దక్షిణాది దర్శకులను ప్రభావితం చేసిన భారతీరాజా!
ABN, Publish Date - Jun 10 , 2026 | 04:38 PM
భారతీరాజా దర్శకత్వంలో తెలుగులో జమదగ్ని చిత్రాన్ని ప్రముఖ దర్శక నిర్మాత నీలకంఠ నిర్మించారు. భారతీరాజా కేవలం దర్శకుడు మాత్రమే కాదని ఓ ఐకాన్ అని నీలకంఠ అభివర్ణించారు.
ప్రముఖ దర్శకుడు నీలకంఠ 'షో', 'మిస్సమ్మ', 'సదా మీ సేవలో' వంటి సెన్సిబుల్ మూవీస్ తెరకెక్కించారు. అయితే ఆయన దర్శకుడుగా మారకముందు ఓ సినిమాను నిర్మించారు. అదే 'జమదగ్ని'.
ప్రముఖ తమిళ దర్శకుడు భారతీరాజా మీద ఉన్న అభిమానంతో ఆయనతో తెలుగులో 'జమదగ్ని'ని నిర్మించారు నీలకంఠ. సూపర్ స్టార్ కృష్ణ, రాధ జంటగా నటించిన ఈ సినిమాలో కృష్ణ జర్నలిస్ట్ గా నటించారు. ఇళయరాజా సంగీతం అందించారు. అయితే కమర్షియల్ గా ఈ సినిమా కమర్షియల్ గా సక్సెస్ కాలేదు. అయినా భారతీరాజాపై తన అభిమానం అలాగే ఉందంటారు నీలకంఠ.
విశేషం ఏమంటే... భారతీరాజా 'జమదగ్ని'కి ముందు తెలుగులో తీసిన సినిమాలన్నీ తన తమిళ చిత్రాలకు రీమేక్స్ కాగా ఇది మాత్రమే స్ట్రయిట్ తెలుగు స్టోరీ. 'జమదగ్ని' తెలుగులో విడుదలైన తర్వాత దీనిని తమిళంలో డబ్ చేశారు.
భారతీరాజాను అమితంగా ఇష్టపడే దర్శక నిర్మాత నీలకంఠ ఆయన గురించి తన అభిప్రాయాన్ని ఈ విధంగా వ్యక్తం చేశారు.
''ఈ రోజు భారత సినీ ప్రపంచం ఓ దిగ్గజాన్ని కోల్పోయింది. భారతీరాజా కేవలం దర్శకులు మాత్రమే కాదు ఓ ఐకాన్. తమిళ సినిమాను ఒక కొత్త ఒరవడిలో నడిపించిన వ్యక్తి ఆయన. తమిళ కల్చర్, నేటివిటీ, రూరల్ లైఫ్ ను కళ్ళకు కట్టినట్టు చూపిన వ్యక్తి ఆయన. భారతీరాజా ఇన్ ఫ్లుయెన్స్ తమిళ సినిమా రంగం మీద మాత్రమే కాదు యావత్ దక్షిణాది భాషా సినిమాలపై ఉంది. ఆయన్ని చూసి ఎంతో మంది దర్శకులు తమ నేటివిటీకి, కల్చర్‌కు తగ్గ చిత్రాలను తీశారు. ఆయన ఎంతోమందికి ఇన్ స్పిరేషన్. ఒకానొక సమయంలో తమిళ సినిమాలన్నీ స్టూడియోలలోనే చిత్రీకరణ జరుపుకుంటున్న సమయంలో భారతీరాజా సినిమాను అవుట్ డోర్ కు తీసుకెళ్ళారు. ఓ ఫ్రెష్ నెస్ తీసుకొచ్చారు. బ్యూటీ యాడ్ చేశారు. దాన్ని ఆ తర్వాత ఎంతోమంది ఫాలో అయ్యారు.
భారతీరాజా డిఫరెంట్ జానర్స్ లో మూవీ చేశారు. సినిమా అనేది డిఫరెంట్ గా ఉండాలని కోరుకునేవారు. బ్యూటీఫుల్ లవ్ స్టోరీస్ తీశారు. రొమాంటిక్ మూవీస్ చేశారు. సోషల్ ఇష్యూస్ మీద సినిమాలు తీశారు. థ్రిల్లర్స్ తీశారు. 'సీతాకోక చిలుక, తిళక్కి పోగుం రైల్ (తూర్పు వెళ్ళే రైలు), సిగప్పు రోజాక్కల్ (ఎర్ర గులాబీ)'.... ఇవన్నీ ఆ కోవకు చెందినవే.
భారతీరాజా తీసే ప్రతి సినిమా కొత్తగా ఉండేది. కథను చాలా భిన్నంగా చెప్పేవారు. అందుకే అవన్నీ కమర్షియల్‌గా సక్సెస్ అయ్యాయి. అదే సమయంలో విమర్శకుల ప్రశంసలు అందుకునేవి. ఇలా రెండు వర్గాలను మెప్పించడం అనేది మామూలు విషయం కాదు. భారతీరాజా రాసుకునే కథ కానీ, పాత్రలు కానీ నిజ జీవితాన్ని దగ్గరగా ఉంటాయి. ఇలాంటి వాళ్ళను మనం చూశాం కదా అనిపించేలా ఉంటాయి. ప్రతి పాత్ర హార్ట్ టచ్చింగ్‌గా ఉంటుంది. అలానే భారతీరాజా సినిమాల్లో మరో గొప్పతనం సంగీతం. ఆయన సినిమాల్లో క్లాసిక్ సాంగ్స్ ఉంటాయి. ఆ పాటలను అప్పుడూ విన్నాం... ఇప్పుడూ వింటున్నాం. సంగీతం అనేది ఆయన సినిమాలకు గ్రేట్ ఎస్సెట్. సంగీతాన్ని ఆయన గొప్పగా అడ్మైర్ చేస్తారు. అందువల్లే అన్ని క్లాసికల్ సాంగ్స్ ఆయన సినిమాల నుంచి వచ్చాయి.
భారతీరాజా ఎంతోమంది కొత్త ఆర్టిస్టులను, టెక్నీషియన్స్ ను పరిచయం చేశారు. వారు ఉన్నత స్థాయికి చేరుకున్నారు. కొత్త వారితోనైనా అద్భుతంగా నటింపచేసే వారు. ఆయన గురించి ఓ మాట చెబుతూ ఉండేవారు. రాయినైనా... ఆయన గొప్పగా నటింపచేయగలరని అనుకునేవారు. అలా భారతీరాజా మలచిన వారిలో నేనూ ఒకడిని. నేను నిజానికి దర్శకుడు కావాలనే ఇండస్ట్రీకి వచ్చాను. ఆయన తమిళంలో తీసిన 'సిగప్పు రోజాక్కల్' నాకు బాగా నచ్చింది. దాంతో నా మిత్రుడితో కలిసి ఆయన డైరెక్షన్ లో 'జమదగ్ని'మూవీ నిర్మించాను. ఆ మూవీ సెట్స్ లో నేను దర్శకుడిగా ఎంతో నేర్చుకున్నాను. ఆ రకంగా ఆయనకు నేను ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలి. వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి''
ఇవి కూడా చదవండి:
భారతీరాజా ‘సీతాకోకచిలుక’ హ్యాపీ ఎండింగ్‌కి కారణమిదే: ఏడిద రాజా
భారతీరాజా మృతికి ప్రముఖుల నివాళి
‘పెద్ది’ మైండ్ బ్లోయింగ్ స్ట్రాటజీ! నార్త్, ఓవర్సీస్‌లో ఇక తిరుగులేనట్టే!