కంగనా - బాబా రామ్ దేవ్ మధ్య సయోధ్య
ABN , Publish Date - Aug 29 , 2026 | 08:20 AM
ప్రముఖ నటి కంగనా రనౌత్, బాబా రామ్ దేవ్ మధ్య వివాదానికి ఫుల్ స్టాప్ పడింది. రాఖీ పౌర్ణమి సందర్భంగా వీరిద్దరూ తమ మధ్య ఉన్న విభేదాలను పక్కన పెట్టి అన్నాచెల్లెళ్ళు మాదిరి మిఠాయిలు ఇచ్చిపుచ్చుకున్నారు.
బాలీవుడ్ ఫైర్ బ్రాండ్, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్.. బాబా రామ్ దేవ్ మధ్య గొడవలు, మాటల యుద్థానికి ఫుల్ స్టాప్ పడింది. రాఖీ పండుగ సందర్భంగా బాబా రామ్ దేవ్ చొరవ చూపి గొడవకు ముగింపు పలికారు. ఢిల్లీలో నిరసనలు చేపట్టిన జన్ జీ యువతను ఉద్దేశించి 'జనరేషన్ గట్టర్' అంటూ కంగనా రనౌత్ తీవ్ర వ్యాఖ్యలు చేయడాన్ని బాబా రామ్ దేవ్ తప్పుపట్టిన సంగతి తెలిసిందే. దీనిపై కొన్నాళ్లుగా ఇద్దరి మధ్య మాటల యుద్ధం సాగుతోంది.
ఈ క్రమంలో శుక్రవారం హరిద్వార్ లో బాబా రామ్ దేవ్ మీడియాతో మాట్లాడుతూ, 'కంగనను తాను సోదరిగా భావిస్తున్నానని, ఆమెకు రాఖీ పండుగ సందర్భంగా స్వీట్లు, కానుకలను పోస్టు ద్వారా పంపు'తున్నట్లు పేర్కొన్నారు. బాబా రామ్ దేవ్ చొరవకు అటు కంగన కూడా సానుకూలంగా స్పందించారు. 'పండుగ రోజు అంటే తప్పొప్పులను క్షమించి మరిచిపోయే రోజు, వివాదం వద్దు.. చర్చే ముద్దు అంటూ మా అన్నయ్య రామ్ దేవ్ మంచి మాట చెప్పారు. అన్నయ్య ప్రేమను నేను మనస్ఫూర్తిగా స్వీకరిస్తున్నాను' అని వ్యాఖ్యానించారు. మొత్తం మీదే జాతీయ భావాలు కలిగిన వీరిద్దరి మధ్య సయోధ్య ఏర్పడటంతో సన్నిహితులు ఊపిరి పీల్చుకున్నారు. ఇదంతా టీకప్పులో తుఫాన్ లాంటిదని వారు వ్యాఖ్యానించారు.
ఇవి కూడా చదవండి:
హీరోయిన్లు కాదు.. విలన్లు! నెగెటివ్ పాత్రలతో మెప్పిస్తున్న భామలు
Raviteja: ‘ఇరుముడి’ తర్వాత రవితేజ స్పీడ్.. ఐశ్వర్య రాజేశ్‌తో కొత్త ప్రయోగం!
కృతి సనన్ రాఖీ యాడ్ వివాదం.. మధు చోప్రా హాట్ కామెంట్స్!