మేనమామ నాగార్జునతో మేనల్లుడు సుమంత్ సినిమా!
ABN, Publish Date - Oct 26 , 2026 | 05:58 PM
అక్కినేని నాగార్జున, సుమంత్ కలిసి నటించిన స్నేహమంటే ఇదేరా సినిమా 2001 అక్టోబర్ 26న విడుదలైంది. కులశేఖర్ దర్శకత్వంలో ఆర్.బి. చౌదరి నిర్మించిన ఈ చిత్రంలో భూమిక, ప్రత్యూష కీలక పాత్రల్లో నటించారు.
రియల్ లైఫ్ లో మేనమామ-మేనల్లుడు అయిన అక్కినేని నాగార్జున- సుమంత్ ఆన్ రీల్ ఫ్రెండ్స్ గా నటించిన చిత్రం 'స్నేహమంటే ఇదేరా'. ఇందులో వీరిద్దరి స్నేహితునిగా సుధాకర్ నటించారు. మళయాళంలో సిద్ధిఖ్ తెరకెక్కించిన 'ఫ్రెండ్స్' ఆధారంగా 'స్నేహమంటే ఇదేరా' రూపొందింది. 2001 అక్టోబర్ 26న విడుదలైన ఈ చిత్రాన్ని కులశేఖరన్ దర్శకత్వంలో సూపర్ గుడ్ ఫిలిమ్స్ పతాకంపై ఆర్.బి.చౌదరి నిర్మించారు. అంతకు ముందు నాగార్జునతో సూపర్ గుడ్ మూవీస్ నిర్మించిన 'నువ్వు వస్తావని' బంపర్ హిట్ గా నిలచింది. దాంతో నాగ్ కాంబోలో సూపర్ గుడ్ మూవీ కాబట్టి 'స్నేహమంటే ఇదేరా'పై మొదటి నుంచీ ఆసక్తి నెలకొంది. పైగా ఇందులో నాగ్, సుమంత్ కలసి నటించడంతో ఫ్యాన్స్ లోనూ ఓ స్పెషల్ క్రేజ్ ఉండేది. అలా ఊరించిన 'స్నేహమంటే ఇదేరా' సినిమాలో భూమిక నాగార్జున జోడీగా నటించారు. సుమంత్ జంటగా ప్రత్యూష కనిపించగా, అభినయశ్రీ, బ్రహ్మానందం, ఆలీ, శ్రీమాన్, వేణుమాధవ్, తనికెళ్ళ భరణి, చలపతిరావు, సంగీత, గిరిబాబు, సత్యప్రియ, జయప్రకాశ్ రెడ్డి, రమాప్రభ, సనా ఇతర ముఖ్యపాత్రధారులు.
అరవింద్, చంద్రు, కిమూ అనే ముగ్గురు స్నేహితుల మధ్య సాగే కథతో ఈ సినిమా తెరకెక్కింది. ప్రాణానికి ప్రాణంగా సాగే ఆ స్నేహితుల మధ్య పొరపొచ్చాలు తలెత్తుతాయి. తన తమ్ముడిని చిన్నప్పుడే అరవింద్ చంపాడని చంద్రు తెలుసుకుంటాడు. అరవింద్, చంద్రు మధ్య దూరాన్ని తగ్గించే ప్రయత్నం చేస్తాడు కిమూ. చివరకు అన్ని స్పర్థలు తొలగి ముగ్గురు మిత్రులు మళ్ళీ కలుసుకోవడంతో కథ సుఖాంతమవుతుంది.
ఈ చిత్రానికి శివశంకర్ స్వరకల్పన చేయగా, డైరెక్టర్ కులశేఖర్, మృత్యుంజయుడు, చిర్రావూరి విజయ్ కుమార్ పాటలు రాశారు. ఇందులోని కథ, కథనం ఆకట్టుకొనేలా రూపొందింది. అయితే ఆశించిన స్థాయిలో సక్సెస్ సాధించలేదు. కానీ, సుమంత్ కు నటునిగా మంచి మార్కులు సంపాదించి పెట్టిందీ చిత్రం.
ఇవి కూడా చదవండి:
సౌందర్య అంత అందంగా ఉండేది కాబట్టే.. దేవుడు తీసుకెళ్లిపోయాడు: ఆమని
రజనీతో రజనీకే పోటీ.. టాప్-3లో ఒకడే కింగ్
సూర్యకు ఈ ఏడాది త్రిపుల్ ధమాకా.. అదే జరిగితే హిస్టరీనే