Jana Nayagan: 'భగవంత్ కేసరి' నుంచి డీవియేషన్... దెబ్బ కొట్టేసింది!
ABN , Publish Date - Jul 23 , 2026 | 05:48 PM
'భగవంత్ కేసరి రీమేక్ గా వచ్చిన 'జన నాయగన్'లో చాలానే మార్పులు చేర్పులు చేశారు. ఇందులోని కోర్ పాయింట్ ను తీసుకున్నా... విలన్ ట్రాక్ అంతా పొలిటికలైజ్ చేయడంతో సినిమా తెలుగు వారిని నిరాశకు గురిచేస్తోంది.
దళపతి విజయ్ నటించిన 'జన నాయగన్', బాలకృష్ణ మూడేళ్ళ క్రితం చేసిన 'భగవంత్ కేసరి'కి రీమేక్. అయితే ఈ విషయాన్ని అప్పట్లో ఆ చిత్ర దర్శకుడు అనిల్ రావిపూడి అధికారికంగా ప్రకటించడానికి ఇష్టపడలేదు. తమిళ నటుడు వీటీవీ గణేశ్ ఓ సభావేదిక మీద ఈ విషయాన్ని చెప్పినా... అనిల్ రావిపూడి ఆయన్ని వారించారు. 'అది వాళ్ళు చెబితే బాగుంటుంది. మీరు ఊరుకోండి' అంటూ ఆయన చేతిలోంచి మైక్ ను కూడా లాగేసుకున్నారు. అప్పుడు వీటీవీ గణేశ్ కాస్తంత అలిగాడు కూడా. అయితే 'జన నాయగన్' సినిమాను ఇవాళ థియేటర్లలో చూసి వాళ్ళంతా పెదవి విరుస్తున్నారు. దానికి కారణం 'భగవంత్ కేసరి'లా ఇది లేకపోవడమే!
దర్శకుడు హెచ్. వినోద్ ఈ సినిమాను విజయ్ ఇమేజ్ ను, తమిళనాడులోని రాజకీయ పార్టీల వ్యవహారాలను, త్వరలో జరుగబోయే అసెంబ్లీ ఎన్నికలను (అప్పటికీ ఎన్నికలు జరగలేదు కాబట్టి) దృష్టిలో పెట్టుకుని ఈ సినిమాను తెరకెక్కించాడు. అయితే ఈ లోగా ఎన్నికలైపోయి విజయ్ సీఎంక ఆవడంతో కథలో కొన్ని మార్పులు చేర్పులు చేశారు. దాంతో అది కాస్తా అతుకుల బొంతగా తయారైంది.
తెలుగులో సినిమా ఆపదలో ఉన్న ముంబై హైకోర్టు న్యాయమూర్తి ఫ్యామిలీకి ఓ వ్యక్తి భగవంత్ కేసరి కథ చెప్పడంతో మొదలవుతుంది. ఇక్కడ 'జన నాయగన్' ఎన్నికలను టార్గెట్ చేసి తీసిన సినిమా కావడంతో ఓ గ్రామం ప్రజలు ఓటు వేయడానికి వెళ్ళకుండా ఇళ్ళలోనే ఉండిపోతారు. తాము అధికార పక్షానికి ఓటు వేయమనే భావనతో తాము ఓటు వేయడానికి వెళితే తమపై దాడి జరుగుతుందనే భయంతో వారు ఉంటారు. వారిలో ధైర్యం కలిగించడం కోసం అక్కడికి వచ్చిన ఓ పోలీస్ అధికారి... 'జన నాయగన్' కథను చెబుతాడు. ఇది 2026 ఎన్నికల జరిగేప్పుడు చెప్పే కథ. ఈ కథ విన్న ఊరి జనాలు ధైర్యంగా ఓటు వేయడానికి పోలింగ్ కేంద్రాలకు వెళతారు. సో... 2026 అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు ధైర్యంగా ఓటు వేయడంతో విజయ్ గెలిచాడని ఇన్ డైరెక్ట్ గా దర్శకుడు చూపించాడు. ఇది విజయ్ ముఖ్యమంత్రిగా ఎన్నికైన తర్వాత జత చేసిన సన్నివేశమే అనిపిస్తోంది.
ఇక హీరో నేపథ్యం, అతను జైలుకు వెళ్ళడం, జైలర్ కు హీరోకు ఉన్న అనుబంధం, జైలర్ తన కూతురును హీరో చేతిలో పెట్టి కన్నుమూయడం ఇలాంటి సన్నివేశాలన్నీ 'భగవంత్ కేసరి'లో ఉన్నట్టుగానే చూపించారు. అలానే 'బ్యాడ్ టచ్ గుడ్ టచ్' గురించి హీరో చెప్పడం, విజ్జీని ఆర్మీలో చేర్పించడం కోసం ఆమెను కష్టపెట్టడం, చివరిలో హీరో అశక్తుడిగా ఉన్న సమయంలో విజ్జీ ధైర్యంగా పోరాటం చేయడం కూడా సేమ్ టు సేమ్ ఉన్నాయి. ఇవన్నీ తమిళ ఆడియెన్స్ ను ఆకట్టుకునే అంశాలే. ఇప్పుడు విజయ్ సీఎం హోదాలో ఈ సన్నివేశాలలో నటించడం చూసి వాళ్ళు మరింత ఆనంద పడతారు కూడా. అయితే... విలన్ ట్రాక్ ను మాత్రం పూర్తిగా పొలిటికలైజ్ చేయడం తెలుగు ప్రేక్షకులకు అస్సలు మింగుడు పడదు.
'భగవంత్ కేసరి'లో విలన్ ప్రభుత్వాన్ని తన చెప్పు చేతల్లో పెట్టుకుని పోర్టులను అనుసంధానించే ప్రాజెక్ట్ ను హస్తగతం చేసుకోవాలని అనుకుంటాడు. అందుకు ఎవరు అడ్డువచ్చినా నిర్ధాక్షణ్యంగా చంపేస్తుంటాడు. అలాంటి విలన్ కు చెందిన ఓ రహస్యం విజ్జీ ల్యాప్ టాప్ లో ఉండటంతో ఆమెను అంతం చేయాలని విలన్ మనుషులు ప్రయత్నిస్తారు. వారి నుంచి బాలకృష్ణ ఆమెను రక్షించే క్రమంలో అతని పాత పగ బయటకు వస్తుంది. ఇక హీరోయిన్ తెలుగు సినిమాలో ఓ సైక్రియాటిస్ట్. ఆమె విజ్జీని మామూలు మనిషి చేయడానికి ప్రయత్నించే క్రమంలో హీరోకు దగ్గరవుతుంది. తమిళ రీమేక్ లో హీరోయిన్ ఛానెల్ రిపోర్టర్. ఆమె విజ్జీకి సాయం చేయడం కంటే...హీరోకు ఎక్కువగా సాయం చేస్తుంటుంది.
'జననాయగన్'లో విలన్ ట్రాక్‌ను పూర్తి భిన్నంగా రాసుకున్నారు. ఐపీఎస్ అధికారి తనకు జరిగిన అవమానానికి ప్రతీకారం తీర్చుకోవాల్సింది పోయి... రాజకీయ నాయకులతో చేతులు కలపడం, రాష్ట్రాన్ని హస్తగతం చేసుకోవడానికి ఆఫ్రికాతో పాటు పలు దేశాల్లో సివిల్ వార్ రావడానికి కారకుడు కావడం, అలాంటి సివిల్ వార్ ఇండియాలోనూ తీసుకు రావడానికి అక్రమంగా ఆయుథాలను ఇక్కడకు తీసుకు రావడం, దేశాన్ని కులం, మతం, ప్రాంతం పేరుతో విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నించడం చేస్తాడు. అతని కుయుక్తులను, అతనితో చేతులు కలిపిన రాజకీయ నాయకుడి దుష్ట చేష్టలను 'జన నాయగన్'లో హీరో అడ్డుకుంటాడు. పనిలో పనిగా రాష్ట్రంలోని సీఎస్ నూ విలన్ గా చూపించేశారు. అవసరం ఉన్నచోట, లేని చోట కూడా పొలిటికల్ సెటైర్స్ ను చొప్పించారు. ఇందులో విజయ్ ఓ సిన్సియర్ పోలీస్ ఆఫీసర్. ఆ తర్వాత సస్పెండ్ అవుతాడు. జైలు నుంచి తిరిగొచ్చి విజ్జీ కోసం లో-ప్రొఫైల్ మెయిన్ టైన్ చేస్తూ జీవితాన్ని సాగిస్తాడు. కానీ ఆ పోలీస్ ఆఫీసర్ ను ఓ పొలిటికల్ లీడర్ మాదిరిగా ఎలివేట్ చేస్తూ ఏకంగా పాట పెట్టేశారు. ఇది పొలిటికల్ మోటివ్ తో చేసినట్టే స్పష్టంగా అర్థమౌతుంది.
మొత్తం మీద 'జన నాయగన్'లో హీరో విజయ్ కంటే... పొలిటికల్ లీడర్ విజయ్ కే దర్శకుడు అధిక ప్రాధాన్యం ఇచ్చాడు. అందువల్ల అతని అభిమానులకు, పార్టీ కార్యకర్తలకు 'జన నాయగన్' నచ్చే ఆస్కారం ఉంది. తెలుగు వారిని మాత్రం ఈ సినిమా మెప్పించలేకపోయింది.
ఇవి కూడా చదవండి:
Jana Nayakudu: విజయ్ జన నాయకుడు రివ్యూ
మా అన్నయ్య మెగాస్టార్‌కు.. నేను పవర్ స్టార్‌కు అభిమానులం: కిరణ్ అబ్బవరం
మా రమేష్ మాకు కావాలి సార్.. పవన్, హరీష్ శంకర్‌లకు గబ్బర్ సింగ్ టీమ్ కన్నీటి విన్నపం