Mohanlal: దృశ్యం 3 తెలుగు హక్కులపై కోర్టుకెక్కిన శ్రీప్రియ!

ABN , Publish Date - May 21 , 2026 | 12:31 PM

దృశ్యం 3 తెలుగు హక్కుల విషయంలో మద్రాస్‌ హైకోర్టును రాజ్‌ కుమార్‌ సేతుపతి, శ్రీప్రియా సేతుపతి ఆశ్రయించారు. దీనికి సంబంధించిన వివరాలను మూడు వారాలలోగా కోర్టుకు సబ్ మిట్‌ చేయమని 'దృశ్యం 3' మేకర్స్ ను కోర్టు కోరింది.

Drishyam 3 Movie

'దృశ్యం' సినిమాలో కథానాయకుడు మోహన్ లాల్‌ (Mohanlal) కుటుంబానికి ఎన్ని కష్టాలు వచ్చాయో... నిజజీవితంలో ఆయన సినిమా మేకర్స్ కూ అనే కష్టాలు ఎదురవుతున్నాయి. 'దృశ్యం' సక్సెస్‌ అయిన తర్వాత దానికి సీక్వెల్ తీసినప్పుడూ రకరకాల ఇబ్బందులను మేకర్స్ ఫేస్‌ చేశారు. అలానే ఇప్పుడు 'దృశ్యం 3' (Drishyam 3) తెరకెక్కించినప్పుడూ హర్డిల్స్ వారికి తప్పడం లేదు. గురువారం ఈ సినిమాను మలయాళంతో పాటు తెలుగులోనూ డబ్బింగ్‌ చేసి మేకర్స్ రిలీజ్‌ చేశారు. అయితే... ఈ విడుదలకు ముందు కొన్ని నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. దృశ్యం, దృశ్యం 2 చిత్రాలను తెలుగులో రాజ్‌ కుమార్‌ థియేటర్స్ ప్రై.లి. సంస్థ విడుదల చేసింది. ఈ సినిమా మొదటి భాగాన్ని తెలుగులో నటి శ్రీపియ (Sreepriya) తన దర్శకత్వంలో రీమేక్‌ చేసింది. అయితే రెండో భాగానికి వచ్చే సరికీ మాతృకను డైరెక్ట్ చేసిన జీతూ జోసెఫ్‌ తెలుగు రీమేక్‌ నూ డైరెక్ట్ చేశాడు. అప్పుడు ఈ రెండు సంస్థలకు పెద్ద ఇబ్బందులు ఎదురు కాలేదు. కానీ ఇప్పుడు వెంకటేశ్‌ (Venkatesh) డేట్స్ ఖాళీ లేని కారణంగా 'దృశ్యం 3' సినిమాను ఆయన ఇప్పట్లో చేయలేని పరిస్థితి వచ్చింది. దాంతో మేకర్స్ మలయాళ చిత్రం 'దృశ్యం 3'నే తెలుగులో డబ్‌ చేయాలని అనుకున్నారు. ఈ మూవీ ఫ్రాంచైజ్‌ హక్కుల విషయంలో సినిమా విడుదలకు ఒక రోజు ముందు రాజ్‌ కుమార్ థియేటర్స్ ప్రై.లి. మద్రాస్‌ హైకోర్టులో దావా వేసింది.


'దృశ్యం 3' చిత్రానికి సంబంధించిన ప్రత్యేక తెలుగు హక్కుల సంపూర్ణ యజమానిగా ఉన్న రాజ్‌కుమార్ థియేటర్స్ ప్రైవేట్ లిమిటెడ్, శ్రీప్రియా సేతుపతి, రాజ్‌కుమార్ సేతుపతి ఆధ్వర్యంలో, తమ మేధో సంపత్తి హక్కులను రక్షించుకునేందుకు న్యాయపరమైన చర్యలు ప్రారంభించింది. మోహన్‌లాల్, మీనా తదితరులు నటిస్తున్న, జీతూ జోసెఫ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మలయాళ చిత్రం 'దృశ్యం 3' తెలుగు రీమేక్ హక్కులపై తమకే ప్రత్యేక యాజమాన్యం ఉందని పేర్కొంటూ మద్రాస్ హైకోర్టులో కేసు వేసింది. ఈ కేసులో ఆశీర్వాద్ సినిమాస్‌కు చెందిన ఎం.జే. ఆంటోనీ, దర్శకుడు జీతూ జోసెఫ్, పానోరమా స్టూడియోస్, పెన్ స్టూడియోస్‌తో పాటు వారి ప్రతినిధులు, ఉద్యోగులు, హక్కుదారులు, లైసెన్సుదారులు ఎవరైనా ప్రపంచవ్యాప్తంగా 'దృశ్యం 3'ను తెలుగులో రీమేక్ చేయడం, నిర్మించడం లేదా వాణిజ్యపరంగా వినియోగించడం ద్వారా రాజ్‌కుమార్ థియేటర్స్‌కు ఉన్న ప్రత్యేక కాపీరైట్ హక్కులను ఉల్లంఘించకుండా శాశ్వత నిషేధాజ్ఞ జారీ చేయాలని కోరింది. వాదిపక్షం తరఫున సీనియర్ న్యాయవాది కె. రవి వాదనలు వినిపించారు. వాదనలు విన్న మద్రాస్ హైకోర్టు ప్రతివాదులందరికీ అధికారిక నోటీసులు జారీ చేసి, మూడు వారాల్లో సమాధానం ఇవ్వాలని ఆదేశించింది.


రాజ్‌కుమార్ థియేటర్స్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రకారం, ఈ కేసు హైకోర్టులో పెండింగ్‌లో ఉన్న నేపథ్యంలో, 'దృశ్యం 3' తెలుగు రీమేక్ లేదా తెలుగు వినియోగ హక్కులకు సంబంధించి ఎవరైనా వ్యక్తి, సంస్థ, నిర్మాత, డిస్ట్రిబ్యూటర్, ఎగ్జిబిటర్, ఓటీటీ ప్లాట్‌ఫామ్, ఫైనాన్షియర్ లేదా మూడో పక్షం ఏదైనా ఒప్పందం, లైసెన్సింగ్ లేదా వాణిజ్య అవగాహనకు వస్తే, అది పూర్తిగా వారి స్వంత బాధ్యతపై జరుగుతుందని, ఈ కేసు తుది తీర్పుకు లోబడి ఉంటుందని పేర్కొంది. కోర్టు పేర్కొన్న అంశాలకు కట్టుబడే ఇప్పుడీ సినిమాను గురువారం తెలుగులోనూ విడుదల చేశారు. రాబోయే రోజుల్లో కోర్టు ఎలాంటి తీర్పును ఇస్తుందో చూడాలి. మద్రాస్‌ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల కారణంగా తెలుగు వర్షన్ విడుదల అవుతుందో లేదో అనే సందేహాలకు తెరదించుతూ, గురువారం దీనిని థియేటర్లలో ప్రదర్శించడంతో మోహన్‌ లాల్‌ అభిమానులు, 'దృశ్యం' అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.

ఇవి కూడా చదవండి:

చిరుకి కాదు.. బాలయ్యకు విలన్‌గా మనోజ్!

Peddi Movie: 24 గంటల్లో ‘పెద్ది’ ట్రైలర్ బీభత్సం.. హిస్టారికల్ రికార్డ్!

యంగ్ టైగర్‌కు పవర్ స్టార్ బర్త్‌డే విషెస్.. ట్వీట్ వైరల్!

నాకు కాబోయే భర్త ఇండస్ట్రీ వ్యక్తి కాకూడదు: అనన్య నాగళ్ల

Updated Date - May 21 , 2026 | 12:32 PM