పవన్ కళ్యాణ్ రెండు భుజాలకీ రొటేటర్ కఫ్ ఇంజ్యూరీస్.. శస్త్ర చికిత్స!
ABN, Publish Date - Jul 11 , 2026 | 12:00 PM
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌కు శనివారం ఉదయం ముంబయిలో శస్త్ర చికిత్స జరిగింది. ఆయన రెండు భుజాలకు రొటేటర్ కఫ్ ఇంజ్యూరీస్ తీవ్రంగా ఉన్నట్లుగా వైద్యులు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ (AP Deputy CM Pawan Kalyan) కు శనివారం ఉదయం ముంబయిలో శస్త్ర చికిత్స జరిగింది. ఆయన రెండు భుజాలకు రొటేటర్ కఫ్ ఇంజ్యూరీస్ (Rotator Cuff Injuries) తీవ్రంగా ఉన్నాయి. ఇటీవల వైద్య పరీక్షలు నిర్వహించినప్పుడు- వీలైనంత త్వరగా శస్త్ర చికిత్స అవసరమని వైద్య నిపుణులు స్పష్టం చేసిన విషయం తెలిసిందే. అప్పటికే పవన్ కళ్యాణ్ నిర్వహించాల్సిన అధికారిక కార్యక్రమాలు నిర్ణయం అయినందున వాటిని ముగించుకొన్న తర్వాత శస్త్ర చికిత్స చేయించుకొంటానని పవన్ కళ్యాణ్ వైద్యులకు తెలియచేశారు. రెండు భుజాలకు ఒకేసారి శస్త్ర చికిత్స చేయడం వల్ల నొప్పి తీవ్రత భరించలేని స్థాయిలో ఉంటుందని వైద్యులు తెలిపారు. ఈ క్రమంలో కుడి భుజానికి సంబంధించిన రొటేటర్ కఫ్ ఇంజ్యూరీకి శనివారం ఆపరేషన్ చేశారు. ముందస్తుగా చేయాల్సిన వైద్య పరీక్షలను శుక్రవారం నిర్వహించారు. శనివారం రోజున నిర్వహించిన ఆపరేషన్‌కు మూడున్నర గంటల సమయం పట్టినట్లు వైద్యులు తెలిపారు. మరో భుజానికి రెండు నెలల వ్యవధిలో శస్త్ర చికిత్స చేయాల్సి ఉంటుందని అన్నారు.
పదేళ్ళ నుంచి నొప్పి భరిస్తూ...
పవన్ కళ్యాణ్‌కు 2016లో భుజానికి గాయాలు అయ్యాయి. ప్రథమ చికిత్స అనంతరం వైద్యులు తగిన విశ్రాంతి అవసరం అని సూచించినా.. ఆయన వినకుండా సమావేశాలలో పాల్గొన్నారు. 2018లో చేపట్టిన పోరాట యాత్ర సందర్భంలో జనసేన పార్టీ శ్రేణులు తమ అభిమాన నాయకుడికి దగ్గరగా వెళ్ళి చేతులు కలపాలి అనే ఉద్దేశంతో చేతులు పట్టి లాగేవారు. ఆ సందర్భంలో నొప్పి కలిగినా భరించేవారు. ఈ యాత్రల్లో అభిమానులు దూసుకువచ్చి మరీ ఆయనతో కరచాలనం చేయాలని ఉత్సాహంతో చేతులు గుంజేవారు. అప్పుడు నొప్పి విపరీతంగా వచ్చినా పంటి బిగువున భరించారు. ఆ తర్వాత కూడా ఆ గాయాలను అశ్రద్ధ చేశారు. 2019 ఎన్నికల అనంతరం రాయలసీమ జిల్లాల్లో.. ముఖ్యంగా మదనపల్లెలో టమోటా రైతుల సమస్యలు తెలుసుకోవడానికి వెళ్ళిన సందర్భంలో పార్టీ శ్రేణులు, అభిమానులు పవన్ కల్యాణ్‌కు చేరువగా వెళ్ళి కరచాలనం చేయడం, ఆప్యాయంగా హత్తుకొనే సందర్భాల్లో గాయాలు తిరగబెట్టాయి. అయినా పట్టించుకోలేదు. గత సార్వత్రిక ఎన్నికలు, అంతకు ముందు వారాహి యాత్ర సందర్భంలోను అభిమానులు కరచాలనం కోసం దూసుకు వచ్చేవారు. గాయాల వల్ల నొప్పి వస్తున్నా భరించారు.
ఏప్రిల్ నెలలో పవన్ కళ్యాణ్ ముక్కుకి శస్త్ర చికిత్స చేసే సందర్భంలో పలు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంలో భుజాలకు రొటేటర్ కఫ్ ఇంజ్యూరీస్, మజిల్ టేర్స్ తీవ్ర స్థాయిలో ఉన్నట్లు గుర్తించారు. ఇంత తీవ్ర గాయాలు ఉన్నప్పటికీ ఏ విధంగా భరిస్తున్నారు అని వైద్యులు ఆశ్చర్యపడ్డారు. వీటికి వీలైనంత త్వరగా ఆపరేషన్ చేయాలని అప్పుడే వైద్యులు సూచించారు. ఈ క్రమంలోనే కొద్ది వారాల కిందట ముంబయిలో వైద్య పరీక్షలు చేయించుకున్నారు. ఇందులో భాగంగా శనివారం కుడి భుజానికి ఆపరేషన్ నిర్వహించారు. ప్రస్తుతం ఆయన వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు.
ఇవి కూడా చదవండి:
అయ్యగారి ‘లెనిన్’ ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంతంటే..
Love oh Love Review: ‘లవ్ ఓ లవ్’ మూవీ రివ్యూ
గాడ్ ఆఫ్ వార్: త్రివిక్రమ్ వర్సెస్ వెట్రిమారన్