Ranabaali:'సింగనమల బొబ్బిలి రణబాలి' ఓటీటీకి వచ్చేస్తున్నాడు
ABN, Publish Date - Nov 09 , 2026 | 12:07 PM
విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంటగా నటించిన పీరియాడిక్ యాక్షన్ డ్రామా ‘రణబాలి’ ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది.
విజయ్ దేవరకొండ(Vijay Devarakonda), రష్మిక మందన్న జంటగా నటించిన పీరియాడిక్ యాక్షన్ డ్రామా ‘రణబాలి’ (Ranabaali) ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ తేదీని ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ (netflix) అధికారికంగా ప్రకటించింది. నవంబర్ 13 నుంచి ఈ చిత్రం స్ట్రీమింగ్ కానుంది. తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లోనూ అందుబాటులోకి రానుంది. దీంతో థియేటర్లలో ఈ సినిమాను మిస్ అయిన ప్రేక్షకులు ఓటీటీలో వీక్షించేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ‘సింగనమల బొబ్బిలి రణబాలి వస్తున్నాడు’ అంటూ నెట్‌ఫ్లిక్స్ సోషల్ మీడియా వేదికగా ప్రత్యేక పోస్టర్‌ను విడుదల చేసింది. రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం అక్టోబర్ 16న దసరా కానుకగా థియేటర్లలో విడుదలైంది. 1800వ దశకంలో రాయలసీమలో నెలకొన్న కరువు పరిస్థితులు, బ్రిటిష్ పాలకుల దోపిడీకి వ్యతిరేకంగా సాగిన పోరాటం నేపథ్యంలో ఈ కథను రూపొందించారు. ఇందులో విజయ్ దేవరకొండ టైటిల్ పాత్రలో నటించగా, జయమ్మగా రష్మిక మందన్న కనిపించారు. థియేటర్లలో ఈ చిత్రానికి మిశ్రమ స్పందన లభించినప్పటికీ, విజయ్ – రష్మిక జంట కెమిస్ట్రీ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ‘గీత గోవిందం’, ‘డియర్ కామ్రేడ్’ సినిమాల తర్వాత విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న కలిసి నటించిన మూడో చిత్రమిది. టీ-సిరీస్ సమర్పణలో మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో నిర్మించారు.
కథ..
ఇది 1854 నుంచి 1878 మధ్య రాయలసీమ నేపథ్యంలో జరిగే కథ. శింగనమల కోటకు చెందిన రణబాలి (విజయ్ దేవరకొండ) కారణ జన్ముడు. తల్లి రాజమ్మ (ఈశ్వరీరావు) చనిపోయిన బిడ్డను ప్రసవించి, ఊరి దేవుడు భద్ర మల్లన్నను శరణువేడితే, ఆయన ఆ బిడ్డకు ప్రాణం పోసి, రెండు పుష్కారాలు జీవించి, తన బాధ్యతలను ముగించాక సమాధి అవుతాడని చెబుతాడు. అలా ఊరికోసం కొడుకును పెంచిన రాజమ్మ, యుక్తవయసులో రణబాలిని జయమ్మ (రశ్మిక మందణ్ణ)కు ఇచ్చి పెళ్ళి చేస్తుంది. ఈ దేశాన్ని కొల్లగొట్టడానికి వచ్చిన ఆంగ్లేయుల ఆకలి దాహం కారణంగా మద్రాస్ ప్రెసిడెన్సీ కరువుతో అల్లాడుతూ ఉంటుంది. మరీ ముఖ్యంగా రాయలసీమలోని ధాన్యాన్ని ఆంగ్లేయ అధికారి హెక్టర్ (ఆర్నాల్డ్ ఓస్లూ) బ్రిటన్ కు పంపడానికి ఉవ్విళ్ళూరు తుంటాడు. అలా చేస్తే కమీషనర్‌గా ఉన్న తనను క్వీన్ విక్టోరియా గవర్నర్‌ను చేస్తుందనే ఆశ అతనికి! ప్రజల ప్రాణాలను తీయడానికి కూడా వెనకాడని కిరాతకుడైన హెక్టార్ కు రణబాలి ఎలా బుద్ధి చెప్పాడు? తన ప్రాంతంలో కరువుతో అల్లాడుతున్న ప్రజల ఆకలిని ఎలా తీర్చాడు? అనేది ఈ చిత్ర కథ.
ALSO READ:
‘రామాయణం’పై వర్మ ప్రశంసల వర్షం.. విమర్శకులకు తనదైన స్టైల్లో కౌంటర్!
Daler Mehndi: ఉత్తరాఖండ్ వివాదం.. దలేర్ మెహందీ భావోద్వేగ పోస్ట్!
Chandini Chowdary: చాందిని చౌదరి.. బాబీ సింహ.. ఓ డార్క్ కామెడీ