200 కోట్ల నుంచి 30 కోట్లకు పతనం.. ‘టాక్సిక్’కు దెబ్బ మీద దెబ్బ

ABN , Publish Date - Sep 10 , 2026 | 11:09 AM

‘కెజియఫ్’ సిరీస్ చిత్రాలతో పాన్ ఇండియా స్థాయిలో తిరుగులేని ఇమేజ్ సొంతం చేసుకున్న రాకింగ్ స్టార్ యశ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన భారీ చిత్రం ‘టాక్సిక్’. ఈ చిత్ర ఓటీటీ రైట్స్‌కు సంబంధించి ఇప్పుడో వార్త వైరల్ అవుతోంది.

Toxic OTT Rights

‘కెజియఫ్’ సిరీస్ చిత్రాలతో పాన్ ఇండియా స్థాయిలో తిరుగులేని ఇమేజ్ సొంతం చేసుకున్న రాకింగ్ స్టార్ యశ్ (Rocking Star Yash) ప్రధాన పాత్రలో తెరకెక్కిన భారీ చిత్రం ‘టాక్సిక్’ (Toxic). గీతూ మోహన్‌దాస్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం అనౌన్స్‌మెంట్ నుంచే దేశవ్యాప్తంగా భారీ అంచనాలను ఏర్పడేలా చేసుకుంది. ముఖ్యంగా యశ్ మార్కెట్ క్రేజ్ దృష్ట్యా ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ (ఓటీటీ) హక్కుల విలువ కూడా మొదట్లో ఆకాశాన్ని తాకింది. అప్పట్లో ప్రముఖ అంతర్జాతీయ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లు ఈ సినిమా అన్ని భాషల డిజిటల్ రైట్స్ కోసం ఏకంగా రూ. 200 కోట్లకు పైగా ఆఫర్ (Toxic OTT Offer) చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు ప్రచారం జరిగింది. ఒక సౌత్ సినిమాకు ఈ స్థాయి ఓటీటీ బిజినెస్ జరగడం నిజంగా భారతీయ చలనచిత్ర రంగాన్నే ఆశ్చర్యపరిచింది. అయితే, థియేటర్లలో విడుదలైన తర్వాత సీన్ పూర్తిగా మారిపోవడంతో ఇప్పుడు ఓటీటీ మార్కెట్‌లో కూడా ఊహించని షాక్ తగిలింది.


పాన్ ఇండియా లెవెల్‌లో విడుదలైన ‘టాక్సిక్’ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోయింది. మొదటి ఆట నుంచే మిశ్రమ స్పందన రావడంతో పాటు కలెక్షన్లు కూడా దారుణంగా పడిపోయాయి. కథ, కథనాల్లో లోపాలు, ప్రేక్షకులను కట్టిపడేయలేకపోవడంతో ఈ భారీ చిత్రం థియేటర్ల వద్ద తీవ్ర పరాజయాన్ని మూటగట్టుకుంది. దీని ప్రభావం నేరుగా సినిమా పోస్ట్-థియేట్రికల్ డిజిటల్ బిజినెస్‌పై కూడా పడింది. మొదట్లో రూ. 200 కోట్లుగా అంచనా వేసిన ఈ సినిమా డిజిటల్ వాల్యుయేషన్.. ప్రస్తుతం పాతాళానికి పడిపోయిందని ఇండస్ట్రీ వర్గాల్లో గట్టి చర్చ నడుస్తోంది. ఇప్పుడు డిజిటల్ రైట్స్ కోసం బయ్యర్లు కనీసం రూ. 30 కోట్లు కూడా ఇచ్చేందుకు ముందుకు రావడం లేదనేది తాజా సమాచారం.


థియేటర్లలో తీవ్ర నిరాశ ఎదురైన తర్వాత ప్రముఖ స్ట్రీమింగ్ దిగ్గజాలు నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో వంటి సంస్థలు ఈ ప్రాజెక్ట్ నుంచి వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం, ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ ‘జీ5’ (ZEE5) మాత్రమే అత్యధిక బిడ్డర్‌గా నిలిచిందని, అది కూడా కేవలం రూ. 30 కోట్ల సమీపంలో మాత్రమే ఆఫర్ చేస్తోందని టాక్ వైరల్ అవుతోంది. మొదట ఆశించిన రూ. 200 కోట్ల మార్కెట్‌తో పోల్చితే ఇది దాదాపు 85 శాతానికి పైగా భారీ పతనం కావడం సినీ పరిశ్రమను తీవ్ర విస్మయానికి గురిచేస్తోంది. బాక్సాఫీస్ ఫలితం తారుమారైతే ఒక స్టార్ హీరో సినిమా డిజిటల్ విలువ ఎంత దారుణంగా పడిపోతుందో చెప్పడానికి ఈ పరిణామం తాజా ఉదాహరణగా నిలుస్తోంది. మరి రానున్న రోజుల్లో మేకర్స్ ఈ డీల్‌ను ఎలా క్లోజ్ చేస్తారో వేచి చూడాలి.

ఇవి కూడా చదవండి:

15 ఏళ్లుగా నాలో దాచుకున్న ఆవేదన, ఎమోషన్ ఇది: ఉదయభాను

మీసం తీసేయ్.. అన్నందుకు మణిరత్నంకు నో చెప్పిన శరత్ కుమార్.. విషయమిదే!

హాలీవుడ్ స్క్రీన్స్‌పై ‘రామాయణ’ మేనియా.. ఇంగ్లీష్ ట్రైలర్ అదిరింది

Updated Date - Sep 10 , 2026 | 11:09 AM