Love oh Love Review: ‘లవ్‌ ఓ లవ్‌’ మూవీ రివ్యూ

ABN , Publish Date - Jul 11 , 2026 | 07:39 AM

తమిళ అనువాద చిత్రం ‘జాబిలమ్మ నీకు అంతకోపమా’.. ధనుష్‌ మేనల్లుడు పవిష్‌ నారాయణ్‌కు మంచి లాంచ్‌. కమర్షియల్‌ లెక్కలు పక్కన పెడితే ఈ తరాన్ని బాగా ఆకట్టుకుంది. ఇప్పుడాయన హీరోగా నటించిన ‘లవ్ ఓ లవ్’ మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

Love oh Love Movie Review

తమిళ అనువాద చిత్రం ‘జాబిలమ్మ నీకు అంతకోపమా’.. ధనుష్‌ మేనల్లుడు పవిష్‌ నారాయణ్‌ (Pavish Narayan)కు మంచి లాంచ్‌. కమర్షియల్‌ లెక్కలు పక్కన పెడితే ఈ తరాన్ని బాగా ఆకట్టుకుంది. ఏడాది తిరిగేలోపు రెండో చిత్రం ‘లవ్‌ ఓ లవ్‌’ (Love Oh Love) చిత్రంతో ప్రేక్షకుల ముందుకొచ్చారు పవిష్‌. ఫోక్‌ సాంగ్స్‌తో తెలుగునాట పాపులర్‌ అయిన నాగదుర్గ (Naga Durga) ఈ చిత్రంతో కోలీవుడ్‌కి హీరోయిన్‌గా పరిచయమైంది. మగేష్‌ రాజేంద్రన్‌ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. సెల్వ రాఘవన్‌, కె.ఎస్‌. రవికుమార్‌, వనితా విజయ్‌కుమార్‌ కీలక పాత్రదారులు. తమిళ, తెలుగు భాషల్లో ఈ నెల 10న ప్రేక్షకుల ముందుకొచ్చిందీ చిత్రం. యూత్‌ఫుల్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం. (Love Oh Love Movie Review)


కథ:

రఘు (పవిష్‌) ఓ కార్పొరేట్‌ ఉద్యోగి. అవంతిక (నాగదుర్గ) కూడా అంతే! మొదటి చూపులోనే ఆ అమ్మాయి ప్రేమలో పడతాడు. అక్కడి నుంచి ఆ అమ్మాయిని సినిమాలు, షాపింగ్‌లు, షికార్లు తిప్పడమే అతని పనిగా మారుతుంది. ఆఫీస్‌లో పని కూడా చేసుకోనివ్వకుండా రఘుని తన చుట్టూ తిప్పుకుంటూనే ఉంటుంది. అవంతిక కోసం లెక్కకు మించి ఖర్చు చేసి క్రెడిట్‌ కార్డులు, లోన్లు అంటూ అప్పుల పాలవుతాడు. దాంతో కుటుంబం దూరమవుతుంది.. జాబ్‌ కోల్పోతాడు. నాలుగేళ్ల ప్రేమ తర్వాత రఘు అవంతికను వదిలించుకుని దుబాయ్‌ వెళ్లి స్థిరపడాలనుకుంటాడు. ఈ విషయం తెలుసుకున్న మహిళా మండలి అధ్యక్షురాలు లేఖ (వనిత విజయ్‌ కుమార్‌).. రఘు ఓ యువతికి అన్యాయం చేసి వెళ్లిపోతున్నాడని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో స్టేషన్‌లో కూర్చుంటాడు రఘు. అతని కథ మొత్తం పోలీస్‌ అధికారి హరి (సెల్వ రాఘవన్‌) ముందుంచి తను దుబాయ్‌ వెళ్లకుండా ఉండాలంటే కొన్ని కండీషన్లు పెడతాడు. ఆ కండీషన్లు ఏంటి? అసలు పోలీస్‌ స్టేషన్‌లో ఏం జరిగింది? రఘు కోల్పోయిన జీవితం మళ్లీ తన చెంతకు వచ్చిందా? అవంతికతో ప్రేమ, పెళ్లి సఫలం అయిందా లేదా? అన్నదే కథ.


విశ్లేషణ

నేటితరం అమ్మాయిలు, అబ్బాయిలు ప్రేమలో పడ్డాక ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారు? ప్రేమ పేరుతో లగ్జరీ లైఫ్‌ కోసం బాధ్యత లేని అమ్మాయిలు.. అబ్బాయిల జేబు ఎలా ఖాళీ చేస్తున్నారు? వీటి వల్ల కుటుంబాల్లో ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతున్నాయి? అనే ఇతివృత్తంతో తెరకెక్కిన చిత్రమిది. హీరో దుబాయ్‌ వెళ్లిపోవడానికి చేస్తున్న ప్రయత్నం, మహిళా మండలి ద్వారా పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లడంతో కథ మొదలవుతుంది. హీరోయిన్‌తో ప్రేమ, అతనికి ఎదురైన సమస్యల్ని ఒక్కొక్కటిగా చెబుతూ హీరో పెట్టిన కండీషన్స్‌తో ఫస్టాఫ్‌ సాగుతుంది. ఈతరం యువత ప్రేమలో ఉంటే ఎలాంటి పరిస్థితులు ఎదురవుతున్నాయి? అబ్బాయిలు.. అమ్మాయిల కోసం ఎంతలా ఖర్చు పెడతారు.. అసలు ప్రేమ కోసం అమ్మాయిలు ఏం చేస్తున్నారు? అమ్మాయిల చుట్టూ అబ్బాయిల్ని ఎలా తిప్పికుంటున్నారు అన్నది ఆద్యంతం నవ్వులు పూయిస్తూ చూపించారు. అవంతిక ప్రేమను అంగీకరించి రఘు ఇండియాలోనే ఉండాలంటే పెట్టిన రెండు కండీషన్ల కాన్సెప్ట్‌ బావుంది. ప్రేమ కోసం అమ్మాయి, అబ్బాయి ప్లేసులు మార్చుకోవడం.. ఒకప్పుడు అతను చేసింది.. ఇప్పుడు హీరోయిన్‌ చేయడం పలు చిత్రాల్లో చూశాం. కానీ ఇందులో దర్శకుడు చూపించిన తీరు ఆకట్టుకుంటుంది. వినోదం, కుటుంబ భావోద్వేగాలు, ఓ యువకుడి బాధ్యతను సమపాళ్లల్లో చూపించారు. కానీ.. క్లైమాక్స్‌కి చేరేసరికి అప్పటి వరకు ఓ ఫ్లోలో ఉన్న కథ పూర్తిగా ఫ్లేవర్‌ మారిపోతుంది. సినిమా అంతా అబ్బాయిల పాయింట్‌లో రియాల్టీ చూపించి క్లైమాక్స్‌లో.. అమ్మాయి చెప్పిన నాలుగు ఎమోషనల్‌ డైలాగులతో ట్రాక్‌ మొత్తం మారిపోతుంది. ఇంటర్వెల్‌కు ముందు నుంచి తెరపై ఏం జరుగుతుందో ఊహకు అందేలా ఉంది. స్క్రీన్‌ప్లేలో కాస్త జాగ్రత్త తీసుకుని ఉంటే బావుండేది. ఎండింగ్‌ కరెక్ట్‌గా లేదనిపిస్తుంది. పాటలు సినిమా రన్‌ ఫ్లోను మిస్‌ చేశాయి.


నటీనటులు, సాంకేతిక నిపుణులు పనితీరు..

హీరోగా పవిష్‌ నటన ఆకట్టుకుంది. మొదటి చిత్రంతో కంపేర్‌ చేస్తే ఈ సినిమాలో నటన, ఈజ్‌ ఆకట్టుకున్నాయి. యూట్యూబ్‌ సెన్సేషన్‌ నాగదుర్గ చక్కని నటనతో ఆకట్టుకుంది. ఈతరం అమ్మాయిగా నటనతో చెలరేగిపోయింది. కథల ఎంపికలో కరెక్ట్‌గా ఉంటే ఆమెకు మంచి భవిష్యత్తు ఉంటుంది. మధ్య తరగతి తండ్రిగా కెఎస్‌ రవికుమార్‌ పాత్ర చక్కని భావోద్వేగాలు పంచగా, సెల్వరాఘవన్‌ పాత్ర నవ్వులు పూయించింది. వనితా విజయ్‌కుమార్‌ పాత్ర ఓకే అంటే ఓకే అంతే. ఇతర పాత్రధారులంతా ఓకే. సినిమాటోగ్రాఫర్‌ పిజి ముత్తయ్య పనితీరు సినిమాకు ఎసెట్‌. ఎడిటింగ్‌ బావుంది. ఫోక్స్‌ సంగీతం కూడా సినిమాకు ఎసెట్‌. కాకపోతే పాటలేం అర్థం కావు. డబ్బింగ్ మరీ దారుణంగా ఉంది. ఏదో హడావుడిగా రిలీజ్ చేయాలన్నట్లుగా కాకుండా, డబ్బింగ్ విషయంలో ఇంకాస్త కేరింగ్ తీసుకుని ఉంటే బాగుండేది. దర్శకుడు తీసుకున్న పాయింట్‌ ఈ తరానికి బాగా కనెక్ట్‌ అయ్యేలా ఉంది. లవ్‌లో ఇప్పుడున్న రియాలిటీ ఏంటో చూపించారు. ప్రేమ, డబ్బు విలువ, స్నేహం, తల్లిదండ్రుల బాధ్యతలు అన్నింటినీ మిళితం చేసి తెరకెక్కించిన ఈ చిత్రం జెన్ జీ‌ ఆడియెన్స్‌ని టార్గెట్ చేసినట్లుగా మాత్రమే ఉంది.

ట్యాగ్‌లైన్‌: జెన్ జీ ని ఆకట్టుకునే ‘లవ్ ఓ లవ్’

రేటింగ్‌: 2.5/5

Updated Date - Jul 11 , 2026 | 10:40 AM