Gandhari Movie: తాప్సీ 'గాంధారి' ఎలా ఉందంటే...
ABN, Publish Date - Sep 03 , 2026 | 04:59 PM
తాప్సీ నటించిన 'గాంధారి' మూవీ ప్రస్తుతం నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది. కిడ్నాప్ యాక్షన్ డ్రామాగా రూపుదిద్దుకున్న 'గాంధారి' ఎలా ఉందో తెలుసుకుందాం.
ప్రముఖ నటి తాప్సీ పన్ను నటించిన కిడ్నాప్ యాక్షన్ డ్రామా 'గాంధారి' శుక్రవారం నుంచి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమా ప్రచార సమయంలో కంగనా, తాప్సీ నడుమ ఆసక్తికరమైన మాటల యుద్థం సాగి, ఉచిత ప్రచారం బాగానే లభించింది. అయితే... ఈ మూవీ మాత్రం ఆ స్థాయిలో లేకపోవడంతో తాప్సీ అభిమానులు నిరాశకు గురవుతున్నారు.
ఈ సినిమా కథ పశ్చిమ బెంగాల్ లోని జాయ్‌పుర్రా అనే పట్టణంలో జరుగుతుంది. బాని (తాప్సీ పన్ను), ఆమె భర్త గోకుల్ (ఇష్వాక్ సింగ్) కళ్ళముందే పట్టపగలు వాళ్ళ ఐదేళ్ళ పాప మిష్టీ కిడ్నాప్‌కు గురవుతుంది. ఓ చీరకట్టుకున్న మహిళ ఈ పాపను కిడ్నాప్ చేస్తుంది. తన నిర్లక్ష్యం వల్లే ఇలా జరిగిందనే అపరాధభావనకు లోనైన బాని... మానసికంగా కృంగిపోతుంది. ఎవరి నుంచి సరైన సహకారం లభించకపోవడంతో చివరకు తానే సవ్యంగా రంగంలోకి దిగి పాపను వెతకడం మొదలు పెడుతుంది. అయితే ఈ క్రమంలో ఆమె ప్రమాదానికి గురై కంటిచూపును కోల్పోతుంది. ఇలాంటి కఠినమైన పరిస్థితులలో తన కూతురు పిల్లల అక్రమ రవాణా ముఠా చేతిలో పడిందేమోననే అనుమానం బాని కి కలుగుతుంది. చూపు కోల్పోయిన ఈ మధ్య తరగతి మహిళ తన కూతురును తిరిగి పొందగలిగిందా? ఈ క్రమంలో ఆమె ఎలాంటి అడ్డంకులను ఎదుర్కొందనేది 'గాంధారి' సినిమా కథ.
గతంలో రచయిత్రి కనికా థిల్లాన్... తాప్సీతో 'మన్మర్జియాన్, హసీన్ దిల్ రుబా' సినిమాలకు వర్క్ చేసింది. ఈ రెండు చిత్రాలు నటిగా తాప్సీకి మంచి పేరు తెచ్చిపెట్టాయి. కానీ ఈ సినిమా విషయానికి వచ్చే సరికీ బలహీనమైన కథ కారణంగా తాప్సీ నటిగా తన సత్తాను చాటలేకపోయింది. పైగా ఈ సినిమా చూస్తున్నంత సేపు ఇదే నేపథ్యంలో రూపుదిద్దుకున్న విద్యాబాలన్ 'కహానీ' మన మనసులో మెసులుతూ ఉంటుంది. తప్పిపోయిన వారి ఆచూకీ కోసం ఓ మహిళ పడే అగచాట్లే రెండు సినిమాల్లోని కామన్ పాయింట్ కావడం అందుకు కారణం. అయితే 'కహానీ' సినిమాలో ఉన్నటువంటి భావోద్వేగాలకు ఇక్కడ చోటు దక్కలేదు. పైగా దర్శకుడు దేవాశిష్ మఖిజా తన ఇష్టానుసారంగా కథను ఊహించని మలుపులు తిప్పేశారు. లాజిక్ లకు ఏమాత్రం ఆస్కారం లేని విధంగా ఈ ప్రయాణం సాగింది. ఉద్విగ్నకరమైన సంఘటనలు చోటు చేసుకుంటాయని వ్యూవర్స్ భావించే సమయంలో ఊహించని మలుపులను పెట్టేశారు. దాంతో సినిమా గ్రాఫ్ ఒక్కసారిగా పడిపోయింది. పైగా సినిమా క్లయిమాక్స్ కూడా హెవీగా ఉండి వీక్షకుల సహనాన్ని పరీక్షిస్తుంది. కూతురు కోసం ఓ తల్లి పడే మనోవ్యధపై దర్శకుడు దృష్టి పెట్టకుండా దీనిని హెవీ యాక్షన్ క్లయిమాక్స్ తో ముగించేయడం నిరాశకు గురిచేస్తుంది. ఎప్పుడో పాతికేళ్ళ నాటి రివేంజ్ డ్రామాను ఇప్పుడు చూపించిన ఫీలింగ్ కలుగుతుంది.
చిత్రం ఏమిటంటే... ఈ సినిమా కథంతా పశ్చిమ బెంగాల్‌లో జరిగినట్టు ఉంటుంది. కానీ చిత్రీకరణ మొత్తం ముంబైలోనే జరిగిందనిపిస్తుంది. ఎందుకంటే పశ్చిమ బెంగాల్ జీవన శైలి, అక్కడి వాతావరణం పూర్తిగా ప్రత్యేకంగా ఉంటాయి. కానీ వాటి పట్ల మేకర్స్ శ్రద్ధ చూపించలేదు. ఈ మొత్తం కిడ్నాప్ డ్రామాలో పోలీస్‌లను ఇన్వాల్వ్ చేసినా... ఆ వ్యవస్థను సరైన రీతిలో చూపించడంలో విఫలమయ్యారు. పైగా 'గాంధారి' అనే టైటిల్ కారణంగా ఓ తెలియని బరువును మేకర్స్ ఎత్తుకున్నట్టు అయ్యింది. చాలామందికి ఈ సినిమా చూస్తుంటే 'కహానీ' మాత్రమే కాదు... ఇటీవల వచ్చిన నిమిషా సజయన్ 'బబితాసింగ్ రిపోర్టింగ్' మూవీ కూడా గుర్తొస్తుంది. ఎందుకంటే ఈ తాజా చిత్రం కూడా మంచి విజయాన్ని సాధించింది. కానీ వాటితో పోల్చినప్పుడు తాప్సీ 'గాంధారి' మూవీ వీక్షకుల కళ్ళకు గంతలు కట్టిన చందంగా ఉంది.
ఇవి కూడా చదవండి:
హీరోయిజం కాదు.. ఇప్పుడు దర్శకులదే హవా
‘టాక్సిక్’ ఇంగ్లీష్ వెర్షన్ డేట్ ఫిక్స్.. వర్కవుట్ అవుతుందా
Pakeezah: అక్టోబర్‌లో ఫ్రాన్స్‌లో రీస్టోర్డ్ వెర్షన్ ప్రీమియర్