భారతీరాజా మృతి.. సీఎం భావోద్వేగం.. రాధిక కన్నీరుమున్నీరు
ABN, Publish Date - Jun 10 , 2026 | 04:44 PM
లెజెండరీ డైరెక్టర్ భారతీరాజా మరణవార్తతో కోలీవుడ్ ఇండస్ట్రీ తీవ్ర దిగ్భ్రాంతికి గురైంది. అభిమానుల సందర్శనార్థం భారతీరాజా పార్థివదేహాన్ని చెన్నైలోని ఆయన నివాసంలో ఉంచారు. ఆయనను కడసారి చూసుకునేందుకు సినీ ప్రముఖులు క్యూ కడుతున్నారు.
లెజెండరీ డైరెక్టర్ భారతీరాజా (Bharathiraja) మరణవార్తతో కోలీవుడ్ ఇండస్ట్రీ తీవ్ర దిగ్భ్రాంతికి గురైంది. గత కొంతకాలంగా వృద్ధాప్య సంబంధిత అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన చెన్నైలోని తన నివాసంలోనే చికిత్స తీసుకుంటూ.. 84 ఏళ్ల వయసులో నేడు (బుధవారం) తుదిశ్వాస విడిచారు. అభిమానుల సందర్శనార్థం భారతీరాజా పార్థివదేహాన్ని చెన్నైలోని ఆయన నివాసంలో ఉంచారు. ఆయనను కడసారి చూసుకునేందుకు సినీ ప్రముఖులు క్యూ కడుతున్నారు. నటుడు, తమిళనాడు సీఎం విజయ్ (CM Vijay).. భారతీరాజా పార్థివదేహానికి నివాళులు అర్పిస్తూ.. భౌతికకాయంపై తలవాల్చి భావేద్వేగానికి లోనయ్యారు. అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
సీఎం విజయ్‌తో పాటు, మాజీ సీఎం MK స్టాలిన్, రజనీకాంత్, కమల్ హాసన్, ఇళయరాజా, హీరో సూర్య, భాగ్యరాజా, వైరముత్తు, మన్సూర్ అలీ ఖాన్, కీర్తి సురేష్ వంటి వారంతా భారతీరాజా భౌతికకాయాన్ని సందర్శించి నివాళులు అర్పించారు. తెలుగు రాష్ట్రాల నుంచి ఇరు ముఖ్యమంత్రులు భారతీరాజా మృతిపట్ల విచారం వ్యక్తం చేసి, ఆయన కుటుంబానికి సానుభూతిని తెలియజేశారు. చిరంజీవి, పవన్ కళ్యాణ్, రాజమౌళి, అల్లు అర్జున్ వంటి స్టార్స్ అందరూ సోషల్ మీడియా వేదికగా భారతీరాజా మృతిపై స్పందించారు. ఇంకా ఆయనతో అనుబంధం ఉన్న వారంతా నివాళులు అర్పిస్తూ, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నారు.
మరో వైపు తన గురువు అయిన భారతీరాజా మృతితో నటి రాధిక (Radhika) తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. ఇటీవల ఆమె నటించిన చిత్రం ‘తాయ్ కెళవి’ ఘన విజయం సాధించింది. భారతీరాజా అనారోగ్యంతో హాస్పిటల్‌లో ఉన్నపుడు ఆయనను కలిశారు రాధిక. తన ‘తాయ్ కెళవి’ని ఆయన అనారోగ్య కారణంగా చూడలేదనే బాధ ఉండేదని చెప్పిన రాధిక, ఆయన కోలుకుని సినిమా చూసిన అనంతరం తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఆ సినిమాకు కచ్చితంగా నేషనల్ అవార్డు వస్తుందని, తన గురువు చెప్పడంతో ఆమె ఎంతగానో సంతోషం వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని తలచుకుంటూ రాధిక కన్నీరుమున్నీరవుతున్నారు.
ఈ రోజు (బుధవారం) రాత్రి భారతీరాజా భౌతికకాయాన్ని ఆయన స్వగ్రామమైన థేని జిల్లాకు తరలించనున్నారు. వత్తలగుండుకు సమీపంలోని కుటుంబ వ్యవసాయ భూమిలో రాష్ట్ర ప్రభుత్వ అధికారిక గౌరవాలతో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. భారతీరాజాకు గౌరవ సూచకంగా తమిళనాడు టెలివిజన్ డిజిటల్ అండ్ ఓటీటీ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్.. షూటింగ్‌లను 12 గంటల పాటు నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది.
ఇవి కూడా చదవండి:
భారతీరాజా ‘సీతాకోకచిలుక’ హ్యాపీ ఎండింగ్‌కి కారణమిదే: ఏడిద రాజా
భారతీరాజా మృతికి ప్రముఖుల నివాళి
‘పెద్ది’ మైండ్ బ్లోయింగ్ స్ట్రాటజీ! నార్త్, ఓవర్సీస్‌లో ఇక తిరుగులేనట్టే!