‘ఆరుగురు పతివ్రతలు’ మళ్లీ వచ్చేస్తున్నారు.. రిలీజ్ డేట్ ఫిక్స్

ABN , Publish Date - Oct 02 , 2026 | 04:41 PM

రెండు దశాబ్దాల క్రితం తెలుగు చిత్రసీమలో ఒక ఊపు ఊపిన బోల్డ్ అండ్ రియలిస్టిక్ కామెడీ డ్రామా ‘ఆరుగురు పతివ్రతలు’ ఇప్పుడు గ్రాండ్‌ రీ-రిలీజ్‌కు సిద్ధమైంది.

Aaruguru Pativratalu Ready to Re Release

టాలీవుడ్‌లో రీ-రిలీజ్ ట్రెండ్ ప్రస్తుతం పీక్స్‌లో కొనసాగుతోంది. కేవలం స్టార్ హీరోల మాస్, కమర్షియల్ చిత్రాలు మాత్రమే కాకుండా.. అప్పట్లో బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ సృష్టించిన వైవిధ్యమైన కథా చిత్రాలు కూడా సరికొత్త హంగులతో మళ్లీ థియేటర్లలోకి వస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నాయి. ఈ క్రమంలోనే, సరిగ్గా రెండు దశాబ్దాల క్రితం తెలుగు చిత్రసీమలో ఒక ఊపు ఊపిన బోల్డ్ అండ్ రియలిస్టిక్ కామెడీ డ్రామా ‘ఆరుగురు పతివ్రతలు’ (Aaruguru Pativratalu) ఇప్పుడు గ్రాండ్‌ రీ-రిలీజ్‌కు సిద్ధమైంది.


హాస్య బ్రహ్మ, దివంగత లెజెండరీ దర్శకుడు ఇ.వి.వి. సత్యనారాయణ (EVV Satyanarayana) తన సొంత నిర్మాణ సంస్థ ‘ఇ.వి.వి. సినిమా’ బ్యానర్‌పై స్వీయ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించారు. 2004 ఫిబ్రవరి 6న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా.. విడుదలైన సమయంలో పోస్టర్లు, ప్రోమోలు, బోల్డ్ కంటెంట్‌‌తో టాలీవుడ్‌లో పెను సంచలనం సృష్టించింది. పెళ్లిళ్ల పేరిట జరిగే మోసాలు, పెళ్లయిన కొత్తలో భార్యాభర్తల మధ్య తలెత్తే ఈగోలు, అపార్థాలు, కాపురాల్లోని మనస్పర్థలను ఇ.వి.వి. గారు అత్యంత సహజంగా, కాస్త బోల్డ్‌గా చూపిస్తూనే.. ఆద్యంతం కడుపుబ్బా నవ్వించే కామెడీతో వెండితెరపై ఆవిష్కరించారు. సమాజంలోని చేదు నిజాలను హాస్యంతో మేళవించి ఆయన చెప్పిన తీరు ప్రేక్షకులను కట్టిపడేసి, థియేటర్లకు క్యూ కట్టేలా చేసింది.


ఇప్పుడీ కల్ట్ క్లాసిక్ చిత్రం సరికొత్త సాంకేతిక హంగులతో (4K అల్ట్రా హెచ్‌డీ, డాల్బీ సౌండ్‌తో) మరోసారి వెండితెరపై నవ్వుల పువ్వులు పూయించేందుకు ముస్తాబైంది. పోచమ్మ ఫిల్మ్స్ సమర్పణలో ఈ చిత్రాన్ని అక్టోబర్ 29న థియేటర్లలో గ్రాండ్‌గా రీ-రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటిస్తూ సరికొత్త రీ-రిలీజ్ పోస్టర్‌ను విడుదల చేశారు. కమలాకర్ సంగీతం అందించిన ఈ చిత్రానికి ప్రముఖ రచయిత జనార్థన మహర్షి సంభాషణలు సమకూర్చగా, నాగిరెడ్డి సినిమాటోగ్రఫీ అందించారు. రెండు దశాబ్దాల తర్వాత మళ్లీ థియేటర్లలోకి రాబోతున్న ఈ ఇ.వి.వి. మార్క్ బోల్డ్ కామెడీ ఎంటర్‌టైనర్ నేటి తరం ప్రేక్షకులను, పాత జ్ఞాపకాలను నెమరువేసుకునే సినీ ప్రేమికులను ఏ మేరకు అలరిస్తుందో చూడాలి!

ఇవి కూడా చదవండి:

డబ్బులిచ్చి మరి ‘సిగ్మా’పై నెగెటివ్ ప్రచారం చేయిస్తున్నారా? నమ్మవచ్చా!

శ్రీకాంత్ వదిలిన ‘మ్యాజిక్ మూవ్‌మెంట్స్’ ఫస్ట్ లుక్

‘హనుమాన్ అంశ్’ తెలుగు రిలీజ్ డేట్ ఫిక్స్.. గురూజీకి పోటీగా!

Updated Date - Oct 02 , 2026 | 04:42 PM