శకుడు, నటుడు భారతీరాజా (Bharathiraja) గౌరవార్థం రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆయన జ్ఞాపకార్థం రూ. 2.5 కోట్ల వ్యయంతో ఘనంగా స్మారక మందిరాన్ని (మణి మండపం) నిర్మించనున్నట్లు ముఖ్యమంత్రి విజయ్ (CM Vijay) నేతృత్వంలోని ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. భారతీరాజా పార్థివదేహానికి అంత్యక్రియలు నిర్వహించిన ఆయన సొంత వ్యవసాయ క్షేత్రంలోనే ఈ మణి మండపాన్ని ఏర్పాటు చేయనున్నట్లు స్పష్టం చేసింది. వెండితెరకు గ్రామీణ జీవన సౌందర్యాన్ని పరిచయం చేసి, ఎందరో ప్రతిభావంతులైన నటీనటులు, సాంకేతిక నిపుణులను అందించిన ఓ మహోన్నత కళాకారుడికి ప్రభుత్వం అందించిన సముచిత గౌరవమిది.
ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై సినీ లోకం, భారతీరాజా కుటుంబ సభ్యులు అమితానందం వ్యక్తం చేశారు. లోకనాయకుడు కమల్ హాసన్ (Kamal Haasan) స్పందిస్తూ.. మట్టి వాసనను వెండితెరపై దృశ్యకావ్యంగా మలిచిన అసలైన దర్శకుడు భారతీరాజా అని కొనియాడారు. ఆయన పుట్టి పెరిగిన నేలలోనే మణిమండపం నిర్మిస్తామని ప్రకటించడం గర్వకారణమని, ఈ సందర్భంగా సీఎం విజయ్‌కి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నామని పేర్కొన్నారు. భారతీరాజా కళా సేవలను చిరస్థాయిగా నిలిపేలా ప్రభుత్వం తీసుకున్న చొరవ నిజంగా అభినందనీయమని ఆయన ప్రశంసించారు.
భారతీరాజా సతీమణి చంద్రలీల సైతం ఈ ప్రకటనపై తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. తన భర్త జ్ఞాపకాలను భావితరాలకు అందించేలా ఇంతటి మహత్తర నిర్ణయం తీసుకున్న ముఖ్యమంత్రి విజయ్‌కు ఆమె మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలిపారు. మరోవైపు కోలీవుడ్ దర్శకుల సంఘం కూడా ప్రభుత్వ ప్రకటనను ఏకగ్రీవంగా స్వాగతించింది. పరిశ్రమకు మార్గదర్శిగా నిలిచిన దర్శకదిగ్గజానికి తగిన గుర్తింపు దక్కడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. కళలకు, కళాకారుల గౌరవానికి పెద్దపీట వేసిన సీఎం విజయ్ నిర్ణయంపై అటు సినీ వర్గాలు, ఇటు అభిమానుల నుంచి పెద్ద ఎత్తున ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.
ఇవి కూడా చదవండి:
Toxic Twitter Review: ‘ఇరుముడి’కి థియేటర్లు పెంచుకోవచ్చట!
100 కోట్ల క్లబ్‌లో.. 'ఇరుముడి'
టాలీవుడ్ డైరెక్టర్ అరెస్ట్.. హీరోయిన్ ని పెళ్లి చేసుకుంటానని నమ్మించి..