బాలీవుడ్‌లో కనిపించని నవతరం స్టార్స్.. హిందీ సినిమా ఫ్యూచర్ ఏంటి?

ABN , Publish Date - Jun 14 , 2026 | 10:25 PM

‘నవతరం రావాలి.. నవయుగం చూడాలి’ అని ఆశిస్తున్నారు బాలీవుడ్ మూవీ ఫ్యాన్స్.. ఎందుకలాగా అంటే అక్కడ వయసు మళ్ళిన స్టార్సే కనిపిస్తున్నారు.. యంగ్ హీరోస్ హవా సరిగా వీచడం లేదు. ఇదే సాగితే హిందీ సినిమా ఫ్యూచర్ ఏంటి అన్న ప్రశ్న తలెత్తుతోంది.

Bollywood Star Heroes

‘నవతరం రావాలి.. నవయుగం చూడాలి’ అని ఆశిస్తున్నారు బాలీవుడ్ మూవీ ఫ్యాన్స్.. ఎందుకలాగా అంటే అక్కడ వయసు మళ్ళిన స్టార్సే కనిపిస్తున్నారు.. యంగ్ హీరోస్ (Bollywood Young Heroes) హవా సరిగా వీచడం లేదు.. ఇదే సాగితే హిందీ సినిమా ఫ్యూచర్ ఏంటి అన్న ప్రశ్న తలెత్తుతోంది.. మరేం చేయాలి?

బాలీవుడ్‌లో స్తబ్ధత!

బాలీవుడ్‌లో ఎంతసేపూ ఆ పేర్లే- షారుఖ్ ఖాన్ (Shahrukh Khan), సల్మాన్ ఖాన్ (Salman Khan), ఆమిర్ ఖాన్ (Aamir Khan), అక్షయ్ కుమార్ (Akshay Kumar), హృతిక్ రోషన్, రణబీర్ కపూర్- ఇప్పుడు ‘ధురంధర్’ గ్రాండ్ సక్సెస్‌తో రణ్‌వీర్ సింగ్ పేరు కూడా ఈ జాబితాలో జాయినైంది. ఈ హీరోలందరినీ పరిశీలిస్తే మనకు తెలిసేదేమిటంటే- వీరిలో ముగ్గురు ఖాన్‌లు అరవై ఏళ్ళు దాటినవారే. అక్షయ్ కుమార్ ఆరుపదులకు దగ్గరవుతున్నారు.. హృతిక్ రోషన్ కూడా యాభై ఏళ్ళు దాటి రెండేళ్ళయింది. రణబీర్ కపూర్‌కు ప్రస్తుతం 43 ఏళ్ళు, రణ్‌వీర్ సింగ్‌కు నలభై సంవత్సరాలు. వీరి తర్వాత సందడి చేస్తున్న హీరోలు కూడా ముదురు బాబులే కావడం గమనార్హం. ‘ఆర్మాక్స్ స్టార్స్ ఇండియా లవ్స్’ డేటా ప్రకారం వీరి కారణంగా హిందీ సినిమా స్తబ్ధతను ఎదుర్కొంటోందని తేలింది.


అదే కారణమట!

ఏ రంగంలోనైనా భీష్మాచార్యులు, కురుపాండవుల లాంటి మధ్యవయస్కులు ఉంటారు. అలాగే ఉరకలు వేసే ఉత్సాహంతో అభిమన్యుల్లాంటి వారూ తారసపడతారు. యంగ్ జనరేషన్ అలాంటివారినే లైక్ చేస్తుంది. వయసు మళ్ళినవారిలో ఆకర్షించే ప్రతిభ ఉంటే తప్ప వారిని నవతరం అభిమానించే అవకాశాలు తక్కువనే చెప్పాలి. బాలీవుడ్ బాబుల్లో ఇప్పటికీ నాలుగు పదుల పైగా వయసున్న కథానాయకులే రాజ్యమేలుతున్నారు.. కానీ, పాతికేళ్ళ స్టార్ ఒక్కరూ జనాన్ని ఆకర్షించలేక పోతున్నారు. అందుకు లక్ మాత్రమే కారణమనుకుంటే పొరబాటే అంటున్నారు పరిశీలకులు. ఏ రంగంలోనైనా యువతరం పరుగులు తీసినప్పుడే సక్సెస్ రేటు పెరుగుతూ పోతుంది. ప్రస్తుతం బాలీవుడ్ విజయాల శాతం తగ్గిపోవడానికి అదే కారణమంటున్నారు పరిశీలకులు.


మరచిపోకూడని అంశం

ప్రతి సినిమా రంగంలోనూ ముసలి హీరోలు టాప్ ప్లేస్‌లోనే ఉంటారు. అయితే వారి తర్వాతి తరాలు పాతికేళ్ళ మొదలు ముప్పై సంవత్సరాల లోపు వారయితే సినిమాల సంఖ్య పెరుగుతుంది. యంగ్ స్టర్స్‌కు ఆదరణ ఉంటుంది కాబట్టి తగిన బడ్జెట్‌లో చిత్ర నిర్మాణం సాగిస్తే సక్సెస్ రేటు పెంచుకోవచ్చు. అందుకు ముసలి హీరోల కంటే యువ కథానాయకులే పనికి వస్తారని పరిశీలకుల భావన. ఇప్పుడు ఓల్డ్ హీరోస్‌గా ఉన్నవారందరూ తమ పాతికేళ్ళ వయసులోనే స్టార్ డమ్ చూసిన నటులని గుర్తుంచుకోవాలి. వారికి సీనియర్స్ అయిన ధర్మేంద్ర, రాజేశ్ ఖన్నా, అమితాబ్ బచ్చన్ లాంటివారు కూడా యంగ్‌లో ఉన్నప్పుడే బంపర్ హిట్స్ చూశారు. అలా ప్రతి రంగంలో విజయానికి యువతరం ప్రధాన పాత్ర పోషిస్తూ ఉంటుంది. ఈ విషయాన్ని ముంబై బాబులు గుర్తు తెచ్చుకోవాలని సినీ పండిట్స్ సూచిస్తున్నారు.


సలహాలు.. సూచనలు..

బాలీవుడ్‌లో కూడా ఎంతోమంది యంగ్ హీరోస్ ఉన్నారు.. కానీ, వారు సక్సెస్‌తో సాగలేకపోతున్నారు. ఇక్కడ సర్వే నిర్వహించిన ‘ఆర్మాక్స్’ సంస్థ కూడా కొన్ని సూచనలు ఇస్తోంది. కేవలం పబ్లిక్ రిలేషన్ టీమ్స్‌తో సాగకుండా ప్రేక్షకులను అలరించే అంశాలపై దృష్టి సారించాలని సూచించింది. యువ నటీనటులు తమను తాము లైమ్ లైట్‌లో నిలుపుకోవడానికి కేవలం సోషల్ మీడియాను ఆశ్రయిస్తే సరిపోదనీ, ఆ సంస్థ సలహా ఇస్తోంది. ‘‘ముందుగా యంగ్ హీరోస్ తమకు మార్కెట్‌లో ఎంత వేల్యూ ఉంది.. దానిని అభివృద్ధి చేసుకోవడానికి ఎలాంటి కథలు ఎంపిక చేసుకోవాలి.. అందుకు బడ్జెట్ ఎంత ఉండాలి’’ అనే అంశాలపై అవగాహన పెంచుకోవాలని ఆర్మాక్స్ చెబుతోంది. తమకున్న మార్కెట్ పరిధి మేరకే నిర్మాతతో ఖర్చు పెట్టించాలని, పదే పదే సినీ పండిట్స్ కూడా గుర్తు చేస్తున్నారు. ఒకవేళ మార్కెట్‌కు మించి ఖర్చుచేయిస్తే, సదరు చిత్రం బాక్సాఫీస్ వద్ద బోల్తా కొడితే ముందుగా హీరోలకే చెడ్డ పేరు వస్తుందని హెచ్చరిస్తున్నారు. మరి ఈ అంశాలను దృష్టిలో పెట్టుకొని ఏ యంగ్ హీరో బాలీవుడ్‌లో నెక్ట్స్ సూపర్ స్టార్ అనిపించుకుంటారో చూడాలి.

ఇవి కూడా చదవండి:

ఎయిర్ పోర్ట్‌లో వడ్డే నవీన్ పరపతి చూసి షాకయ్యా: వివి వినాయక్

రామ్ చరణ్, ఉపాసనల పెళ్లి రోజు.. ట్విన్స్ గ్లింప్స్ పిక్ వైరల్!

బుచ్చిబాబు సారీ చెప్పడం నాకు నచ్చలేదు: అనంత శ్రీరామ్

Updated Date - Jun 14 , 2026 | 10:35 PM