విడాకుల తర్వాత రెండో పెళ్లికి సిద్ధమైన రిమి టామీ.. కాబోయే భర్త ఎవరో తెలుసా?
ABN , Publish Date - Nov 02 , 2026 | 06:36 PM
ప్రముఖ గాయని, టీవీ వ్యాఖ్యాత రిమి టామీ రెండో పెళ్లికి సిద్ధమయ్యారు. ముంబైకి చెందిన ఫిట్నెస్ ట్రైనర్ లిబిన్ మాథ్యూను వివాహం చేసుకోబోతున్నట్లు వెల్లడించారు.
ప్రముఖ నేపథ్య గాయని, టీవీ వ్యాఖ్యాత, నటి రిమి టామీ మరోసారి పెళ్ళి పీటలు ఎక్కబోతున్నారు. మొదటి భర్తకు విడాకులిచ్చిన ఆరేళ్ళ తర్వాత ఆమె మరోసారి వైవాహిక జీవితంలోకి అడుపెట్టబోతున్నారు. ఈ విషయాన్ని స్వయంగా రిమి టామీ ఓ వీడియో ద్వారా తెలిపారు.
రిమి టామీ తన కెరీర్‌ను 'ఏంజెల్ వాయిస్' అనే మ్యూజిక్ ట్రూప్‌లో గాయనిగా ప్రారంభించారు. ఆ సమయంలో మిమిక్రీ కళాకారుడు, సంగీత దర్శకుడు నాదిర్షా ఆమె ప్రతిభను గుర్తించారు. అనంతరం దర్శకుడు లాల్ జోస్, సంగీత దర్శకుడు విద్యాసాగర్‌కు ఆమెను పరిచయం చేశారు. వీరి కాంబినేషన్లో వచ్చిన 'మీస మాధవన్' (2002) సినిమాతో రిమి నేపథ్య గాయనిగా పరిచయమయ్యారు. అందులో ఆమె పాడిన 'చింగమాసం' పాట అప్పట్లో సంచలనం సృష్టించింది. 'మీస మాధవన్' మూవీ తెలుగులో 'దొంగోడు' పేరుతో రీమేక్ అయ్యింది. రవితేజ, కళ్యాణీ జంటగా భీమినేని శ్రీనివాసరావు స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ఈ సినిమాలోనూ ఆ పాటను శంకర్ మహదేవన్ తో కలిసి రిమి టామీ పాడారు. అలానే ఆ తర్వాత శ్రీకాంత్ 'శ్రీకృష్ణ 2006' లోని 'పుట్టింది మండపేట' సాంగ్ గానం చేశారు. అది కూడా మంచి విజయాన్ని అందుకుంది.
రిమి టామీ గతంలో వ్యాపారవేత్త రాయిస్ కిళక్కూడన్ను వివాహం చేసుకున్నారు. 2008 ఏప్రిల్ 27న వీరి వివాహం త్రిసూర్‌లో వీరి జరిగింది. 11 ఏళ్ల వైవాహిక జీవితం అనంతరం 2020లో పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకున్నారు. మొదటి వివాహ బంధం ముగిసిన ఆరేళ్లకు రెండో పెళ్లికి సిద్ధమయ్యారు. తనకు కాబోయే భర్త గురించి రిమి టామీ మాట్లాడుతూ.. 'అతను నటుడు కాదు, గాయకుడు కాదు, ప్రముఖ వ్యక్తి కూడా కాదు. కోటీశ్వరుడు అంతకన్నా కాదు. జీవిత భాగస్వామి అంటే వెంటనే వెళ్లి ఎంచుకునే వ్యక్తి కాదు. ఇద్దరి మధ్య ఒకరినొకరు అర్థం చేసుకునే స్వభావం, భావాల్ని స్వేచ్ఛగా పంచుకునే అనుబంధం ఉండాలి. మన వ్యక్తిగత, వృత్తిపరమైన ఎదుగుదలకు తోడ్పడటంతో పాటు మనసుకు ప్రశాంతతను అందించే వ్యక్తి అయి ఉండాలి. నాకు డబ్బు, పేరు ప్రఖ్యాతులు అవసరం లేదు. నన్ను ప్రేమగా చూసుకుంటూ, మనశ్శాంతిని ఇచ్చే వ్యక్తి కావాలనుకున్నాను' అని చెప్పారు. రిమి సోమవారం తన వ్లాగ్‌లో షేర్ చేసిన వీడియోలో తన కాబోయే భర్త లిబిన్ మాథ్యూ గురించి చెప్పారు. ముంబైలో నివసించే లిబిన్ బాడీ బిల్డర్. ఫిట్ నెస్ ట్రైనర్. లిబిన్ స్వస్థలం కేరళ. గత కొన్ని నెలలుగా అతను రిమికి ఫిట్ నెస్ కోచ్‌గా వ్యవహరిస్తున్నారు. ఇదే నెలలో డోంబివలిలోని చర్చిలో వీరి వివాహం జరుగబోతోందని తెలుస్తోంది. సింగర్ గానే కాకుండా 2013లో '5 సుందరికల్' చిత్రంలోనూ, 2015లో 'థింకల్ ముత్తల్ వెల్లి వేరే' సినిమాలోనూ రిమి టామీ హీరోయిన్గా నటించి, మెప్పించారు.
ఇవి కూడా చదవండి:
రానా, కంగనా, రవిబాబు మూవీ.. టైటిల్ ఏంటంటే?
నాని ‘బ్లడీ రోమియో’ వీడియో లీక్.. సోషల్ మీడియాలో వైరల్
టాలీవుడ్ స్టార్ హీరోలూ.. సూర్య, ధనుష్‌లను చూసి నేర్చుకోండయ్యా..