సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

నెల్లూరులో ఎస్.పి. బాలు కాంస్య విగ్రహ ఆవిష్కరణ.. ఎప్పుడంటే?

ABN, Publish Date - May 28 , 2026 | 07:24 PM

భారతీయ సినీ సంగీత ప్రపంచంలో తన మధుర గానంతో కోట్లాది మంది హృదయాలను గెలుచుకున్న గానగంధర్వులు, ‘పద్మవిభూషణ్’ ఎస్.పి. బాలు 80వ జయంతిని పురస్కరించుకుని నెల్లూరులో వైభవంగా కాంస్య విగ్రహ ఆవిష్కరణ మహోత్సవం జరగనుంది.

SP Balasubrahmanyam

భారతీయ సినీ సంగీత ప్రపంచంలో తన మధుర గానంతో కోట్లాది మంది హృదయాలను గెలుచుకున్న గానగంధర్వులు, ‘పద్మవిభూషణ్’ ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం (S.P. Balasubrahmanyam) 80వ జయంతిని పురస్కరించుకుని నెల్లూరు (Nellore)లో వైభవంగా కాంస్య విగ్రహ ఆవిష్కరణ మహోత్సవం జరగనుంది. జూన్ 4, 2026 గురువారం సాయంత్రం 5.30 గంటలకు నెల్లూరులోని మినీబైపాస్ రోడ్డులో గల ఎన్టీఆర్ పార్క్, అన్నమయ్య కూడలి వద్ద ఈ వేడుకను గ్రాండ్‌గా నిర్వహించనున్నారు. ఈ చారిత్రాత్మక కార్యక్రమానికి భారతదేశ 13వ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు (Muppavarapu Venkaiah Naidu) ముఖ్య అతిథిగా హాజరై.. ఎస్.పి. బాలు (SP Balu) కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. ఈ సందర్భంగా ‘స్వరనీరాజనం - మన బాలుకి సుస్వరహారతి’ పేరుతో ప్రత్యేక సంగీతార్చన కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేశారు.


ఈ ప్రతిష్టాత్మక వేడుకకు ఆత్మీయ అతిథులుగా రాజకీయ, సినీ, వ్యాపార రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు హాజరుకానున్నారు. ‘పద్మభూషణ్’ డాక్టర్ కె.ఐ.వరప్రసాదరెడ్డి (శాంత బయోటెక్నిక్స్ వ్యవస్థాపక చైర్మన్)తో పాటు ఆంధ్రప్రదేశ్ దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, పురపాలక శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ ముఖ్య అతిథులుగా హాజరు కానున్నారు. అలాగే నెల్లూరు పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, నెల్లూరు గ్రామీణ శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, అఖిల భారత తెలుగు సమాఖ్య అధ్యక్షులు ఆచార్య సి.యం.కె.రెడ్డిలతో పాటు.. సినీ సంగీత ప్రపంచం నుంచి ప్రముఖ సంగీత దర్శకులు యం.యం.కీరవాణి, మణిశర్మ, సినీ నేపథ్య గాయకులు నాగూర్ బాబు (మనో) ఈ కార్యక్రమంలో సందడి చేయనున్నారు.


ఈ మహోత్సవానికి శ్రీసిటీ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ రవీంద్ర సన్నారెడ్డి ప్రత్యేక ఆహ్వానితులుగా హాజరు కాబోతున్నారు. వీరితో పాటు అర్బన్‌రైజ్ చైర్మన్ నంబూరు మనోజ్, ఏఎంఆర్ ఇండియా లిమిటెడ్ చైర్మన్ ఆలూరు మహేష్ రెడ్డి, పిక్‌నిక్ ఐస్‌క్రీమ్స్ ఎండి వీరిశెట్టి హజరత్‌ బాబు, మురళీకృష్ణ హోటల్స్ ఎండి గ్రోసు సుబ్బారావు తదితరులు పాల్గొననున్నారు. ఎస్.పి.బాలు కుటుంబ సభ్యులు, సినీ సంగీత ప్రముఖులు పాల్గొనే ఈ అద్భుతమైన కార్యక్రమానికి సంగీతాభిమానులందరూ ఆహ్వానితులేనని నిర్వాహకులు ప్రకటించారు.

ఇవి కూడా చదవండి:

యూపీ‌లో పౌల్ట్రీ బిజినెస్.. భూమి పూజతోనే బండ్ల గణేష్ పరార్.. ఎందుకంటే?

‘రంగస్థలం’ చిట్టిబాబుకి, ‘పెద్ది’కి ఉన్న తేడా ఏంటంటే?

‘అమ్మ’కు ఏమైంది? మరో సీనియర్ నటి సంచలన ఆరోపణలు!

మళ్లీ కత్తిలా తయారైన కాజల్.. ఈ గ్లామర్ ఫొటోలు చూశారా!

Updated Date - May 28 , 2026 | 08:24 PM