సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

జీవకళను బుల్లెట్లు శాశ్వతంగా చంపలేవు: యండమూరి

ABN, Publish Date - Sep 08 , 2026 | 11:46 AM

శ్రీనగర్ లో సెప్టెంబర్ 7న అంతర్జాతీయ చలన చిత్రోత్సవం మొదలైంది. ఈ సందర్భంగా ప్రముఖ రచయిత, దర్శకుడు యండమూరి వీరేంద్రనాథ్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.

Yandamuri Veerendranath

ప్రముఖ రచయిత, దర్శకుడు యండమూరి వీరేంద్రనాథ్‌ సాహితీ ద్రష్ట. సమాజంలో కొన్నేళ్ళ తర్వాత జరుగబోయే అంశాలను కూడా ముందే ఊహించి తన రచనలలో పొందుపర్చుతూ ఉంటారాయన. యండమూరి ప్రస్తావించిన అనేకానేక అంశాలు దశాబ్ద కాలం తర్వాత కళ్ళ ముందు కనిపించేసరికీ చాలామంది ఆశ్చర్యానికి లోనవుతూ ఉంటారు. దేశ రాజకీయాలనే కాదు అంతర్జాతీయ విషయాలను సైతం సరిగా అంచనా వేయడంలో యండమూరి సిద్ధహస్తులు. యండమూరి రాసిన నవలల ఆధారంగా అగ్ర కథానాయకులు బాక్సాఫీస్ హిట్స్ ను అందుకున్నారు. మరీ ముఖ్యంగా చిరంజీవి - యండమూరిది సూపర్ హిట్‌ కాంబినేషన్‌. పలు చిత్రాలకు దర్శకత్వం కూడా వహించిన యండమూరిని తెలంగాణ ప్రభుత్వం ఇటీవల గద్దర్ సినీ అవార్డుల ప్రదానోత్సవంలో రఘుపతి వెంకయ్య అవార్డుతో సత్కరించింది. ఆ సందర్భంగా తాను అందుకున్న నగదు పారితోషికాన్ని సైతం ఆయన పలు సేవా, సామాజిక సంస్థలకు విరాళంగా అందించారు.

ప్రస్తుతం శ్రీనగర్‌లో అంతర్జాతీయ చలన చిత్రోత్సవం జరుగుతోంది. దాని గురించి యండమూరి ప్రస్థావిస్తూ, 'జీవకళను బుల్లెట్లు కొంతకాలం మౌనంగా చేయగలవు; శాశ్వతంగా చంపలేవు. కాశ్మీర్‌లో మళ్లీ వెలిగింది కేవలం వెండితెర మాత్రమే కాదు. భయాన్ని జయించి తిరిగి వచ్చిన సాధారణ జీవితం కూడా' అని తన సోషల్ మీడియా ఖాతాలో పేర్కొన్నారు.


శ్రీనగర్‌లో జరుగుతున్న అంతర్జాతీయ చలన చిత్రోత్సవం గురించి యండమూరి వెలిబుచ్చిన అభిప్రాయం ఇది:

కాశ్మీర్ ప్రజలకు- ఆ మాటకొస్తే భారతదేశ ప్రజలందరికీ శుభవార్త.

2026 సెప్టెంబర్ 7 నుంచీ శ్రీనగర్‌లో 41 దేశాలకు చెందిన 135 అంతర్జాతీయ చిత్రాలు ప్రదర్శితమవుతున్నాయి.

‘ఇందులో గొప్పతనం ఏముంది? అంతర్జాతీయ చలనచిత్రోత్సవాలు జరగడం సాధారణమే కదా!’ అని కొంతమందికి అనిపించవచ్చు.

కానీ కాశ్మీర్‌లో సినిమా హాళ్ళు లేవు!!

సినిమా సంస్కృతి కనుమరుగై నలభై సంవత్సరాలు అయింది!!

పెద్ద తెరపై సినిమా చూడకుండానే 'ఒక తరం' పెరిగింది!

కాశ్మీర్ ప్రజలు థియేటర్‌లో సినిమా చూడాలంటే 300 కిలోమీటర్లు ప్రయాణించి జమ్మూకు వెళ్లాల్సి వచ్చేది.

1980 వరకు కాశ్మీర్లో 15 సినిమా థియేటర్లు ఉండేవి. ఉగ్రవాద సంస్థ ‘అల్లాహ్ టైగర్స్’ బెదిరింపులతో వాటన్నిటికీ తాళాలు పడ్డాయి. 1999లో ‘నీలమ్’, ‘రీగల్’, ‘బ్రాడ్‌వే’ థియేటర్లను మళ్లీ తెరిచారు. కానీ ‘రీగల్ సినిమా హాలు’పై జరిగిన గ్రెనేడ్ దాడిలో ఒక ప్రేక్షకుడు మరణించడంతో మళ్ళీ ఆ ప్రయత్నం నిలిచిపోయింది.

భారత ఆక్రమిత కాశ్మీర్‌లో ప్రజలకి సినిమా చూసే అవకాశ౦ కూడా ఉండదు - అని చెప్పటం ఉగ్రవాద ముఠాల ఉద్దేశ్యం.

వారి ఆశలను వమ్ము చేస్తూ, శ్రీనగర్‌లో ఇప్పుడు ఒక ఆధునిక మల్టీప్లెక్స్ ప్రారంభమైంది. ప్రస్తుతం అక్కడే (92 దేశాల నుంచి వచ్చిన దాదాపు 1,100 చిత్రాల్లో 135 చిత్రాలతో- సైన్యం నిరంతర పహారాలో) అంతర్జాతీయ చలనచిత్రోత్సవం జరుగుతోంది.

దాల్ సరస్సుపై తేలియాడే తెరను ఏర్పాటు చేయడం మరో ప్రత్యేకత.

జీవకళను బుల్లెట్లు కొంతకాలం మౌనంగా చేయగలవు ; శాశ్వతంగా చంపలేవు. కాశ్మీర్‌లో మళ్లీ వెలిగింది కేవలం వెండితెర మాత్రమే కాదు. భయాన్ని జయించి తిరిగి వచ్చిన సాధారణ జీవితం కూడా. అందుకే ఇది- కేవలం కాశ్మీర్ ప్రజలకే కాదు, భారతదేశ ప్రజలందరికీ శుభవార్త.

- యండమూరి వీరేంద్రనాథ్‌

ఇవి కూడా చదవండి:

Hanuman Ansh: ‘హనుమాన్ అంశ్’ గురుకుల విద్యార్థుల సందడి..

Priyanka Chopra: బిగ్‌బాస్‌ 20లో మేరీకోమ్ ఎంట్రీ.. కంటెస్టెంట్లకు ప్రియాంక చోప్రా సరదా వార్నింగ్!

Updated Date - Sep 08 , 2026 | 11:53 AM