యశ్‌ని ‘రామాయణ’ ఏం చేస్తుందో..
ABN , Publish Date - Sep 02 , 2026 | 10:49 PM
‘కెజియఫ్’ సిరీస్ చిత్రాలు అందించిన భారీ విజయాల తర్వాత, నాలుగేళ్ల సుదీర్ఘ విరామం అనంతరం యశ్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చిన చిత్రం ‘టాక్సిక్’.
కన్నడ సినిమా పరిశ్రమను గ్లోబల్ స్థాయిలో నిలబెట్టిన రాకింగ్ స్టార్ యశ్ (Yash) కెరీర్‌లో ఇప్పుడు ఒక కీలక మలుపు వచ్చింది. ‘కెజియఫ్’ సిరీస్ చిత్రాలు అందించిన భారీ విజయాల తర్వాత, నాలుగేళ్ల సుదీర్ఘ విరామం అనంతరం ఆయనను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చిన చిత్రం ‘టాక్సిక్’ (Toxic). మొదట్లో ఈ సినిమాపై అండర్ వరల్డ్ బ్యాక్‌డ్రాప్, భారీ యాక్షన్ సీక్వెన్స్‌లు, రొమాన్స్‌ల కారణంగా అంచనాలు తారాస్థాయికి చేరాయి. కో ప్రొడ్యూసర్‌గా, రైటర్‌గా కూడా యశ్ ఈ ప్రాజెక్ట్ కోసం తీవ్రంగా శ్రమించారు. అయితే, థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయి ఫలితాన్ని అందుకోలేకపోయింది.
సుమారు నాలుగు వందల యాభై కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రానికి, ఐదు వందల కోట్ల థియేట్రికల్ రైట్స్ వ్యాపారం జరిగింది. వరల్డ్ వైడ్‌గా మూడు వందల ఐదు కోట్లకు పైగా వసూళ్లు సాధించినప్పటికీ, పెట్టిన పెట్టుబడి దృష్ట్యా ఈ చిత్రం సేఫ్ జోన్‌కి చేరడం కష్టంగా మారింది. ముఖ్యంగా సినిమాలో మోతాదు మించిన యాక్షన్, రొమాంటిక్ సన్నివేశాలు ఫ్యామిలీ ఆడియన్స్‌ను థియేటర్లకు దూరం చేశాయి. దీనివల్ల సోషల్ మీడియాలో ఈ చిత్రంపై కొంత ట్రోలింగ్ కూడా నడిచింది. రీసెంట్‌గా జీ5 సంస్థ ఈ సినిమా డిజిటల్ రైట్స్‌ను దక్కించుకోగా, ఇప్పుడు అందరి దృష్టి యశ్ నటిస్తున్న నెక్స్ట్ బిగ్ ప్రాజెక్ట్ ‘రామాయణ’ (Ramayana) వైపు మళ్ళింది. ప్రస్తుతం యశ్ కెరీర్‌ను పూర్తిగా మలచగల సత్తా ఉన్న చిత్రం ‘రామాయణ’. బాలీవుడ్‌లో దాదాపు నాలుగు వేల కోట్ల భారీ బడ్జెట్‌తో రెండు భాగాలుగా తెరకెక్కుతోన్న ఈ పౌరాణిక చిత్రంపై దేశవ్యాప్తంగా విపరీతమైన క్రేజ్ ఉంది. ఇందులో యశ్ అత్యంత శక్తివంతమైన పాత్ర అయిన రావణాసురుడిగా నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్‌లో రావణుడి లుక్, ఆయన హావభావాలు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి.
ఈ చిత్ర మొదటి భాగంలో రావణుడి పుట్టుక మొదలుకొని లంకేశ్వరుడిగా ఆయన ఎదుగుదల తీరును డైరెక్టర్ ఆవిష్కరించనున్నారు. ఇక కథకు అత్యంత కీలకమైన అసలు సిసలైన రామరావణ యుద్ధ ఎపిసోడ్స్ మాత్రం రెండో పార్ట్‌లో ఉండబోతున్నాయని సమాచారం. ఈ ఏడాది దీపావళికి మొదటి భాగం, వచ్చే ఏడాది దీపావళికి రెండో భాగం విడుదల కానుండటంతో చిత్ర బృందం ప్రమోషన్లను వేగవంతం చేస్తోంది. గతంలో ‘టాక్సిక్’ రిలీజ్ పనుల వల్ల ప్రమోషన్స్‌లో కాస్త వెనుకబడిన యశ్, ఇకపై పూర్తి సమయాన్ని రామాయణ కోసమే కేటాయించనున్నారు. ఈ ప్రాజెక్ట్ కనుక బాక్సాఫీస్ వద్ద అంచనాలను అందుకుంటే, రాముడిగా నటిస్తున్న రణ్‌బీర్ కపూర్‌తో పాటు రావణుడిగా చేస్తున్న యశ్‌కు కూడా ప్రపంచవ్యాప్తంగా చారిత్రాత్మక గుర్తింపు దక్కుతుంది. ఈ ఏడాది ‘టాక్సిక్’తో జరిగిన చేదు అనుభవాలను పూర్తిగా మర్చిపోయి, యశ్ ఈ ఏడాదిని రామాయణతో ఘనంగా ముగిస్తారా లేదా అనేది ఇప్పుడు టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు హాట్ టాపిక్‌గా మారింది. ఈ భారీ విజయం ఆయనను మళ్లీ బాక్సాఫీస్ రారాజుగా నిలబెట్టడం ఖాయమని ఆయన అభిమానులు భావిస్తున్నారు. చూద్దాం మరి.. ఏం జరుగుతుందో.
ఇవి కూడా చదవండి:
‘ఇరుముడి’.. స్కూల్ సీన్స్ కాంట్రవర్సీపై శివ నిర్వాణ క్లారిటీ
పవన్ కళ్యాణ్ బర్త్‌డే.. సినీ, రాజకీయ ప్రముఖుల నుంచి శుభాకాంక్షల వెల్లువ
పవన్ కళ్యాణ్‌పై ‘ఓజీ’ నటి శ్రియా రెడ్డి ఎమోషనల్ పోస్ట్