Daler Mehndi: ఉత్తరాఖండ్ వివాదం.. దలేర్ మెహందీ భావోద్వేగ పోస్ట్‌!

ABN , Publish Date - Nov 09 , 2026 | 11:26 AM

ఇటీవల ఉత్తరాఖండ్ షో లో జరిగిన వివాదంపై దలేర్ మెహందీ స్పందించారు.

ప్రముఖ పంజాబీ గాయకుడు దలేర్ మెహందీ గురించి ప్రత్యేకించి పరిచయం అక్కర్లేదు. పంజాబీతో పాటు తెలుగులోనూ ఎన్నో పాటలు పాడారు. ‘గేమ్‌ ఛేంజర్‌’లోని ‘జరగండి జరగండి’, ‘బాహుబలి 2’లోని ‘సాహోరే బాహుబలి’, ‘బాద్‌షా’లోని ‘బంతిపూల జానకి’ పాటలతో తెలుగు ప్రేక్షకులను అలరించారు. తాజాగా ఆయన సోషల్ మీడియాలో భావోద్వేగ పోస్ట్ చేశారు.  ఉత్తరాఖండ్‌లో చేసిన షోలో ఎదురైన వివాదంపై తొలిసారి  స్పందించారు. దీపావళి పండుగ సందర్భంగా అభిమానులకు శుభాకాంక్షలు చెబుతూ పోస్ట్‌ పెట్టారు.  

‘‘ఇన్నేళ్లుగా మీరు నాపై చూపిస్తున్న ప్రేమ, ఆదరణ వెలకట్టలేనిది. నేను షో చేసిన ప్రతి వేదికపైనా మీ నుంచి ఎంతో ప్రేమను పొందాను. అయితే ఇటీవల ఎదురైన అనుభవం నన్ను తీవ్రంగా బాధించింది. ఆ సమయంలో మీరు నాకు అండగా నిలిచిన తీరు, నా తరఫున మాట్లాడిన విధానం, నాపై ఉంచిన నమ్మకం ఎంతో ధైర్యాన్ని ఇచ్చాయి. మీరు పంపిన ప్రతి సందేశాన్ని చదివాను. మీ ప్రేమకు నా హృదయం కృతజ్ఞతతో నిండిపోయింది’’ అని పేర్కొన్నారు. ఈ సందర్భంగా తన కుటుంబం అందించిన మద్దతును కూడా దలేర్‌ మెహందీ గుర్తుచేసుకున్నారు. ‘‘ఆ సమయంలో నా కుటుంబమే నాకు కొండంత అండగా నిలిచింది. ముఖ్యంగా నా సోదరుడు నాకు ఎంతో ధైర్యాన్ని ఇచ్చాడు. సంగీత ప్రపంచం మొత్తం నా వెంటే నిలిచింది. ఇలాంటి వ్యక్తులు నా జీవితంలో ఉండటం నిజంగా నా అదృష్టం. సాధారణంగా ఓ కళాకారుడి గొప్పతనం, ఆయన ప్రయాణం గురించి   మరణించిన తర్వాత ఎక్కువగా మాట్లాడుకుంటారు. కానీ, నేను జీవించి ఉండగానే ఇంతటి ప్రేమాభిమానాలను చూడగలగడం ఎంతో సంతోషంగా ఉంది. ప్రతి ఒక్కరికీ వ్యక్తిగతంగా సమాధానం ఇవ్వలేకపోయినా.. మీరు చూపించిన ప్రేమను మాత్రం ఎప్పటికీ మర్చిపోలేను’’ అని తన పోస్ట్‌లో రాసుకొచ్చారు.


అసలు ఏం జరిగిందంటే.. 

ఉత్తరాఖండ్‌లోని తెహ్రీ జిల్లాలో నవరాత్రి వేడుకల్లో భాగంగా ఓ వేదికపై పాట పాడుతుండగా.. నరేంద్రనగర్ ఎమ్మెల్యే, ఉత్తరాఖండ్ మంత్రి సుబోధ్ ఉనియాల్ వేదికపైకి వెళ్లి దలేర్ మెహందీ పాటను అడ్డుకున్నారు. ‘‘నవరాత్రుల సందర్భంగా దుర్గామాత కోసం ఏర్పాటు చేసిన  కార్యక్రమం ఇది. ఇలాంటి వేదికపై మద్యం తాగి పాడటం ఏమాత్రం సరికాదు. 'సరిగా మాట్లాడలేకపోతున్నావ్‌.. ఏం పాడతావ్‌’’ అంటూమంత్రి ఆగ్రహం వ్యక్తంచేశారు. అయితే, ‘‘దయచేసి స్టేజి దిగండి' అంటూ దలేర్‌ మెహందీ రెండు చేతులు జోడించి మంత్రికి విజ్ఞప్తి  చేశారు.  కాసేపటి తర్వాత మంత్రి స్టేజీని వీడారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. 

Updated Date - Nov 09 , 2026 | 12:05 PM