ఒకడు 5 సంవత్సరాల క్రితం జీవితం ఇస్తానన్నాడు.. సిల్క్ స్మిత సూసైడ్ లెటర్ వైరల్
ABN , Publish Date - Jul 20 , 2026 | 02:05 PM
దక్షిణాది చిత్రసీమలో తన గ్లామర్, నటనతో ఒకానొక సమయంలో ఏకచక్రాధిపత్యం వహించిన దివంగత నటి సిల్క్ స్మిత మరణించి ఇన్నేళ్లవుతున్నా, ఆమె జీవితంలోని మిస్టరీ మాత్రం అలాగే కొనసాగుతోంది.
దక్షిణాది చిత్రసీమలో తన గ్లామర్, నటనతో ఒకానొక సమయంలో ఏకచక్రాధిపత్యం వహించిన దివంగత నటి సిల్క్ స్మిత (Silk Smitha) మరణించి ఇన్నేళ్లవుతున్నా, ఆమె జీవితంలోని మిస్టరీ మాత్రం అలాగే కొనసాగుతోంది. వెండితెరపై ఎంతోమంది కలల రాణిగా ఏలిన ఈ అందాల తార.. నిజ జీవితంలో మాత్రం ఒంటరితనం, మానసిక వేదన అనుభవించి తీవ్ర విషాదాంతాన్ని ముగించారు. 1996 సెప్టెంబర్ 23న ఆమె చెన్నైలోని తన నివాసంలో ఆత్మహత్య చేసుకుని తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే. కాగా, ఆమె మరణానికి ముందు సెప్టెంబర్ 22న రాసినట్లుగా చెబుతున్న సూసైడ్ నోట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో మరోసారి వైరల్‌గా మారింది. చిన్నతనం నుంచే కష్టాలు అనుభవించానని, నమ్మినవాళ్లే తనను దారుణంగా మోసం చేశారని, ఐదేళ్ల క్రితం ఒక వ్యక్తి తనకు జీవితాన్ని ఇస్తానని చెప్పి ఇప్పుడు వద్దంటున్నాడని ఆ లేఖలో ఆమె పడిన వేదన, నరకం ప్రతీ ఒక్కరినీ కలచివేస్తోంది. ఆమె జీవితంలోని విషాద కోణాన్ని ఆవిష్కరిస్తున్న ఆ వైరల్ లేఖలోని పూర్తి వివరాలు ఇవే..
‘‘అభాగ్యురాలు 22/9/1996.. దేవుడా, నా 7వ సంవత్సరం నుంచి నా పొట్ట కోసం కష్టపడ్డాను. నాకు నా వారు అంటూ ఎవరూ లేరు. నేను నమ్మిన వారు నన్ను మోసం చేసారు. బాబు తప్ప నామీద ఎవరు ప్రేమ చూపలేదు. ఎవ్వరికీ నామీద ప్రేమలేదు. బాబు తప్పితే అందరూ నా కష్టం తిన్నవారే. నా నాశనం కోరారు. ఎవ్వరికీ విశ్వాసం లేదు. జీవితంలో నాకు అందరిలాగే కోరికలు ఉన్నాయి. కానీ నాచుట్టూ ఉన్నవాళ్లు నాకు మనశాంతి లేకుండా చచ్చిపోయేట్లు చేశారు. ఇంత సాధించినా నాకు మనశాంతి లేకుండా చేశారు. అందరికి మంచి చేశాను. కానీ నా జీవితం ఇలా చేశారు. ఏమి న్యాయమిది. నాకు ఉన్న ఏ కొంచెమైనా బాబు కుటుంబానికి, నా కుటుంబానికి పంచవలెను.
నా ఆశలన్నీ ఒకరిమీద పెట్టుకున్నా . అతను నన్ను మోసం చేశాడు. దేవుడుంటే వాణ్ణి చూసుకుంటాడు. రోజు టార్చర్ నేను భరించలేను. నాకప్పుడు ఏది న్యాయమనిపిస్తే అదే చేశాను. ఒకసారి నేను నగ కొనుక్కుంటే పెట్టుకోనివ్వలేదు. ఇప్పుడు ఇష్టముంటే నేనుండను. దేవుడు నన్ను వేషం కోసం పుట్టించాడు. నేను ఎంతోమందికి మంచి చేసినా వంచన చేశారు. దేవుడుంటే చూసుకుంటాడు. నా రెక్కల కష్టం తినని వారు లేరు. అయినా ఎవరికీ విశ్వాసం లేదు, బాబుకి తప్ప. నాకు ఒకడు 5 సంవత్సరాల క్రితం జీవితం ఇస్తానన్నాడు. ఇప్పుడు ఇవ్వనంటున్నాడు. నా జీవితంలో ఎంతో భరించాను. కానీ ఇది నావల్ల కావడం లేదు. ఇది రాయడానికి ఎంత నరకం పడ్డానో నాకే తెలియును’’ అని సిల్క్ స్మిత చివరి లేఖలో రాసి ఉంది.
ఇవి కూడా చదవండి:
మెగా ఫ్యామిలీ అని గర్వంగా చెప్పుకుంటున్నా: నిహారిక
చిరు, బాలయ్య చొరవతో ముగిసిన డ్యాన్స్ మాస్టర్స్ అసోసియేషన్ వివాదం
సీతమ్మ పాత్రను నేను ఎంచుకోలేదు, ఆ దేవుడే: సాయి పల్లవి