8 వారాల తర్వాతే ఓటీటీల్లోకి సినిమా: డిస్ట్రిబ్యూటర్ల తీర్మానం
ABN, Publish Date - Oct 03 , 2026 | 08:59 AM
ఎంత పెద్ద సినిమా అయినా, 4 వారాలకే ఓటీటీకి వస్తుంది కాబట్టి.. ఇంకా థియేటర్లకు వెళ్లి చూడాల్సిన అవసరం ఏముంది అనేలా ప్రేక్షకులు కొందరు భావిస్తున్నారు. స్టార్ హీరో సినిమా అయితే తప్ప, థియేటర్లకు కదలడం లేదు.
కొత్త సినిమాలు విడుదలైన 8 వారాల తర్వాతే ఓటీటీల్లో విడుదల చేయాలని సినీ డిస్ట్రిబ్యూటర్ల సంఘం తాజాగా జరిగిన సమావేశంలో తీర్మానించింది. తమిళ చలనచిత్ర సినీ పంపిణీదారుల సంఘం (Tamil Film Distributors Association) నూతన కార్యవర్గం బాధ్యతల స్వీకరణ కార్యక్రమం చెన్నై నగరంలో జరిగింది. ఈ సంఘానికి నూతన అధ్యక్షుడుగా మోహన్ కుమార్, ఉపాధ్యక్షులుగా గణేష్ కుమార్, విజయ్ కుమార్.. కార్యదర్శిగా నందగోపాల్, కోశాధికారిగా కుమార్, ఇతర కార్యవర్గ సభ్యులు ఎన్నికయ్యారు. ఆ తర్వాత జరిగిన సమావేశంలో పలు తీర్మానాలు చేసి ఆమోదించారు.
కొత్త సినిమాలు విడుదలైన 8 వారాల తర్వాత ఓటీటీల్లో ప్రసారం చేయాలని తీర్మానం చేశారు. చిత్రపరిశ్రమను నమ్ముకుని థియేటర్ యజమానులు, పంపిణీదారులు ఇలా వేలాది మంది ఉన్నారని, వారందరి జీవనోపాధికి ఆటంకం లేకుండా చూడాలని కోరారు. నిర్మాతల సంఘాలు నిర్వహించే సమావేశాలకు పంపిణీదారులకు ఆహ్వానం లేదని, ఇకపై అన్ని సమావేశాలకు డిస్ట్రిబ్యూటర్లను కూడా ఆహ్వానించేలా చర్యలు తీసుకోవాలని కోరారు.
ప్రస్తుతం థియేటర్లలో రిలీజైన సినిమాలు 4 వారాలకే ఓటీటీలలోకి స్ట్రీమింగ్‌కు (OTT Streaming) వస్తోన్న విషయం తెలిసిందే. ఎంత పెద్ద సినిమా అయినా, 4 వారాలకే ఓటీటీకి వస్తుంది కాబట్టి.. ఇంకా థియేటర్లకు వెళ్లి చూడాల్సిన అవసరం ఏముంది అనేలా ప్రేక్షకులు కొందరు భావిస్తున్నారు. స్టార్ హీరో సినిమా అయితే తప్ప, థియేటర్లకు కదలడం లేదు. అలాగే సినిమాలో కంటెంట్ ఉండి, మౌత్ టాక్ బాగుంటేనే సినిమాలను చూసేందుకు థియేటర్లకు వస్తున్నారు.. లేదంటే ఓటీటీలలో చూసుకోవచ్చులే అని భావిస్తున్నారు. అందుకే థియేటర్ ఆక్యుపెన్సీ తగ్గిపోతుంది. అలా జరగకూడదంటే.. 8 వారాల తర్వాతే ఓటీటీల్లో సినిమాలను ప్రసారం చేయడం మంచిదని.. తమిళ చలనచిత్ర సినీ పంపిణీదారుల సంఘం భావించి, ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. చూద్దాం మరి.. ఈ నిర్ణయం ఎంత వరకు అమలు అవుతుందో..
ఇవి కూడా చదవండి:
RC17: చరణ్, సుక్కు మూవీ.. స్టార్ట్ కాకుండానే డెడ్‌లైన్!
రాజమౌళి బ్రాండ్‌కు అక్కడ ట్రబుల్!
‘ఆరుగురు పతివ్రతలు’ మళ్లీ వచ్చేస్తున్నారు.. రిలీజ్ డేట్ ఫిక్స్