SIFPA: ఏకపక్ష నిర్ణయాలకు చెక్.. సినీ పరిశ్రమను కాపాడుకునే దిశగా నిర్మాతలు!
ABN , Publish Date - Apr 19 , 2026 | 05:14 PM
సినీ పరిశ్రమ ఉనికిని కాపాడుకోవడానికి దక్షిణాది చలనచిత్ర నిర్మాతలంతా ఏకమయ్యారు. సినీ నిర్మాణ రంగాన్ని ప్రమాదంలో పడేస్తున్న సవాళ్లను ఎదుర్కొనే లక్ష్యంతో దక్షిణాది చలనచిత్ర నిర్మాతల సంఘాన్ని ఏర్పాటు చేశారు.
సినీ పరిశ్రమ ఉనికిని కాపాడుకోవడానికి దక్షిణాది చలనచిత్ర నిర్మాతలంతా ఏకమయ్యారు. సినీ నిర్మాణ రంగాన్ని ప్రమాదంలో పడేస్తున్న సవాళ్లను ఎదుర్కొనే లక్ష్యంతో దక్షిణాది చలనచిత్ర నిర్మాతల సంఘం (SIFPA) పేరిట ఓ సంఘాన్ని ఏర్పాటు చేస్తూ.. స్టీరింగ్ కమిటీని ప్రకటించారు. ఈ మేరకు దక్షిణాది చలనచిత్ర నిర్మాతలంతా హైదరాబాద్‌లోని హోటల్ దసపల్లాలో ఏప్రిల్ 19, ఆదివారం సమావేశమయ్యారు. ఈ సమావేశానికి సంబంధించిన వివరాలను తెలుపుతూ, అధికారికంగా ఓ ప్రకటనను విడుదల చేశారు.
ఈ ప్రకటనలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళకు చెందిన ప్రముఖ చలనచిత్ర నిర్మాతలు, నిర్మాతల సంఘాల ప్రతినిధులు ఈ సమావేశానికి హాజరైనట్లుగా తెలిపారు. సినీ నిర్మాణ రంగాన్ని ప్రమాదంలో పడేస్తున్న సవాళ్లను ఎదుర్కోవడమే ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశ్యమని తెలియజేశారు. ఇంకా.. పరిశ్రమలోని ఇతర వర్గాలు పరస్పర చర్చలు లేకుండా థియేట్రికల్ నిబంధనల గురించి లేదా 8 వారాల OTT విండో నిబంధనల గురించి తీసుకునే ఏకపక్ష నిర్ణయాలను ఈ సమావేశం ఏకగ్రీవంగా ఖండించింది. వేలాది మంది జీవనోపాధికి కారణమవుతున్న ప్రస్తుత సినీ నిర్మాణ వ్యవస్థను రాత్రికి రాత్రే పాడుచేయలేమని, అటువంటి ఆకస్మిక మార్పులు వివిధ దశల్లో ఉన్న ప్రాజెక్టులకు భారీ గందరగోళాన్ని కలిగిస్తాయని నిర్మాతలు నొక్కిచెప్పారు.
సమావేశంలోని ముఖ్యాంశాలివే..
దక్షిణాది చలనచిత్ర నిర్మాతల సంఘం (SIFPA) ఏర్పాటు: నిర్మాతల ప్రయోజనాలను దీర్ఘకాలం పాటు కాపాడటానికి, ‘సౌత్ ఇండియన్ ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ (SIFPA)’ను ఏర్పాటు చేయడానికి అందరూ ఏకగ్రీవంగా అంగీకరించారు.
స్టీరింగ్ కమిటీ: నాలుగు దక్షిణాది భాషా చిత్ర పరిశ్రమల నుంచి ప్రతినిధులతో కూడిన ఒక ఉన్నత స్థాయి స్టీరింగ్ కమిటీని ఏర్పాటు చేశారు. ఇది తక్షణ సవాళ్లను పర్యవేక్షించడంతో పాటు, ఆయా ఇండస్ట్రీలలోని నిర్మాతల మధ్య సమన్వయాన్ని పెంచుతుంది.
నిర్మాతలకు సూచన: సభ్యులైన నిర్మాతలు తమ సినిమాల నిర్మాణం, హక్కుల విక్రయం, విడుదల తేదీల విషయంలో ఏ ఇతర సంఘం యొక్క నిబంధనలకు కట్టుబడకుండా, తమ సొంత నిర్ణయాలతో కొనసాగాలని సూచించారు.
OTT విండోస్ విషయంలో ఉండాల్సిన వైఖరి: OTT విడుదల విండోల విషయంలో ఎటువంటి హామీ పత్రాలను ఏ అసోసియేషన్‌కు లేదా రంగానికి ఇవ్వవద్దని నిర్మాతలను కోరారు. పరిశ్రమ ఆర్థిక భద్రతను దృష్టిలో ఉంచుకుని, ఇటువంటి నిబంధనలను అందరి చర్చల ద్వారా మాత్రమే నిర్ణయించుకోవాలి.
ఇవి కూడా చదవండి:
Raasi: మహేష్ ‘నిజం’ సినిమాలోని పాత్రపై రాశి షాకింగ్ కామెంట్స్!
పెళ్లికి సిద్ధమైన శృతిహాసన్.. ఆ లక్కీ వరుడు ఎవరో?
విష్ణుప్రియ దారిలోనే మరికొందరు.. ఆ కంటెంట్ కావాలంటే సబ్‌స్క్రైబ్ అవ్వాల్సిందే.