సౌత్ పాన్ ఇండియా మూవీస్ పై మోజు తగ్గుతోందా?
ABN, Publish Date - Jun 14 , 2026 | 10:50 PM
'పాన్ ఇండియా మూవీస్' అంటూ సౌత్ సినిమాలకు క్రేజ్ తీసుకు వచ్చిందే టాలీవుడ్.. ఇప్పటికీ సౌత్ పిక్చర్స్ లో తెలుగు చిత్రాలకు ఉన్న ఆదరణ నార్త్ లో ఏ దక్షిణాది సినిమాలకూ లేదు.. అయితే ఇటీవల సౌత్ -'పాన్ ఇండియా మూవీస్'కు క్రేజ్ బాగా తగ్గుతూ వస్తోంది.
‘పాన్ ఇండియా మూవీస్’ అంటూ సౌత్ సినిమాలకు క్రేజ్ తీసుకు వచ్చిందే టాలీవుడ్. ఇప్పటికీ సౌత్ పిక్చర్స్‌లో తెలుగు చిత్రాలకు ఉన్న ఆదరణ నార్త్‌లో ఏ దక్షిణాది సినిమాలకూ లేదు. అయితే ఇటీవల సౌత్ - ‘పాన్ ఇండియా మూవీస్’కు క్రేజ్ బాగా తగ్గుతూ వస్తోంది. కారణమేంటో..!?
కనెక్ట్ అయ్యే కంటెంట్ రావటం లేదా?
కాస్త క్రేజ్ ఉన్న కాంబోలో తెరకెక్కే ప్రతీ సినిమాను ‘పాన్ ఇండియా మూవీ’గా ప్రచారం చేస్తున్నారు. తెలుగుతో పాటు దక్షిణాదిలోని తమిళ, కన్నడ, మళయాళ భాషల సినీజనం సైతం ఇదే బాట పట్టారు. కాస్త క్రేజీ కాంబినేషన్స్ సెట్ అయిన సౌత్ మూవీస్‌ను ‘పాన్ ఇండియా మూవీస్’ పేరుతో ప్రచారం సాగిస్తున్నారు. ఇక కొన్ని చిత్రాలు మొదట్లో ‘పాన్ ఇండియా మూవీ’ అని ప్రచారం చేసుకున్నా.. రిలీజ్ సమయానికి కేవలం కొన్ని భాషల్లోనే విడుదలైన సందర్భాలు బోలెడు.. ఏది ఏమైనా ఇప్పుడు ఉత్తరాదిన మన సౌత్ నుంచి వస్తోన్న పాన్ ఇండియా మూవీస్‌కు మునుపటి స్థాయిలో ఆదరణ లేదనే చెప్పాలి. ప్రేక్షకులతో కనెక్ట్ అయ్యే కంటెంట్ లోపించడమే దీనికి ప్రధాన కారణమని సినీ పండిట్స్ అంటున్నారు.
'బాహుబలి' మ్యాజిక్
ఒకప్పుడు ఉత్తరాదిన హల్ చల్ చేసిన సౌత్ ఇండియన్ స్టార్ ఎవరంటే రజనీకాంత్ అనే చెప్పాలి. ఆయన నటించిన కొన్ని చిత్రాలు హిందీలోకి డబ్ అయి భలేగా అలరించాయి. అందువల్లే ఆయనను ‘సౌత్ ఇండియన్ సూపర్ స్టార్’ అనీ కీర్తించారు. ఆ విషయానికి వస్తే మన తెలుగు సినిమాలు కూడా కొన్ని ఉత్తరాది రాష్ట్రాల్లో నేరుగానే రిలీజై అలరించేవి. ముఖ్యంగా మహారాష్ట్రలోని కొల్లాపూర్, ఒరిస్సా- బెర్హంపూర్, పర్లాకిమిడి, మధ్యప్రదేశ్ - భోపాల్, బెంగాల్- ఖరగ్ పూర్ వంటి కేంద్రాలలో డైరెక్ట్ తెలుగు సినిమాలే సబ్ టైటిల్స్‌తో విడుదలవుతూ ఉండేవి. ఆ పై ఢిల్లీ, పాట్నా లోనూ రిలీజ్ చేయడం మొదలెట్టారు. అయితే సౌత్ పాన్ ఇండియా మూవీస్‌కు నార్త్‌లో క్రేజ్ తీసుకు వచ్చింది మాత్రం ‘బాహుబలి’ సిరీస్ చిత్రాలే అనే చెప్పాలి. ‘బాహుబలి-2’ ప్రపంచ వ్యాప్తంగా 1800 కోట్లు పోగేసి మన దేశంలో వెయ్యి కోట్ల క్లబ్‌కు శ్రీకారం చుట్టింది. దాంతో సౌత్‌లోని అన్ని సినిమారంగాల్లోనూ పాన్ ఇండియా మూవీస్ పై ఓ స్పెషల్ క్రేజ్ ఏర్పడింది.
పేరున్నోళ్ళే... కానీ...
సౌత్ నుంచి పాన్ ఇండియా మూవీస్‌గా జయకేతనం ఎగురవేసిన వాటిలో తెలుగు సినిమాలదే పై చేయి అని చెప్పొచ్చు. ‘బాహుబలి సిరీస్ చిత్రాలు, పుష్ప సిరీస్ చిత్రాలు, ట్రిపుల్ ఆర్, కల్కి 2898 ఏడి’ వంటి తెలుగు చిత్రాలు ఉత్తరాదినీ షేక్ చేశాయి. కన్నడ చిత్రసీమ నుంచి ‘కెజియఫ్’ సిరీస్ చిత్రాలు నార్త్‌లో భలేగా సందడి చేశాయి. కానీ, ఆ మ్యాజిక్‌ను తమిళ, మళయాళ చిత్రాలు ఇప్పటి వరకు చేయలేక పోయాయనే చెప్పొచ్చు. నార్త్‌లో మంచి గుర్తింపు ఉన్న రజనీకాంత్, కమల్ హాసన్ నటించిన చిత్రాలు సైతం పాన్ ఇండియా మూవీస్‌గా వచ్చినా మెప్పించలేక పోయాయి. కమల్ పాన్ ఇండియా మూవీ ‘ఇండియన్ -2’ ఫలితం ఏంటో అందరికీ తెలిసిందే. ‘రోబో’ తర్వాత రజనీకాంత్ నటించిన ఏ మూవీ నార్త్ బాక్సాఫీస్ వద్ద సరిగా నాట్యం చేయలేకపోయింది. విజయ్ నటించిన పలు చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా వచ్చినా, సౌత్‌లో సత్తా చాటినా నార్త్‌లో తుస్సుమన్నాయి. ఇక మళయాళం నుంచి మోహన్ లాల్ నటించిన కొన్ని సినిమాలు ఆల్ ఇండియాలో రిలీజ్ అయినా నార్త్‌లో ఏ మాత్రం ఆకట్టుకోలేక పోయాయి.
పూర్ పెర్ఫామెన్స్...
‘బాహుబలి’ తర్వాత అంటే.. 2015 నుంచి ఇప్పటి వరకు మన సౌత్ నుంచి నాలుగు భాషలు కలిపి కనీసం 50 పైగా పాన్ ఇండియా మూవీస్ రిలీజై ఉంటాయి. అయితే వీటిలో నార్త్ లోనూ గ్రాండ్ సక్సెస్ సాధించినవి ఇప్పటి వరకు నాలుగు తెలుగు సినిమాలు, రెండు కన్నడ చిత్రాలు మినహా ఏవీ లేవనే చెప్పాలి. తమిళ, మళయాళ చిత్రసీమల నుంచి వచ్చిన వాటిలో కొన్ని పరవాలేదనపించినా, ఈ ఆరు సినిమాల స్థాయిలో మెప్పించలేక పోయాయి. పదకొండేళ్ళలో యాభైకి పైగా సౌత్ పాన్ ఇండియా మూవీస్ అంటే సగటున ఏడాదికి ఐదేసి చిత్రాలు రిలీజ్ అయ్యాయి. కానీ, ఏం లాభం ఆరు చిత్రాలే నార్త్ వారిని రంజింప చేశాయి. 10 శాతం సక్సెస్ ఉందని పొంగిపోతే, పదేళ్ళలో పదిశాతం అంటే ఏడాదికి ‘వన్ పర్సెంట్’ మాత్రమే లెక్క తేలుతుంది. అంటే ఎంత పూర్ పెర్ఫామెన్సో ఊహించవచ్చు.
ఆ టముకు ఎందుకో !?
సౌత్ ఇండియా ఫిలిమ్ మేకర్స్‌కు పాన్ ఇండియా మూవీ అన్నది ఓ బిజినెస్ మోడల్‌గా మారింది. అలాగే వాటిలో నార్త్ , సౌత్ స్టార్స్‌ను నటింప చేస్తున్నారు.. బడ్జెట్ పెంచేస్తున్నారు. దానిని చూపించి భారీ స్థాయిలో బిజినెస్ చేసుకుంటున్నారు. అయితే కేవలం స్వరాష్ట్రాల్లో అలరించినంత మాత్రాన ఇతర రాష్ట్రాల్లోనూ అదే మాదిరి మన సౌత్ సినిమాలు సక్సెస్ సాధిస్తాయన్న గ్యారంటీ లేదు. నార్త్ జనాన్ని మన సౌత్ మూవీస్ పెద్దగా మెప్పించలేక పోయాయనే చెప్పాలి. ఉత్తరాన పరాజయం పాలయిన సినిమాలకు కొందరు నిర్మాతలు తమ గుడ్ విల్ నిలుపుకొనేందుకు అక్కడి పంపిణీదారులకు డబ్బులు తిరిగి ఇచ్చిన దాఖలాలూ ఉన్నాయి. అలాంటప్పుడు ‘పాన్ ఇండియా మూవీ’ అని టముకు వేసుకోవడం దేనికీ అని పరిశీలకులు ప్రశ్నిస్తున్నారు.
'జెన్ జీ'తో తస్మాత్ జాగ్రత్త!
మన పాన్ ఇండియా మూవీస్ అంతటా సక్సెస్ సాధిస్తే మంచిదే. అయితే, స్వరాష్ట్రాల్లో వసూళ్ళు చూసినా, నార్త్‌లో కానీ, ఇతర రాష్ట్రాల్లో కానీ లాభసాటి వసూళ్ళు రాకపోతే దానిని ‘ఫ్లాప్’గానే పరిగణిస్తున్నారు. అలాంటప్పుడు మన ‘పాన్ ఇండియా మూవీ’ పాస్ అయినట్టా? ఫెయిలయినట్టా? ఈ సందేహం కూడా ట్రేడ్ సర్కిల్స్‌లో రౌండ్స్ కొడుతోంది. నార్త్‌లోనూ, చుట్టుపక్కల సక్సెస్ సాధించక పోయేసరికి సొంత స్టేట్స్‌లో ఎంత వసూళ్ళు చూసినా, వాటిని సినీ ఫ్యాన్స్ హిట్స్‌గా పరిగణించడం లేదు. అందువల్ల స్టార్ హీరోస్ సినిమాలకు ‘వరల్డ్ వైడ్ కలెక్షన్స్’ అంటూ ప్రకటిస్తున్న వివరాలనూ సినీఫ్యాన్స్ నమ్మడం లేదు. అసలే సోషల్ మీడియా రాజ్యమేలుతున్న రోజులివి.. ఉరకలు వేసే ఉత్సాహమున్న ‘జెన్ జీ’ తమకు నచ్చని సినిమాకు నెగటివ్ పబ్లిసిటీని సోషల్ మీడియాలో క్రియేట్ చేస్తున్నారు. ఉత్తరం, దక్షిణం అన్న తేడా లేకుండా నవతరం ప్రేక్షకులు సామాజిక మాధ్యమాల్లో సందడి చేస్తున్న విషయాన్ని మూవీ మేకర్స్ గమనించటం లేదు.
అదీ అసలు సంగతి...!
గ్రాండ్ సక్సెస్ చూసిన సౌత్ పాన్ ఇండియా మూవీస్‌ను పరిశీలించి చూస్తే వాటిలో ఏదో ఒక ప్రత్యేకత కనిపిస్తుంది. శ్రమజీవులను హింసించేవారిపై సామాన్యుడు విజయం సాధిస్తే ఏ తరానికైనా తనువు పులకించి పోతుంది. అందువల్లే ‘బాహుబలి, కెజియఫ్, పుష్ప’ సిరీస్ చిత్రాలు నార్త్‌లోనూ భళా అనిపించాయి. బ్రిటిష్ వారిపై ఆయుధం పట్టి విజయం సాధించలేకపోయినా.. ఆ తీరున తెరకెక్కిన ‘ట్రిపుల్ ఆర్’ అందరినీ అలరించింది. మన పురాణగాథను మిళితం చేస్తూ భవిష్యత్‌లో సాగిన కథతో రూపొందిన ‘కల్కి 2898 ఏడి’ మురిపించింది. ‘కాంతార’, ‘కార్తికేయ 2’.. ఇలాంటి సినిమాలను పరికించి చూస్తే వాటిలో ప్రత్యక్షంగానూ, అంతర్లీనంగానూ మన సౌత్ ఇండియా కల్చర్ కనిపిస్తుంది. అందువల్ల ఆ చిత్రాలు మన సంప్రదాయంతో ఉత్తరాది వారిని, కొంతమంది అంతర్జాతీయ ప్రేక్షకులనూ ఆకట్టుకున్నాయని చెప్పవచ్చు. అదే తీరున ప్రస్తుతం రాజమౌళి ‘వారణాసి’తో నార్త్-సౌత్ అన్న తేడా లేకుండా ఆకర్షిస్తున్నారు. మరి ఈ రూటులో మరెందరు సౌత్ మూవీ మేకర్స్ సాగుతారో చూడాలి.
ఇవి కూడా చదవండి:
బాలీవుడ్‌లో కనిపించని నవతరం స్టార్స్.. హిందీ సినిమా ఫ్యూచర్ ఏంటి?
ఎయిర్ పోర్ట్‌లో వడ్డే నవీన్ పరపతి చూసి షాకయ్యా: వివి వినాయక్
రామ్ చరణ్, ఉపాసనల పెళ్లి రోజు.. ట్విన్స్ గ్లింప్స్ పిక్ వైరల్!
బుచ్చిబాబు సారీ చెప్పడం నాకు నచ్చలేదు: అనంత శ్రీరామ్