Vanda Devullu: నిజ సంఘటనతో తెరకెక్కిన సినిమా ఓటీటీలో...
ABN, Publish Date - Aug 04 , 2026 | 05:46 PM
విజయ్ ఆంటోని, స్వాసిక జంటగా నటించిన 'వంద దేవుళ్ళు' సినిమా ఈ నెల 7న జీ 5లో స్ట్రీమింగ్ కానుంది. నిజ సంఘటనల ఆధారంగా శశి ఈ సినిమాను తెరకెక్కించారు.
విజయ్ ఆంటోనీ తో 'బిచ్చగాడు' సినిమాను తెరకెక్కించిన శశి... పది సంవత్సరాల తర్వాత మళ్ళీ ఆయనతో రూపొందించిన సినిమా 'వంద దేవుళ్ళు'. విజయ్ ఆంటోనీ, ఫాతిమా విజయ్ ఆంటోని నిర్మించిన ఈ సినిమా జూన్ 19న థియేటర్లలో విడుదలైంది. దీనిని తమిళంలో 'నూరు సామి'గా తెరకెక్కించారు.
విజయ్ ఆంటోని, స్వాసిక, అజయ్ ధిషన్, లిజోమోల్ జోస్, కరుణాస్, కావ్య అనిల్, బాలాజీ శక్తివేల్, అరుల్ దాస్ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించారు. థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శితమైన ఈ చిత్రంలో భావోద్వేగాలకు దగ్గరగా ఉండే కథనం, ఆకట్టుకునే నటన, సమకాలీన సామాజిక అంశాలను సున్నితంగా చూపించిన తీరు కోసం ప్రేక్షకుల నుంచి మంచి ప్రశంసలు అందుకుంది. నిజ జీవిత ఘటనల ఆధారంగా రూపొందిన ఈ చిత్రం విధవరాలైన తల్లి సెల్వి కథను ఆవిష్కరించింది. భర్త మరణం తర్వాత పిల్లలను పెంచి పెద్ద చేసే క్రమంలో జీవితాన్ని వారికే అంకితం చేసిన ఆమె.. పిల్లలు పెద్దవాళ్ళైన తర్వాత జీవితంలో తోడుగా ఎవరో కావాలనుకుంటుంది. అలాంటి సమయంలో సమాజం నుంచి ఆమె ఎలాంటి ప్రతిఘటనలను ఎదుర్కోవాల్సి వచ్చింది? ఆమె పిల్లలు పెళ్ళి పెద్దలుగా మారి ఎలా తల్లి పెళ్ళి జరిపారన్నదే ఈ సినిమా కథ.
ఈ సినిమా జీ 5లో 7వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కాబోతోంది. ఈ సందర్భంగా దర్శకుడు శశి మాట్లాడుతూ, 'వంద దేవుళ్ళు నిజమైన భావోద్వేగాలు, నిజ జీవితాల నుంచి పుట్టిన కథ. వయస్సు లేదా సమాజపు ఆలోచనలు ఎలా ఉన్నా కూడా ఒక మహిళ తన ప్రేమ, అంగీకారం, సంతోషాన్ని ఎంచుకునే స్వేచ్ఛ గురించి చెప్పే కథను చెప్పాం. థియేటర్లలో ఈ సినిమాను ప్రేక్షకులు ఎంతగానో ఆదరించారు. ఇప్పుడు జీ 5 ద్వారా వీక్షకులకు చేరువ కానుండటం చాలా సంతోషంగా ఉంది' అని అన్నారు. విజయ్ ఆంటోని మాట్లాడుతూ ‘'ప్రతి సినిమాకీ ఒక లక్ష్యం ఉంటుంది. కానీ ‘వంద దేవుళ్లు’ సినిమా నాకెంతో ప్రత్యేకం. ఎందుకంటే ఇందులో ఉన్న భావోద్వేగాలు చాలా లోతైనవి. ఈ కథలో తల్లి, కొడుకుల మధ్య ఉన్న అనుబంధం ప్రధానంగా నిలుస్తుంది. సినిమాలో ఉన్న సందేశంతో ప్రేక్షకులు గాఢంగా బలంగా కనెక్ట్ అవుతారని నేను నమ్మాను. థియేట్రికల్ రిలీజ్ సమయంలో అదే జరిగింది. ఓటీటీలోనూ ఈ చిత్రానికి అలాంటి ఆదరణే లభిస్తుందని భావిస్తున్నాను' అని అన్నారు.
ఇవి కూడా చదవండి:
వరుస ఆఫర్లు.. మళ్లీ DSP ఫామ్‌లోకి వచ్చేసినట్టేనా?
తారక్ ‘డ్రాగన్’ షూటింగ్ ఆగిపోయిందా? అసలు విషయం ఏంటంటే
NBK112: అందుకు నో.. కొరటాల ప్లాన్ మారింది