తప్పు చేస్తే గల్లా పట్టి బయటకు గెంటండి: డ్యాన్స్ మాస్టర్ రఘు
ABN, Publish Date - Aug 30 , 2026 | 09:54 PM
తెలుగు ఫిల్మ్ అండ్ టీవీ డ్యాన్సర్స్ అండ్ డ్యాన్స్ డైరెక్టర్స్ అసోసియేషన్ (TFTDDA)లో కొనసాగుతున్న సంక్షోభంపై నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన రఘు మాస్టర్ తీవ్రస్థాయిలో స్పందించారు.
తెలుగు ఫిల్మ్ అండ్ టీవీ డ్యాన్సర్స్ అండ్ డ్యాన్స్ డైరెక్టర్స్ అసోసియేషన్ (TFTDDA)లో కొనసాగుతున్న సంక్షోభంపై నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన రఘు మాస్టర్ తీవ్రస్థాయిలో స్పందించారు. సుమలత (Sumalatha), జానీ (Jani) మాస్టర్ల ఏకపక్ష నిర్ణయాలు, ఫెడరేషన్ సహాయ నిరాకరణ నేపథ్యంలో మెజారిటీ డ్యాన్సర్లు ఏకమై రఘు మాస్టర్‌ను తమ నాయకుడిగా ఎన్నుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అసోసియేషన్ సభ్యుల సమావేశంలో మాట్లాడిన రఘు మాస్టర్.. అసోసియేషన్ మనుగడ, డ్యాన్సర్ల భవిష్యత్తు కోసం తీసుకోవాల్సిన చర్యలపై కీలక వ్యాఖ్యలు చేశారు.
రఘు మాస్టర్ (Raghu Mastar) మాట్లాడుతూ.. ‘‘డ్యాన్సర్స్ అసోసియేషన్ మనందరిదీ. జానీ, సుమలత కూడా మనవారే.. కానీ వారు బాధ్యతలను సరిగ్గా నిర్వహించలేకపోతున్నారు కాబట్టే మనం పూనుకుని ముందుకొచ్చాం. నాకు ఎలాంటి పదవీ వ్యామోహం లేదు. ప్రస్తుతం సమస్యల పరిష్కారం కోసం ఒక అడ్‌హాక్ కమిటీలా ఏర్పడి ఫెడరేషన్ వద్దకు వెళ్లి మన సమస్యలను చెప్పుకోవడానికే ఇదంతా. నేను 1997 నుంచే ఈ అసోసియేషన్‌లో సభ్యుడిగా ఉన్నాను. దాసరి నారాయణరావు లాంటి మహానుభావులు ఒక్కో క్రాఫ్ట్‌ను నిర్మించి పరిశ్రమను అభివృద్ధి చేశారు. 24 శాఖలకు పెద్దదిక్కు ఫిల్మ్ ఫెడరేషన్. డ్యాన్సర్ల వేతనాల పెంపు గురించి నిర్మాతల వద్ద మాట్లాడాలన్నా ఫెడరేషన్ ద్వారానే సాధ్యమవుతుంది. కానీ, చరిత్రలో ఎన్నడూ లేని విధంగా మొదటిసారిగా మన యూనియన్‌పై ఫెడరేషన్ సహాయ నిరాకరణ చేసే పరిస్థితి వచ్చింది’’ అని ఆవేదన వ్యక్తం చేశారు.
డ్యాన్సర్ల ప్రయోజనాలే ముఖ్యమని స్పష్టం చేస్తూ.. ‘‘మినిట్స్ బుక్‌లో డ్యాన్సర్లందరూ సంతకాలు చేసి ఫెడరేషన్‌కు సమర్పిద్దాం. ఫెడరేషన్ అండతో తాత్కాలిక బాడీని ఏర్పాటు చేసి, సమస్యలు పరిష్కారమయ్యాక మళ్లీ ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు పెట్టుకుందాం. అప్పుడు సుమలత మాస్టర్ కూడా పోటీ చేయవచ్చు. ఇక్కడ ఎవరికీ ప్రత్యేక మినహాయింపులు ఉండవు, అందరికీ ఒకటే రూల్. ఇకపై ఎవరైనా ప్రెసిడెంట్ పదవి వ్యామోహంతో అడ్డగోలుగా వ్యవహరిస్తే.. డ్యాన్సర్లందరూ అసోసియేషన్ ఆఫీస్‌కు వెళ్లి గల్లా పట్టుకుని బయటకు వెళ్లగొట్టండి, ఆ పూర్తి హక్కు సభ్యులందరికీ ఉంది’’ అని రఘు మాస్టర్ ఘాటుగా హెచ్చరించారు.
ఈ సమావేశంలో అజయ్ మాస్టర్ మాట్లాడుతూ.. ‘‘యూనియన్‌కు తీవ్ర సంక్షోభం ఎదురైనప్పుడు సభ్యుల కోసం రఘు మాస్టర్ ముందుకొచ్చారు. రఘు మాస్టర్ నాయకత్వానికి శేఖర్ మాస్టర్‌తో పాటు ప్రముఖ కొరియోగ్రాఫర్లందరూ పూర్తి సానుకూలంగా మద్దతు తెలిపారు’’ అని పేర్కొన్నారు. మెజారిటీ డ్యాన్సర్ల మద్దతుతో రఘు మాస్టర్ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం టాలీవుడ్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. మరి సుమలత అధ్యక్షురాలిగా ఉండగానే యూనియన్‌లో ఇలాంటి మార్పులు సంభవించడంపై ఆమె వర్గపు మెంబర్స్ ఎలా రియాక్ట్ అవుతారో చూడాల్సి ఉంది.
ఇవి కూడా చదవండి:
జానీ, సుమలత మాస్టర్స్‌కు షాక్.. డ్యాన్సర్స్ యూనియన్ సంచలన నిర్ణయం
రాజ్ తరుణ్ ‘టార్టాయిస్’ ఫస్ట్ లుక్ పోస్టర్.. ఇంట్రెస్టింగ్
బండ్ల గణేష్ ఎందుకు ఇంత హర్టయ్యాడు..