NT Ramarao: కాసుల వర్షం కురిపించిన 'పిడుగు రాముడు'
ABN, Publish Date - Sep 10 , 2026 | 01:07 PM
నటరత్న యన్టీఆర్ - దర్శక మాయావి విఠలాచార్య కాంబోలో వచ్చిన ఐదవ చిత్రం 'పిడుగు రాముడు'. అరవై ఏళ్ళ క్రితం 'పిడుగు రాముడు' మ్యూజికల్ హిట్ గా జనాన్ని విశేషంగా అలరించింది.
యన్టీఆర్- బి.విఠలాచార్య కాంబోలో తెరకెక్కిన అనేక చిత్రాలు జనాన్ని విశేషంగా అలరించాయి. వీరిద్దరి కాంబినేషన్ లో రూపొందిన సినిమాలు రిపీట్ రన్స్ లో థియేటర్స్ వారికి సక్సెస్ ఫుల్ ఫీడింగ్ గా నిలిచాయి. వసూళ్ళ వర్షాలు కురిపించేవి. అలా నిర్మాతలకు పెట్టుబడిని మించిన రాబడి చూపించేవి. ఆ కోవకు చెందిన సినిమానే 'పిడుగు రాముడు'. ఈ చిత్రాన్ని డీవీయస్ ప్రొడక్షన్స్ పతాకంపై డీవీయస్ రాజు నిర్మించారు. 1966 సెప్టెంబర్ 10వ తేదీన విడుదలైన 'పిడుగు రాముడు' విశేష విజయం సాధించింది. రిపీట్ రన్స్ లోనే నిర్మాతకు పెట్టుబడికి ఎన్నో రెట్లు సంపాదించి పెట్టిందీ సినిమా. ఈ చిత్రానికి టీవీ రాజు సమకూర్చిన సంగీతం ఓ ప్రత్యేక ఆకర్షణ. సి.నారాయణ రెడ్డి, కొసరాజు పాటలు రాశారు. సముద్రాల జూనియర్ రచనతో ఈ సినిమా రూపొందింది. రాజశ్రీ, ఎల్.విజయలక్ష్మి ఇందులో నాయికలుగా నటించారు. రాజనాల, రేలంగి, పద్మనాభం, అల్లు రామలింగయ్య, మిక్కిలినేని, రాజబాబు, జగ్గారావు, వాణిశ్రీ, ఋష్యేంద్రమణి, మణిమాల, మీనాకుమారి ఇతర పాత్రధారులు.
'పిడుగు రాముడు' కథ అంతకు ముందు యన్టీఆర్ - విఠలాచార్య కాంబోలో వచ్చిన 'బందిపోటు'లాగే ఉంటుంది. అయితే ఇందులో ఇద్దరు నాయికల మధ్య సాగే కథను జోడించి రక్తి కట్టించారు విఠలాచార్య. యన్టీఆర్ అంటేనే మారువేషాలకు పెట్టింది పేరు. ఆ సూత్రాన్ని అనుసరిస్తూ యన్టీఆర్ తో తన సినిమాల్లో విశేషంగా మారువేషాలు వేయించారు విఠలాచార్య. 'పిడుగు రాముడు'లో తన చెల్లెలిని ప్రతినాయకుని బారి నుండి కాపాడేటప్పుడు ముసుగు వేషంలో వెళ్ళి పోరాడేటప్పుడు యన్టీఆర్ మారువేషంలో కనిపిస్తారు. ఇక ప్రత్యర్థులు వెంటాడుతుండగా తప్పించుకొనే క్రమంలోనూ యన్టీఆర్, పద్మనాభం ఆడవేషాల్లో కనిపిస్తారు. వారిపై చిత్రీకరించిన 'రంగులు రంగులు..." పాట సైతం వినోదం పంచుతుంది. తరువాత ప్రతినాయకుణ్ణి బురిడీ కొట్టించే క్రమంలో యన్టీఆర్, పద్మనాభం ఇద్దరూ మంత్రగాళ్ళుగా మారువేషాల్లో వెళ్ళి "శ్రీ" భాష మాట్లాడుతూ మురిపించారు.
'పిడుగు రాముడు'అనగానే అభిమానులకు ఇందులోని పాటలు ముందుగా గుర్తుకు వస్తాయి. "ఈ రేయి నీవూ నేను...", "పిలిచిన పలుకవు ఓ జవరాలా...", "మనసే వెన్నెలగా మారెను లోలోన..." ఈ యుగళగీతాలను యన్టీఆర్, రాజశ్రీపై చిత్రీకరించారు. ఇక టీజింగ్ సాంగ్ గా "చినదానా... చినదానా..." రూపొందింది. ఇందులో యన్టీఆర్, రాజనాల, రాజశ్రీ కనిపిస్తారు. యన్టీఆర్, పద్మనాభం లేడీ గెటప్స్ వేసినప్పుడు "రంగులు రంగులు..." అంటూ సాగే పాట వస్తుంది. మరో నాయికగా నటించిన ఎల్.విజయలక్ష్మిపై మూడు పాటలు రూపొందాయి. "కొమ్మల్లో పాలపిట్టా...", "మిల మిల మెరిసే...", "రా రా కౌగిలి చేర... రా రా దొరా..." పాటల్లో ఎల్.విజయలక్ష్మి నృత్యం ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ఇక వాణిశ్రీ, పద్మనాభంపై చిత్రీకరించిన 'నిండు అమాసా... నిశిరేతిరి కాడ...' పాట కూడా అలరించింది. ఇలా 'పిడుగు రాముడు'లోని తొమ్మిది పాటలూ విశేషాదరణ పొందినవే. దాంతో ఈ సినిమా రిపీట్ రన్స్ లో పాటలు మొదలవుతూ ఉండగానే అభిమానుల ఈలలతో థియేటర్స్ మారుమోగిపోయేవి. 'పిడుగు రాముడు' చిత్రానికి ముందు యన్టీఆర్ నటించిన 'శ్రీకృష్ణతులాభారం' విడుదలయింది. ఆ సినిమా గుడ్ టాక్ తో సాగుతూ ఉండగా రెండు వారాలకే వచ్చిన 'పిడుగు రాముడు' కారణంగా చప్పబడిపోయింది. అదే సంవత్సరం 'పిడుగు రాముడు' కంటే మూడు నెలలు ముందుగా వచ్చిన యన్టీఆర్- విఠలాచార్య చిత్రం 'అగ్గిబరాటా' సైతం విజయకేతనం ఎగురవేసింది. అందులోనూ రాజశ్రీ నాయికగా నటించారు. అలా ఒకే ఏడాది ఒకే హీరో- ఒకే హీరోయిన్ నటించిన రెండు జానపద చిత్రాలను సక్సెస్ రూటులో సాగేలా చేశారు విఠలాచార్య. రిపీట్ రన్స్ లో 'పిడుగు రాముడు' కొన్ని కేంద్రాలలో ఒకే సంవత్సరం రెండు సార్లు విడుదలయిన సందర్భాలూ ఉన్నాయి. అంతలా 'పిడుగు రాముడు' అలరించింది. ఈ నాటికీ బుల్లితెరపై 'పిడుగు రాముడు' ప్రసారమవుతూ ఉంటే టీవీలకు అతుక్కుపోతూంటారు అభిమానులు.
ఇవి కూడా చదవండి:
జయం రవి బర్త్‌డే స్పెషల్.. ‘వడ్డీ కాసులవాడ’ న్యూ పోస్టర్ వైరల్
200 కోట్ల నుంచి 30 కోట్లకు పతనం.. ‘టాక్సిక్’కు దెబ్బ మీద దెబ్బ
15 ఏళ్లుగా నాలో దాచుకున్న ఆవేదన, ఎమోషన్ ఇది: ఉదయభాను