యన్టీఆర్‌పై అభిమానం.. ఆరేళ్ల కృషితో 400 పేజీల అపురూప చిత్రాల పుస్తకం!

ABN , Publish Date - Oct 30 , 2026 | 04:34 PM

నటరత్న యన్టీఆర్‌పై తనకున్న అభిమానాన్ని చిత్రలేఖనం రూపంలో చాటుకున్నారు రాజమండ్రికి చెందిన ఆర్.ఆర్. జనార్దన్. ఆరేళ్ల కృషితో 400 పేజీల అరుదైన చిత్రాల పుస్తకాన్ని రూపొందించారు. చంద్రబాబు నాయుడు ఈ పుస్తకాన్ని ఆవిష్కరించారు.

Book On NTR

అభిమానం-ఆత్మీయత అంతా ఒక బూటకం - అంటారు కొందరు. కానీ కొందరిని చూస్తే అభిమానానికి హద్దులు ఉండవని- ఆరాధనకు అంతం లేదనిపిస్తుంది. నటరత్న యన్టీఆర్ అభిమాని ఆర్. ఆర్. జనార్దన్ ఈ మాటలను నిజం చేశారు. తన చిత్రలేఖనంతో ఆరాధ్య నటుని సినీరాజకీయ చిత్రాలను రచించి నివాళి అర్పించారు జనార్దన్.

రాజమండ్రికి చెందిన ఆర్. ఆర్. జనార్దన్ బాల్యం నుంచీ నటరత్న యన్.టి.రామారావు అభిమాని. యన్టీఆర్ నటించిన పౌరాణిక, జానపద, చారిత్రక, సాంఘికాలను చూస్తూ పెరిగిన జనార్దన్ చదువుకొనే రోజుల్లోనూ, ఉద్యోగం చేసే సమయంలోనూ తన అభిమాన నటుణ్ణి ఆరాధిస్తూనే వచ్చారు. ఇప్పుడు రిటైర్ అయిన తరువాత కూడా యన్టీఆర్ ను అనునిత్యం స్మరించుకుంటూ ఉన్నారు జనార్దన్. అంతటితో ఆగలేదు- తనకు తెలిసిన చిత్రలేఖనంతో అభిమాన నటుని అపురూప చిత్రాలను చిత్రించారు. యన్టీఆర్ నటించిన 300 చిత్రాల్లోని కొన్ని అరుదైన పాత్రలకు జనార్దన్ తన చిత్రలేఖనంతో జీవం పోశారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ పుస్తకాన్ని ఈ మధ్యే ఆవిష్కరించారు. దాదాపు 400 పేజీలతో రూపొందిన ఈ పుస్తకంలోని ప్రతి పుట ఇట్టే ఆకర్షిస్తుంది.

WhatsApp Image 2026-10-30 at 3.45.24 PM.jpeg


ఆరేళ్ళ కృషి...

యన్టీఆర్ కు జనార్దన్ నివాళిగా చిత్రీకరించిన బొమ్మలతో రూపొందిన ఈ పుస్తకంలో ప్రతి యేటా యన్టీఆర్ నటించిన చిత్రాల వివరాలు ఉన్నాయి. అంటే యన్టీఆర్ చలనచిత్ర జీవితాన్ని తన కుంచెతో రూపొందించే ప్రయత్నం చేశారు జనార్దన్. అలాగే యన్టీఆర్ రాజకీయ జీవితం కూడా ఇందులో కనిపించేలా చేశారు. అంతేకాదు - యన్టీఆర్ నటజీవితంలోని మైలురాళ్ళను ప్రస్తావించారు. వాటితో పాటు యన్టీఆర్ పై గతంలో ఎందరో ప్రముఖులు రాసిన వ్యాసాలనూ పొందుపరిచారు. ఇలా అభిమానులను ఆకట్టుకొనేలా రూపొందిన ఈ పుస్తక రూపకల్పన కోసం ఆరేళ్ళు అవిరామంగా కృషి చేశారు జనార్దన్.

nandamuri.jpg

అరుదైనది. ఖరీదైనది..

యన్టీఆర్ బొమ్మలకు తన కుంచెతో ప్రాణం పోసిన ఆర్. ఆర్.జనార్దన్ చేసిన కృషిని ఆయన ఎవరికీ అంతగా చెప్పుకోవడం లేదు. ఏదో తెలిసిన వారి ద్వారా ఈ పుస్తకానికి ప్రచారం దక్కుతోంది. ఈ పుస్తకం వెల ఐదువేల ఐదువందల రూపాయలు. అయినా పుస్తకాన్ని చూడగానే యన్టీఆర్ అభిమానులకు సొంతం చేసుకోవాలనే అభిలాష కలుగుతుంది. అంతలా ఆకర్షించేలా పుస్తకాన్ని రూపొందించారు జనార్దన్. అమేజాన్ లో ఈ పుస్తకం లభిస్తోంది. ఈ అపురూప పుస్తకానికి అమేజాన్ సంస్థ మంత్లీ ఇన్ స్టాల్ మెంట్స్ కూడా అందిస్తోంది. దేశవిదేశాల్లోని అభిమానులు ఈ రేర్ బుక్ ను అందుకోవాలని తపిస్తున్నారు. అతి త్వరలోనే మలిముద్రణకు వెళ్తున్నారు జనార్దన్. ఈ అభిమాని ప్రయత్నాన్ని ఇతర యన్టీఆర్ ఫ్యాన్స్ ఏ తీరున ఆదరిస్తారో చూడాలి.

ఇదిలా ఉంటే. ఈ పుస్తక రూపకల్పనకు ముందు ఆర్.ఆర్. జనార్దన్ తన మిత్రుడు విద్యాసాగర్‌తో కలిసి 'శుభలేఖ+లు' పేరుతో ఓ సినిమాను నిర్మించారు. శ్రీనివాస సాయి, తిరువీర్‌, ప్రియా వడ్లమాని, దీక్షశర్మ ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమాను శరత్‌ నర్వాడే డైరెక్ట్ చేశారు.

ఇవి కూడా చదవండి:

‘మెగావర్స్’లో కమల్ హాసన్ - చిరంజీవిల క్రేజీ ప్రామిస్..

Ramayana: ‘జతగూడె’.. కన్నుల పండువగా సీతారాముల కళ్యాణం సాంగ్

‘ఆకాశంలో ఒక తార’.. మనసును తాకేలా ‘రాధే రాధే’ సాంగ్ విడుదల

Updated Date - Oct 30 , 2026 | 04:45 PM