మెగా ఫ్యామిలీ అని గర్వంగా చెప్పుకుంటున్నా: నిహారిక

ABN , Publish Date - Jul 19 , 2026 | 10:39 PM

పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్, శ్రీ రాధా దామోదర్ స్టూడియోస్ బ్యానర్ల మీద పద్మజ కొణిదెల, జయలక్ష్మి అడపాక నిర్మాణంలో నిహారిక కొణిదెల రూపొందించిన చిత్రం ‘కమిటీ కుర్రోళ్లు’. ఈ సినిమా రెండు జాతీయ అవార్డులను సొంతం చేసుకున్న విషయం తెలిసిందే.

Niharika Konidela Committee Kurrollu PM

పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్, శ్రీ రాధా దామోదర్ స్టూడియోస్ బ్యానర్ల మీద పద్మజ కొణిదెల, జయలక్ష్మి అడపాక నిర్మాణంలో నిహారిక కొణిదెల రూపొందించిన చిత్రం ‘కమిటీ కుర్రోళ్లు’ (Committee Kurrollu). ఈ మూవీతో యదు వంశీ (Yadhu Vamsee) దర్శకుడిగా పరిచయం అయ్యారు. తాజాగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన 72వ జాతీయ చలన చిత్ర అవార్డుల్లో ఈ సినిమా సత్తా చాటుకుంది. ఉత్తమ జాతీయ తెలుగు చిత్రం, బెస్ట్ మేకప్ కేటగిరీల్లో రెండు జాతీయ అవార్డులను ఈ సినిమా కొల్లగొట్టింది. ఈ సందర్భంగా చిత్రయూనిట్ తమ ఆనందాన్ని పంచుకునేందుకు ఆదివారం మీడియా సమావేశం నిర్వహించారు.


ఈ కార్యక్రమంలో మెగా ప్రొడ్యూసర్ నిహారిక కొణిదెల (Niharika Konidela) మాట్లాడుతూ.. ‘కమిటీ కుర్రోళ్లు’ చిత్రంలో పని చేసిన ప్రతీ ఒక్కరి జర్నీ నాకు తెలుసు. ఈ చిత్రానికి జాతీయ అవార్డులు రావడంతో నా మనసు సంతృప్తితో నిండిపోయింది. నా 32 ఏళ్ల ఈ జీవితంలో ‘కమిటీ కుర్రోళ్లు’ సినిమాకు ఓకే చెప్పడం చాలా గొప్ప నిర్ణయంగా భావిస్తున్నాను. ఇది నా సినిమా, ప్రాణం పెట్టాలని అప్పుడే ఫిక్స్ అయ్యాను. మంచి సినిమా తీసినా కూడా అది ప్రేక్షకుల వరకు తీసుకు వెళ్లగలగాలి. ‘కమిటీ కుర్రోళ్లు’ చిత్రంలో అందరి కష్టం ఉంది. మంచి సినిమా తీసినప్పుడు ఇలాంటి ఓ గొప్ప ఫీలింగ్ కలుగుతుందంటే.. నా జీవితంలో ఎప్పుడూ ఇండస్ట్రీ నుంచి బయటకు వెళ్లను. యదు వంశీ ఎప్పుడూ నేషనల్ అవార్డ్ వస్తుందని చెబుతూనే ఉండేవారు. కానీ నేను ఒక నేషనల్ అవార్డ్ సినిమా తీయాలని ఈ సినిమాను నిర్మించలేదు. ఈ జర్నీలో మాత్రం నేను కూడా జాతీయ అవార్డు రావాలని కోరుకున్నాను. 72వ జాతీయ అవార్డుల్లో మేం కూడా ఉండాలని అనుకున్నాను. నా కల నేడు నెరవేరింది.


ఆర్టిస్టుల్ని 18 ఏళ్ల నుంచి 30 ఏళ్లుగా మారేందుకు ఎంతో మేకోవర్ జరిగింది. ఈ జర్నీలో రవి, అక్షయ్ ఎంతో సపోర్ట్ చేశారు. రవికి నేషనల్ అవార్డ్ రావడం ఆనందంగా ఉంది. మా నాన్న నిర్మించిన ‘రుద్రవీణ’ చిత్రానికి మూడు జాతీయ అవార్డులు వచ్చాయి. మా పెదనాన్న, బాబాయ్ సినిమాకి సేవ చేశారు. నేను కొణిదెల ఫ్యామిలీ నుంచి వచ్చాను.. ఏదో ఒకటి సాధించానని ఇప్పుడు అనిపిస్తోంది. నేను మెగా ఫ్యామిలీలో ఉన్నాను.. మెగా ఫ్యామిలీ నుంచి వచ్చాను అని గర్వంగా చెప్పుకుంటున్నాను. ఈ ఫ్యామిలీలో నేను ఉండేందుకు అర్హురాలిని అని ఇప్పుడు గర్వంగా చెప్పుకోగలను. జాతీయ అవార్డులు సాధించిన ప్రతీ ఒక్కరికీ థ్యాంక్స్. సినిమా చూసిన తర్వాత మీడియా, ఆడియెన్స్ ఇలా అందరూ కూడా నేషనల్ అవార్డ్ వస్తుందని అన్నారు. మాకు రెండు జాతీయ అవార్డులు వచ్చాయి. ఈ జర్నీలో సపోర్ట్ చేసిన అందరికీ థాంక్స్. పెదనాన్నే అందరికీ గర్వకారణం అని నేను ఫీల్ అవుతుంటాను. ఆయనే నన్ను గర్వకారణం అని అనడంతో ఎంతో ఆనందంగా ఉంది. ‘రుద్రవీణ’కి మీ నాన్న (నాగబాబు) తీసుకున్నారు.. ఇప్పుడు నువ్వు తీసుకుంటున్నావ్.. మాకెంతో గర్వంగా ఉందని పెదనాన్న అనడం నాకు మరింత గర్వంగా ఉంది.. అని నిహారిక తన సంతోషాన్ని షేర్ చేసుకున్నారు.

ఇవి కూడా చదవండి:

చిరు, బాలయ్య చొరవతో ముగిసిన డ్యాన్స్ మాస్టర్స్ అసోసియేషన్ వివాదం

సీతమ్మ పాత్రను నేను ఎంచుకోలేదు, ఆ దేవుడే: సాయి పల్లవి

బ్రదర్స్ బాండింగ్ అంటే ఇది.. ‘లెనిన్’ హిట్‌పై చైతూ!

Updated Date - Jul 19 , 2026 | 10:39 PM