నంది అవార్డుల ప్రదానానికి ఏపీ సర్కార్ వేగం.. ఓవర్ ఆల్ ఇన్‌ఛార్జ్‌గా సీనియర్ ఐఏఎస్ అధికారి!
ABN, Publish Date - Nov 24 , 2026 | 06:20 PM
2012 నుంచి 2024 వరకు నంది అవార్డుల ప్రదానానికి ఏపీ ప్రభుత్వం కసరత్తు వేగవంతం చేసింది. అవార్డుల నిర్వహణ బాధ్యతలను సీనియర్ ఐఏఎస్ అధికారి ఎస్.ఎస్. రావత్‌కు అప్పగించింది.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నంది అవార్డుల ప్రదానం విషయంలో పట్టుదలగా ఉంది. 2012 నుంచి 2016 వరకూ నంది అవార్డులను ప్రకటించినా వాటిని ఇంతవరకూ ప్రదానం చేయలేదు. ఆ అవార్డులను గ్రహీతలకు అందచేయడంతో పాటు ఆ తర్వాత 2017 నుంచి 2024 వరకూ యేడాదికి మూడు సినిమా (ప్రథమ, ద్వితీయ, తృతీయ)లతో పాటు, రెండు స్పెషల్ జ్యూరీ అవార్డులు ఇవ్వాలని నిర్ణయించింది. అలానే 2017 నుంచి 2024 వరకూ ఎన్టీఆర్ జాతీయ అవార్డు, రఘుపతి వెంకయ్య, బి.ఎన్. రెడ్డి, నాగిరెడ్డి - చక్రపాణి అవార్డులను సైతం ప్రకటించాలని నిర్ణయం తీసుకుంది. 2012 నుంచి 2024 వరకూ విజేతలందరికీ అవార్డులను ఇదే డిసెంబర్ లో ప్రదానం చేయబోతున్నట్టు ఇప్పటికే ప్రకటించింది. అయితే కార్పొరేషన్, మునిసిపాలిటీ, పంచాయితీ ఎన్నికల కారణంగా ఈ ప్రక్రియలో కొంత జాప్యం జరిగింది. డిసెంబర్ మొదటి వారంలో పంచాయితీ ఎన్నికల ఫలితాలు రాగానే, వెంటనే జ్యూరీని ప్రకటించి, ఆ వెంటనే సినిమాలను త్వరితగతిన ఎంపిక చేసి అవార్డులను ఇవ్వనున్నారు.
నంది అవార్డుల ప్రదానోత్సవ వేడుక ఏపీ ఎఫ్.డి.సి. ఛైర్మన్ భరత్ భూషణ్, మేనేజింగ్ డైరెక్టర్ విశ్వనాథ్ ఆధ్వర్యంలో జరగబోతోంది. అయితే... తాజాగా రాష్ట్ర ప్రభుత్వం వీటి నిర్వహణ మరింత సజావుగా సాగడం కోసం ప్రభుత్వం సీనియర్ ఐ.ఎ.ఎస్. అధికారి, పర్యాటక, సాంస్కృతిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్.ఎస్.రావత్‌ను ఓవర్ ఆల్ ఇన్ ఛార్జ్ గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీనితో నంది అవార్డుల ప్రదాన కార్యక్రమం మరింత వేగవంతంగా జరిగే అవకాశం ఏర్పడింది.
ALSO READ:
‘అలియాస్ రుక్మిణి’ ట్రైలర్ లేకుండానే.. నాని రియాక్షన్ ఇదే
సూర్య ‘సీన్’ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే
RC17: రామ్ చరణ్ సరసన ఆ ‘తార’ ఫిక్స్ అయినట్టేనా?