ష్ గప్ చుప్... కోలీవుడ్ సైలెంట్...
ABN, Publish Date - May 04 , 2026 | 04:52 PM
విజయ్ విజయంపై టాలీవుడ్ ప్రముఖులు బాహాటంగా స్పందించారు. ఆయన్ని అభినందించారు. కానీ కోలీవుడ్ తీరు వేరుగా ఉంది. విజయ్ విజయాన్ని వారు అస్సలు పట్టించుకోవడం లేదు.
తమిళనాడులో విజయ్ (Vijay) పార్టీ తమిళగ వెట్రి కళగం (TVK) మంచి దూకుడు మీదుంది. ఈసారి జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అతి పెద్ద పార్టీగా టీవీకే నిలచింది. రెండు, మూడు స్థానాల కోసం అన్నా డీఎంకె., డీఎంకే పోటీ పడుతున్నాయి. ఎన్నికలు పూర్తి కాగానే ఒక్క యాక్సిస్ మై ఇండియా తప్ప మిగిలిన ఎగ్జిట్ పోల్ సంస్థలన్నీ కూడా దాదాపుగా డీఎంకే గెలుస్తాయని తెలిపాయి. ఒకటి రెండు సంస్థలు మాత్రం అన్నా డీఎంకే గెలిచే ఛాన్స్ ఉందని చెప్పాయి. కానీ ఎగ్జిట్ పోల్స్ అంచనాలు తిరుగరాస్తూ విజయ్ పార్టీ అధికారం దిశగా సాగిపోతోంది.
చిత్రం ఏమంటే విజయ్ ఎన్ని స్థానాల్లో విజయం సాధించ బోతున్నాడో ఇంకా తెలియకముందే... ఆయన పార్టీ వందకు పైగా సీట్లలో ఆధిక్యతను అందుకోగానే తెలుగు సినిమా రంగానికి చెందిన యువ కథానాయకులంతా వరుసగా విజయ్‌ను అభినందనలతో ముంచెత్తారు. ఆయన పార్టీ సాధించిన అనూహ్య విజయానికి ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు. కానీ తమిళనాడులోని హీరోలెవ్వరూ కూడా విజయ్‌ను ఇంతవరకూ అభినందించలేదు. సీనియర్ స్టార్ హీరోలే కాదు... యువ కథానాయకులు సైతం విజయ్‌ను ప్రశంసించలేదు. వారంతా వ్యూహాత్మక మౌనం పాటించడానికి కారణం తెలియాల్సి ఉంది.
నిన్నటి వరకూ తమిళనాడులో డీఎంకే అధినేత స్టాలిన్ (Stalin) ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆయన కొడుకు నటుడు, నిర్మాత, పంపిణీదారుడు ఉదయనిధి స్టాలిన్ (Udayanidhi Stalin) ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. సినిమా రంగంలో ఈ కుటుంబానికి విడదీయలేని అనుబంధం ఉంది. దాంతో విజయ్ పార్టీ అందుకున్న అపూర్వ విజయాన్ని ఏమాత్రం బాహాటంగా పొగిడినా... రాబోయే రోజుల్లో లేనిపోని తలనొప్పులు ఎదురవుతాయేమోనని వీరంత మౌనం పాటిస్తున్నారని కొందరు విశ్లేషకులు చెబుతున్నారు.
కమల్ హాసన్ (Kamal Haasan) అయితే డైరెక్ట్ గా డీఎంకే పార్టీకి తన మద్దతు తెలిపారు. ఓ రకంగా ప్రకాశ్ రాజ్ (Prakash Raj) కూడా ఆ పక్షమే. వారిద్దరూ విజయ్ విజయాన్ని హర్షించలేరు. ఇక శరత్ కుమార్, రాధిక, ఖుష్బూ, గాయత్రి రఘురామ్ వంటి వారు అన్నాడీఎంకే తో ఉన్నారు. సో... వీరూ విజయ్‌ను అభినందించలేని పరిస్థితి. అయితే పార్టీలకు అతీతంగా పని చేసే నడిగర్ సంఘం, నిర్మాతల మండలి, సౌతిండియన్ ఫిల్మ్ ఛాంబర్ వంటి సంస్థలు... అందులోని ప్రముఖ వ్యక్తులు కూడా తమ సినిమా రంగానికి చెందిన విజయ్ ఈ స్థాయి విజయాన్ని అందుకుంటే కనీసం సోషల్ మీడియా ద్వారా కూడా శుభాకాంక్షలు తెలియచేయకపోవడం ఆశ్చర్యంగా ఉందని కొందరు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. విజయ్ పార్టీకి విస్పష్టమైన మెజారిటీ కనిపిస్తున్నా... వీరు ఎందుకు తాత్సారం చేస్తున్నారో అర్థం కావడం లేదని మరికొందరు వాపోయారు. మరి తమిళ సినీజనం విజయ్‌కు ఎప్పుడు శుభాకాంక్షలు చెబుతారో చూడాలి.
ఇవి కూడా చదవండి:
త్రిష బర్త్‌డే.. విజయంతో విజయ్ ట్రీట్ ఇస్తాడా? లేక!
‘సన్ రైజర్స్’కు సపోర్ట్ చేస్తున్న ఈ భామ ఎవరో గుర్తు పట్టారా?
Varanasi: ‘వారణాసి’కి వాటర్ కొరత!.. మహేష్ సినిమాకు ప్రభుత్వం షాక్!
‘పెద్ది’తో ఫైట్‌కు మహేష్ బాబు ఓకే అంటాడా?