మీసం తీసేయ్.. అన్నందుకు మణిరత్నంకు నో చెప్పిన శరత్ కుమార్.. విషయమిదే!
ABN, Publish Date - Sep 10 , 2026 | 09:35 AM
స్టార్ డైరెక్టర్ మణిరత్నం సినిమాలో ఒక్క చిన్న ఛాన్స్ వచ్చినా చాలు అనుకునే నటీనటులు ఎందరో ఉంటారు. కానీ, అలాంటి దిగ్గజ దర్శకుడికే హెచ్చరికలు జారీ చేశారు నటుడు శరత్ కుమార్.
స్టార్ డైరెక్టర్ మణిరత్నం (Mani Ratnam) సినిమాలో ఒక్క చిన్న ఛాన్స్ వచ్చినా చాలు అనుకునే నటీనటులు ఎందరో ఉంటారు. కానీ, అలాంటి దిగ్గజ దర్శకుడి పెట్టిన నిబంధనలు నచ్చక, ముఖం మీదే ‘నో’ చెప్పడమే కాకుండా పత్రికాముఖంగా హెచ్చరికలు జారీ చేసిన అరుదైన సంఘటన గతంలో జరిగింది. సీనియర్ నటుడు శరత్ కుమార్ (Sarathkumar), మణిరత్నం మధ్య జరిగిన ఆ పాత వివాదానికి సంబంధించిన వార్తా కథనం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఆ వివరాల్లోకి వెళితే.. మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన క్లాసిక్ చిత్రం ‘ఇద్దరు’ (తమిళంలో ‘ఇరువర్’). ఈ సినిమాలో ఓ కీలక పాత్ర కోసం తొలుత బాలీవుడ్ దిగ్గజాలు మిథున్ చక్రవర్తి, నానా పటేకర్ తదితరులను సంప్రదించగా వారు నిరాకరించారు. ఆ తర్వాత ఆ పాత్ర కోసం శరత్ కుమార్‌ను మణిరత్నం సంప్రదించారు. అయితే, చర్చల సందర్భంగా మణిరత్నం ఏకపక్షంగా పలు షరతులు పెట్టారట. పాత్ర కోసం వెంటనే మీసం తీసేయాలని, జుట్టు అంటకత్తెర వేయించుకోవాలని, రేపటి నుంచే షూటింగ్‌కు రావాలని, పారితోషికం కూడా తాను చెప్పినంత మాత్రమే ఇస్తానని ఆర్డర్ వేశారట.
మణిరత్నం పెట్టిన ఈ ఏకపక్ష షరతులపై శరత్ కుమార్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆ ప్రాజెక్ట్‌ను తిరస్కరించారు. అనంతరం పత్రికాముఖంగా ఘాటు ప్రకటన విడుదల చేస్తూ మణిరత్నంపై విరుచుకుపడ్డారు. ‘‘నేనేమన్నా ఖాళీగా ఉన్నాననుకున్నాడా? రేపే షూటింగ్ అంటాడు, ఇంతే ఇస్తానంటాడు. పైగా ఇతర సినిమాల్లో నా కంటిన్యూటీ గురించి ఆలోచించకుండా మీసం తీసేయ్, క్రాపు చేయించు అని ఆర్డర్లేస్తాడేంటి? తనేం చెబితే అది అందరూ చేయాలా? ఏంటా పొగరు?’’ అంటూ నిలదీశారు. అంతేకాకుండా, ‘‘మణిరత్నం గారూ.. మీరు పెద్ద దర్శకులే కావొచ్చు. కానీ ఇతరులను అణగదొక్కాలనుకోకండి. అందరినీ గౌరవించడం నేర్చుకోండి. మీరు తెలివైనవారే, కానీ ఇతరులు చవటలనుకోకండి’’ అంటూ గట్టి హెచ్చరిక జారీ చేశారట. కాగా, ఇంతమంది కాదన్న ఆ ప్రతిష్టాత్మక వేషాన్ని (తమిళనాడు మాజీ సీఎం కరుణానిధి పాత్రను పోలిన రోల్) చివరకు విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ (Prakash Raj) పోషించి, బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ జాబితాలో జాతీయ అవార్డును సైతం గెలుచుకున్నారు.
ఇవి కూడా చదవండి:
హాలీవుడ్ స్క్రీన్స్‌పై ‘రామాయణ’ మేనియా.. ఇంగ్లీష్ ట్రైలర్ అదిరింది
‘సిగ్మా’ స్టోరీ లైన్ చెప్పేసిన జాసన్ సంజయ్.. ఇంట్రెస్టింగ్
ప్రభాస్ రేసు నుంచి తప్పుకుంటే.. ఆ ముగ్గురిదే హవా