జానీ, సుమలత మాస్టర్స్‌కు షాక్.. డ్యాన్సర్స్ యూనియన్ సంచలన నిర్ణయం

ABN , Publish Date - Aug 30 , 2026 | 07:45 PM

తెలుగు ఫిల్మ్ అండ్ టీవీ డ్యాన్సర్స్ అండ్ డ్యాన్స్ డైరెక్టర్స్ అసోసియేషన్ (TFTDDA)లో కొనసాగుతున్న అంతర్గత విభేదాలు మరింత ముదిరి సంచలన మలుపు తిరిగాయి.

TFTDDA Latest Update

తెలుగు ఫిల్మ్ అండ్ టీవీ డ్యాన్సర్స్ అండ్ డ్యాన్స్ డైరెక్టర్స్ అసోసియేషన్ (TFTDDA)లో కొనసాగుతున్న అంతర్గత విభేదాలు మరింత ముదిరి సంచలన మలుపు తిరిగాయి. గత కొద్ది రోజులుగా యూనియన్‌లో నెలకొన్న సంక్షోభాన్ని పరిష్కరించేందుకు మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ, ఫిలిం ఛాంబర్, ఫిల్మ్ ఫెడరేషన్ పెద్దలు జోక్యం చేసుకుని సర్దుబాటు చేసేందుకు తీవ్ర ప్రయత్నాలు చేశారు. అయితే, పెద్దల మాటలను సైతం పెడచెవిన పెట్టి జానీ మాస్టర్, సుమలత మాస్టర్‌లు డ్యాన్సర్లను రెచ్చగొట్టి ఏకపక్షంగా ఉపఎన్నికలు నిర్వహించడం యూనియన్‌లో తీవ్ర విభేదాలకు దారితీసింది. దీంతో మెజారిటీ డ్యాన్సర్లు ఏకమై సుమలత వర్గానికి ఊహించని షాక్ ఇచ్చారు.

నేడు (ఆగస్ట్ 30) హైదరాబాద్ కృష్ణా నగర్‌లోని ఓ ప్రైవేట్ హోటల్‌లో అసోసియేషన్‌కు చెందిన మెజారిటీ డ్యాన్సర్లు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ అత్యవసర భేటీలో సుమలత నేతృత్వంలోని ప్రస్తుత కార్యవర్గాన్ని తిరస్కరిస్తూ, డ్యాన్సర్స్ అసోసియేషన్ నూతన అధ్యక్షుడిగా ప్రముఖ కొరియోగ్రాఫర్ రఘు మాస్టర్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సుమలత తీసుకుంటున్న ఏకపక్ష నిర్ణయాలు, నియంతృత్వ ధోరణి వల్ల అసోసియేషన్ మనుగడకే ప్రమాదం ఏర్పడిందని సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పెద్దల మార్గదర్శకాలను కాదని నిర్వహించిన ఆ ఉపఎన్నికలను తాము ఏమాత్రం గుర్తించబోమని మెజారిటీ సభ్యులు తేల్చిచెప్పారు.


మొత్తం 600 మంది సభ్యులున్న అసోసియేషన్‌లో ఇటీవల జరిగిన వివాదాస్పద ఉపఎన్నికల్లో పాల్గొన్నది కేవలం 116 మంది మాత్రమేనని, మిగిలిన వారంతా ఆ ఎన్నికలను పూర్తిగా బహిష్కరించారని యూనియన్ నేతలు గుర్తుచేశారు. ప్రస్తుతం అసోసియేషన్‌లోని దాదాపు 350 మందికి పైగా డ్యాన్సర్లు రఘు మాస్టర్‌ పక్షానే నిలిచారని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా రఘు మాస్టర్ నాయకత్వానికి టాలీవుడ్‌లోని ప్రముఖ కొరియోగ్రాఫర్లు శేఖర్ మాస్టర్, గణేష్ మాస్టర్, భాను మాస్టర్, ప్రకాష్ మాస్టర్, విజయ్ పోలాకి మాస్టర్, విజయ్ బిన్నీ మాస్టర్, శ్రష్టి వర్మ మాస్టర్ తదితరులు పూర్తి మద్దతు ప్రకటించారు.


ఇప్పటికే సుమలత కార్యవర్గానికి సహాయ నిరాకరణ చేస్తున్న ఫిల్మ్ ఫెడరేషన్.. మెజారిటీ డ్యాన్సర్ల మద్దతుతో ఎన్నికైన రఘు మాస్టర్ నూతన కార్యవర్గాన్నే అధికారికంగా గుర్తించాలని, వారికే పూర్తి సహకారం అందించాలని యూనియన్ సభ్యులు కోరారు. చిరంజీవి, బాలకృష్ణ వంటి పరిశ్రమ పెద్దల సూచనలను ఖాతరు చేయకుండా సొంత అజెండాతో ముందుకు వెళ్లిన జానీ, సుమలత మాస్టర్లకు మెజారిటీ సభ్యులు గట్టి గుణపాఠం చెప్పినట్లయిందని సినీ వర్గాల్లో చర్చ సాగుతోంది. త్వరలోనే ఈ వివాదంపై ఫెడరేషన్ అధికారిక ప్రకటన చేసే అవకాశముంది.

ఇవి కూడా చదవండి:

రాజ్ తరుణ్ ‘టార్టాయిస్’ ఫస్ట్ లుక్ పోస్టర్.. ఇంట్రెస్టింగ్

బండ్ల గణేష్ ఎందుకు ఇంత హర్టయ్యాడు..

‘ఎపిక్’ టీమ్‌తో NSR స్పెషల్ ఇంటర్వ్యూ

Updated Date - Aug 30 , 2026 | 07:50 PM