భారతీరాజా ‘సీతాకోకచిలుక’ హ్యాపీ ఎండింగ్‌కి కారణమిదే: ఏడిద రాజా

ABN , Publish Date - Jun 10 , 2026 | 11:59 AM

మా పూర్ణోదయా సంస్థకి ఎనలేని కీర్తిని ఆర్జించి పెట్టిన ‘సీతాకోకచిలుక’ అనే దృశ్యకావ్యాన్ని భారతీరాజా దర్శకత్వంలో మేము నిర్మించడం గౌరవంగా భావిస్తున్నామని అన్నారు లెజెండరీ నిర్మాత ఏడిద నాగేశ్వరరావు కుమారుడు ఏడిద రాజా.

Edida Raja About Seethakoka Chilaka

మా పూర్ణోదయా సంస్థకి ఎనలేని కీర్తిని ఆర్జించి పెట్టిన ‘సీతాకోకచిలుక’ (Seethakoka Chilaka) అనే దృశ్యకావ్యాన్ని భారతీరాజా (Bharathiraja) దర్శకత్వంలో మేము నిర్మించడం గౌరవంగా భావిస్తున్నామని అన్నారు లెజెండరీ నిర్మాత ఏడిద నాగేశ్వరరావు (Edida Nageswara Rao) కుమారుడు ఏడిద రాజా (Edida Raja). అంతటి గొప్ప చిత్రాన్ని మాకు అందించిన భారతీరాజా ఇక లేరనే విషయం మాకు ఎంతో బాధను ఇస్తుందని పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన విడుదల చేసిన వీడియోలో.. ఆ సినిమాకు సంబంధించిన అనేక విషయాలను ఏడిద రాజా పంచుకున్నారు. ఈ వీడియోలో ఆయన మాట్లాడుతూ..

‘‘ప్రముఖ దర్శకులు భారతీరాజా ఈరోజు ఉదయం పరమపదించడం మాకు చాలా పెద్ద షాక్. ఎందుకంటే, మా పూర్ణోదయా సంస్థకి ఎనలేని కీర్తిని ఆర్జించి పెట్టిన ‘సీతాకోకచిలుక’ అనే దృశ్యకావ్యాన్ని ఆయన దర్శకత్వంలో మేము నిర్మించడం జరిగింది. ఆయన ఒక ట్రెండ్ సెట్టర్. తమిళ్ ఫిల్మ్ ఫీల్డ్‌కి ఒక ట్రెండ్ సెట్టర్. అంటే, అప్పటి వరకు స్టూడియోస్‌లోనే ఎక్కువ షూటింగ్‌లు జరిగే రోజుల నుంచి, ఒరిజినల్ లొకేషన్స్‌కి తీసుకువచ్చిన ఘనత భారతీరాజాకే దక్కుతుంది.


ఆయన తీసిన ‘16 వయదినిలే’ చిత్రం విడుదలైనప్పుడు, మా సంస్థలో అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేస్తున్న వంశీ మమ్మల్ని తీసుకెళ్లి ఆ సినిమా చూపించారు. ‘ఇటువంటి సినిమా మన సంస్థలో ఆయన దర్శకత్వంలో ఒకటి చేయాలి’ అని మా నాన్నగారిపై చాలా ఒత్తిడి తీసుకొచ్చారు. దాంతో మేము భారతీరాజాను కలవడం జరిగింది. అలాగే ఆయనతోటి ‘శంకరాభరణం’ తర్వాత చిత్రం చేయడం జరిగింది. అందరూ ‘శంకరాభరణం’ అంత గొప్ప విజయం సాధించింది, అంత పెద్ద సెన్సేషన్ అయింది, దాని తర్వాత వచ్చే చిత్రం ఎలా ఉంటుందో? అని అందరూ ఊహించే టైమ్‌లో, నెక్స్ట్ సినిమా ‘సీతాకోకచిలుక’ చేయడం పెద్ద సాహసం అనిపించింది. ఆ రోజుల్లో అందరూ.. ‘ఏంటండీ ఇది, అప్పుడేమో మ్యూజిక్‌తో చేశావు, ఇప్పుడేమో లవ్ స్టోరీ అంటావు, కొత్తవాళ్లు అంటున్నారు, ఏంటి?’ అని అన్నవారే.

అయినా కూడా మా నాన్న, భారతీరాజా మీద ఉన్న నమ్మకంతోటి.. అప్పట్లో ఆయన ‘అళైగళ్ ఓయి తిల్లై’ అనే సినిమాని డబుల్ లాంగ్వేజ్ చేద్దాం.. తెలుగులో మీరు చేయండి, తమిళ్‌లో నేను, ఇళయరాజా చేస్తున్నాం. తెలుగు వర్షన్ మీరు చేయండి అంటే, ఇది సైమల్టేనియస్ ప్రొడక్షన్ చేశాం. అది రీమేక్ సినిమా కాదు. అలా చేసిన సినిమా తమిళ్‌‌లోనూ ఘనవిజయం సాధించింది, అలాగే తెలుగులోనూ సంచలన విజయాన్ని అందుకుంది.


అలాగే భారతీరాజాలో ఉన్న గొప్ప విశేషం ఏంటంటే, ఆ కథ విషయంలో నాన్న ఏమైనా సలహాలు ఇచ్చినా కూడా, అది ఆలోచించి నిజంగా బాగుంటే అది అలాగే ఆయన తీసుకోవడం, అలాగే తెరకెక్కించడం జరిగేది. ఉదాహరణకి ‘సీతాకోకచిలుక’ క్లైమాక్స్ విషయంలో.. భారతీరాజా ట్రాజెడీ ఎండింగ్ చేద్దామని, నాన్న ‘వద్దు, దీన్ని హ్యాపీ ఎండింగ్ చేయాలి, ఇద్దరు వేర్వేరు కులాల పిల్లలు ఒకరినొకరు ప్రేమించుకుని, దానికి మనం అడ్డుకట్టగా వేయడం కరెక్ట్ కాదు, దాన్ని మనం ప్రోత్సహించాలి’ అని చెప్పి, దాన్ని అప్పటికప్పుడు డిస్కస్ చేసి మార్చారు. వాస్తవానికి అప్పటికే ట్రాజెడీగా తీసేశారు.. దానిని మళ్లీ మార్చి.. హ్యాపీ ఎండింగ్ ఇచ్చారు. రెండు లాంగ్వేజెస్‌లోనూ సూపర్ డూపర్ హిట్టై, అప్పట్లో తెలుగు ప్రేమకథల్లో ఆ సినిమా ఒక ట్రెండ్ సెట్టర్ అయింది. చాలామంది దర్శకులు ఇప్పటికీ ‘ఆ చిత్ర స్ఫూర్తితోనే మేము లవ్ స్టోరీస్ చేశాం’ అని చెప్పుకునే సందర్భాలు ఎన్నో ఉన్నాయి.

ఆ చిత్రానికి ఉత్తమ తెలుగు చిత్రంగా నేషనల్ అవార్డు వచ్చింది. అలాగే ఆంధ్రప్రదేశ్ నంది అవార్డ్స్‌లో చాలా నందులు, అలాగే ఉత్తమ దర్శకుడిగా, అలాగే సితార అవార్డ్స్, అలా ఇంకా ఎన్నో ఎన్నో సంస్థల నుంచి అవార్డ్స్ వచ్చాయి. అలాగే రష్యన్ భాషలోకి ‘సీతాకోకచిలుక’ డబ్ చేయబడింది. మా పూర్ణోదయా లిస్ట్ ఆఫ్ జెమ్స్‌లో ‘సీతాకోకచిలుక’ కూడా ఈక్వల్ ప్లేస్‌లో చోటు చేసుకుంది. అంతటి గొప్ప చిత్రాన్ని మాకు అందించిన భారతీరాజా ఇవాళ లేకపోవడం చాలా బాధగా ఉంది. ఆయన, ఆయన కుటుంబంలోని అందరికీ ధైర్యాన్ని కలిగించాలని, అలాగే భారతీరాజా ఆత్మకు శాంతి కలగాలని ఆ భగవంతుణ్ణి కోరుకుంటున్నాను’’ అని ఏడిద రాజా నివాళులు అర్పించారు.

ఇవి కూడా చదవండి:

భారతీరాజా మృతికి ప్రముఖుల నివాళి

‘పెద్ది’ మైండ్ బ్లోయింగ్ స్ట్రాటజీ! నార్త్, ఓవర్సీస్‌లో ఇక తిరుగులేనట్టే!

బాలయ్య అన్‌స్టాపబుల్ జోష్

మెగా హీరోస్ రేంజ్ అది.. మూడు వందల కోట్ల క్లబ్‌లో ఆ ముగ్గురు

Updated Date - Jun 10 , 2026 | 02:01 PM