పునీత్ రాజ్‌కుమార్ చివరి క్షణాల్లో ఏం జరిగింది? డాక్టర్ సంచలన వ్యాఖ్యలు
ABN, Publish Date - Oct 15 , 2026 | 03:58 PM
కన్నడ చిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న నటుడు పునీత్ రాజ్‌కుమార్ మరణం అభిమానులను ఇప్పటికీ కలచివేస్తూనే ఉంటుంది.
కన్నడ చిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న నటుడు పునీత్ రాజ్‌కుమార్ (Puneeth Rajkumar) మరణం అభిమానులను ఇప్పటికీ కలచివేస్తూనే ఉంటుంది. ఎంతో ఆరోగ్యంగా, చురుగ్గా కనిపించిన ఆయన ఆకస్మికంగా కన్నుమూయడం సినీ ప్రపంచాన్ని తీవ్ర విషాదంలోకి నెట్టింది. అయితే, ఆయన మరణానికి ముందు జరిగిన పరిణామాల గురించి తాజాగా డాక్టర్ రమణారావు వెల్లడించిన వివరాలు మరోసారి చర్చనీయాంశంగా మారాయి. 2021 అక్టోబర్ 29న పునీత్ రాజ్‌కుమార్ కిక్‌బాక్సింగ్ వ్యాయామం చేసినట్లు డాక్టర్ రమణారావు తెలిపారు. సుమారు గంటన్నర పాటు వ్యాయామం చేసిన అనంతరం ఆయన తీవ్రంగా అలసిపోయి తన క్లినిక్‌కు వచ్చినట్లు వివరించారు. సాధారణంగా ఫిట్‌నెస్‌పై శ్రద్ధ చూపించే పునీత్ ఇలా రావడంతో ఆయన ఆరోగ్య పరిస్థితిని పరీక్షించినట్లు వెల్లడించారు.
ఈసీజీలో కనిపించిన కీలక సంకేతాలు
'పునీత్‌కు వైద్య పరీక్షలు నిర్వహించినప్పుడు ఈసీజీలో గుండెపై ఒత్తిడికి సంబంధించిన సంకేతాలు కనిపించాయి. పరిస్థితిని గుర్తించిన వెంటనే ఆయనను ఆసుపత్రికి తరలించేందుకు ఏర్పాట్లు చేశాం. అయితే, ఆసుపత్రికి చేరుకోవడానికి మరో నిమిషం మాత్రమే ఉందనగా ఆయన గుండె కొట్టుకోవడం ఆగిపోయింది. వెంటనే ఆయనకు వైద్య సహాయం అందించేందుకు ప్రయత్నించినప్పటికీ, పునీత్‌ను కాపాడలేకపోయాం' అని డాక్టర్ రమణారావు వెల్లడించారు.
అభిమానుల గుండెల్లో చెరగని స్థానం
పునీత్ రాజ్‌కుమార్ కేవలం నటుడిగానే కాకుండా సేవా కార్యక్రమాలతోనూ ఎంతోమంది అభిమానాన్ని సంపాదించుకున్నారు. తెరపై తన నటనతో కోట్లాది మంది హృదయాలను గెలుచుకున్న పునీత్ రాజ్‌కుమార్.. తన సేవా కార్యక్రమాలు, ఆప్యాయతతో అభిమానుల జ్ఞాపకాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. ఆయన ఆకస్మిక మరణం ఆరోగ్యం, గుండె సంబంధిత సమస్యల విషయంలో అప్రమత్తత ఎంత ముఖ్యమో గుర్తుచేసింది.