Bade Ghulam Ali Khan: ముత్తాతను స్మరించుకున్న ఫజల్‌ అలీఖాన్‌ కసూరి

ABN , Publish Date - Apr 25 , 2026 | 06:22 PM

ఉస్తాద్‌ బడే గులాం అలీఖాన్‌ వర్థంతి సందర్భంగా ఆయన సమాధి చెంత అభిమానులు నివాళులు అర్పించారు. సంగీతానికి మతం లేదని నిరూపించిన వ్యక్తి ఉస్తాద్‌ సాబ్‌ అని రైల్వే ఉన్నతాధికారి రవి పాడి తెలిపారు. ఈ కార్యక్రమంలో బడే గులాం అలీఖాన్‌ ముని మనవడు ఫజల్‌ అలీఖాన్‌ కసూరి పాల్గొన్నారు.

Ustad Bade Ghulam Ali Khan

సంగీత ప్రపంచంలో ఉన్నతమైన కళాకారులు 'ఉస్తాద్‌' అని గౌరవంగా పిలుచుకునే సంగీత సమ్రాట్‌, అభినవ తాన్‌సేన్‌ బడే గులాం అలీఖాన్‌ సాబ్‌. బ్రిటీష్‌ ఇండియాలోని పంజాబ్‌ రాష్ట్రంలో 1902 ఏప్రిల్‌ 2న పుట్టిన ఆయన గాత్ర మాధుర్యం అనన్య సామాన్యమైనది. పాటియాలా ఘరానాకు చెందిన బడే గులాం అలీఖాన్‌ (Ustad Bade Ghulam Ali Khan) సరోద్‌, తబలా కూడా అద్భుతంగా వాయించే వారు. ఆయన పాడే ఠుమ్రీలను ఆస్వాదించని సంగీతాభిమానులు అప్పట్లో లేరంటే అతిశయోక్తి కాదు. ఘంటసాల (Ghantasala), చిత్తూరు వి. నాగయ్య, పి.లీల, ఎమ్మెస్‌ సుబ్బలక్ష్మీ, లతా మంగేష్కర్‌ వంటి వారికి బడే గులామ్ అలీ ఖాన్‌ అంటే విపరీతమైన అభిమానం. ప్రముఖ గాయకులు మహమ్మద్‌ రఫీ (Md. Rafi) ఆయనకు ప్రత్యక్ష శిష్యులు. ప్రముఖ సినీ దర్శకులు, చిత్రకారులు బాపు (Bapu) అయితే... బడే గులాం అలీఖాన్‌ గానాన్ని వింటూ బొమ్మలు గీసే వాడినని చెబుతుండేవారు.

ravi.jpg


దేశ విభజన తర్వాత పాకిస్తాన్ నుండి భారత్‌కు వచ్చేసిన బడే గులాం అలీఖాన్‌ హైదరాబాద్‌లోనే స్థిర నివాసం ఏర్పరుచుకున్నారు. తన శేష జీవితాన్ని ఇక్కడే గడిపారు. 1968లో తుదిశ్వాస విడవడానికి కొన్ని నెలల ముందు ఆయన పక్షవాతంతో బాధపడ్డారు. అయితే చాలామంది 1968 ఏప్రిల్ 25న బడే గులాం అలీఖాన్‌ కన్నుమూశారని అనుకుంటారు. కానీ ఆయన తుదిశ్వాస విడిచింది ఏప్రిల్ 23న. పాకిస్తాన్‌ సహా వివిధ ప్రాంతాల నుంచి చివరి చూపుగా బంధువులు, స్నేహితులు వచ్చిన తర్వాత బడే గులాం అలీఖాన్‌ పార్థీవ దేహానికి ఏప్రిల్ 25న హైదరాబాద్‌ ఓల్డ్ సిటీ సుల్తాన్‌ షాహి ఏరియాలో ఉన్న అమీర్‌ మోమిన్‌ దాయిరాలో అంత్యక్రియలు నిర్వహించారు.

రైల్వే ఉన్నతాధికారి, సంగీతాభిమాని రవిప్రసాద్‌ పాడి (Ravi Prasad Padi) 1995 నుండి తన మిత్రులతో కలిసి బడే గులాం అలీఖాన్‌ సమాధిని సందర్శించి నివాళులు అర్పించడం ఆనవాయితీగా పెట్టుకున్నారు. ఈ యేడాది కూడా ఏప్రిల్‌ 25న బడే గులాం అలీఖాన్‌ సమాధిని సందర్శించి, గులాబీ పూలతో అలంకరించి, బడే గులాం అలీఖాన్‌ సాబ్‌కు ఇష్టమైన బెల్లం జిలేబీని సమాధి చెంత ఉంచి నివాళులు అర్పించారు. విశేషం ఏమంటే... బడే గులాం అలీఖాన్‌ ముని మనవడు ఫజల్‌ అలీ ఖాన్‌ కసూరి కూడా ఈసారి ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. బడే గులాం అలీఖాన్‌ విద్వత్తును రవి పాడి అక్కడి వారికి వివరించగా, ఫజల్‌ అలీ ఖాన్‌ కసూరి తన ముత్తాతను స్మరిస్తూ రాగాలాపన చేసి అక్కడి వారిని మంత్రముగ్థులను చేశారు.

IMG_2415.JPG


పాకిస్తాన్‌లో ఉండలేక భారత్‌కు వచ్చిన బడే గులామ్‌ అలీ ఖాన్‌కు అప్పట్లో మొరార్జీ దేశాయ్‌ భారత పౌరసత్వం ఇవ్వగా, నిజాం ప్రధానమంత్రి కోరిక మేరకు బడే గులాం అలీ ఖాన్‌ హైదరాబాద్‌ బషీర్ బాగ్‌లోని బషీర్‌ మహల్‌లో నివాసం ఉన్నారు. అందుకే ఆయన తదనంతరం ఆ వీధికి ఉస్తాద్‌ బడే గులాం అలీఖాన్‌ రోడ్‌ అని నామకరణం చేశారు.

bg1.jpg

సినిమాల్లో పాట పాడటం అస్సలు ఇష్టంలేని బడే గులాం అలీఖాన్‌, కె. ఆసీఫ్‌ దర్శకత్వం వహించిన 'మొఘల్‌ ఎ ఆజామ్‌' చిత్రం కోసం నౌషాద్‌ అలీ సంగీత దర్శకత్వంలో రెండు పాటలు పాడటం విశేషం. భారత ప్రభుత్వం ఆయనను 1962లో పద్మభూషణ్‌తో గౌరవించింది. గాత్ర సంగీతంలో గాయక గాయనీమణులు ఆలంబన కోసం ఉపయోగించే తంబూర (తాన్‌పుర)కు ప్రత్యమ్నాయంగా సురమండల్‌ ను రూపొందించిన ఘనత బడే గులాం అలీ ఖాన్‌ దే! ఠుమ్రీ ప్రక్రియను బాగా ప్రాచుర్యంలోకి తీసుకొచ్చింది కూడా ఆయనే.

ఇవి కూడా చదవండి:

Varanasi: మహేష్ కోసమే ఆ కష్టాలు.. జక్కన్న పక్కా ప్లానింగ్!

స్రవంతి చొక్కారపు.. చీరకట్టులో ఎంత అందంగా ఉందో!

అందుకే చిరు.. ‘ఠాగూర్’ సినిమాపై రాజశేఖర్ ఆసక్తికర వ్యాఖ్యలు

‘పెద్ది’ రిలీజ్ డేట్.. మరోసారి ‘లెనిన్’ త్యాగం చేయాల్సిందేనా!

Updated Date - Apr 25 , 2026 | 06:34 PM