ఫోక్ సింగర్ ఈశ్వర్ సాయికి ముందస్తు బెయిల్.. ట్విస్ట్ ఏంటంటే?
ABN, Publish Date - Sep 13 , 2026 | 03:59 PM
ఫోక్ సింగర్ ఈశ్వర్ సాయికి తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. నార్సింగి పోలీస్ స్టేషన్‌లో నమోదైన కేసుకు సంబంధించి హైకోర్టు ఆయనకు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది.
ఫోక్ సింగర్ ఈశ్వర్ సాయికి తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. నార్సింగి పోలీస్ స్టేషన్‌లో నమోదైన కేసుకు సంబంధించి హైకోర్టు ఆయనకు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. తోటి జానపద గాయని మాధురి రాథోడ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదైన విషయం తెలిసిందే. పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశారనే ఆరోపణలతో భారతీయ న్యాయ సంహిత (BNS) సెక్షన్ 69తో పాటు ఎస్సీ, ఎస్టీ (అత్యాచార నిరోధక) చట్టంలోని సెక్షన్ 3(2)(v) కింద పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో అరెస్ట్ నుంచి రక్షణ కల్పించాలని కోరుతూ ఈశ్వర్ సాయి క్రిమినల్ పిటిషన్ నంబర్ 14088/2026 ద్వారా హైకోర్టును ఆశ్రయించారు. ఆయన తరఫున నాగూర్‌బాబు లా ఫర్మ్ న్యాయవాదులు బలంగా వాదనలు వినిపించారు.
కోర్టు విచారణ సందర్భంగా ఈశ్వర్ సాయి తరఫు న్యాయవాదులు కీలక విషయాలను వెల్లడించారు. ఫిర్యాదుదారు, నిందితుడి మధ్య ఉన్న బంధం చాలాకాలంగా పరస్పర అంగీకారంతో, స్వచ్ఛందంగానే కొనసాగిందని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. కేవలం సంబంధాలు బెడిసికొట్టడంతోనే ఈ కేసు పెట్టారని పేర్కొన్నారు. ఈ వ్యవహారంలో నిందితుడిని కస్టడీలోకి తీసుకుని విచారించాల్సిన అవసరం లేదని, దర్యాప్తుకు పూర్తిగా సహకరించేందుకు ఆయన సిద్ధంగా ఉన్నారని స్పష్టం చేశారు. ఆరోపణలు, సెక్షన్ల వర్తింపునకు సంబంధించిన వాస్తవాలను కేవలం దర్యాప్తులో లభించే ఆధారాల మేరకే నిర్ణయించాల్సి ఉంటుందని తెలిపారు.
ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం కేసు పూర్వాపరాలను పరిశీలించి ఈశ్వర్ సాయికి ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. కోర్టు విధించిన షరతులకు లోబడి ఆయనకు అరెస్ట్ కాకుండా మధ్యంతర రక్షణ కల్పించింది. కేసు దర్యాప్తు చట్ట ప్రకారం కొనసాగుతుందని ఆదేశించింది. అయితే ఇందులో అసలైన ట్విస్ట్ ఏంటంటే.. ముందస్తు బెయిల్ మంజూరు చేసినంత మాత్రాన ఈశ్వర్ సాయిపై వచ్చిన ఆరోపణలను కోర్టు కొట్టివేసినట్లు కాదని స్పష్టంగా పేర్కొంది. ఆరోపణల్లోని నిజానిజాలు దర్యాప్తు, తదుపరి న్యాయ విచారణ ఆధారంగానే తేలాల్సి ఉంది. ఫోక్ సింగర్స్ అయిన ఇద్దరు ప్రముఖ కళాకారుల మధ్య చోటుచేసుకున్న ఈ వివాదం ప్రస్తుతం ఇండస్ట్రీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
ఇవి కూడా చదవండి:
ఐకాన్ స్టార్ ‘రాకా’ రిలీజ్ పై మళ్లీ సస్పెన్స్..!
ఓటీటీలో ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ సంచలనం.. టైమింగ్ అదిరింది
70 ఏళ్ల వయసొచ్చినా.. నచ్చితే రెండో పెళ్లి చేసుకుంటా: ప్రేమ