70 ఏళ్ల వయసొచ్చినా.. నచ్చితే రెండో పెళ్లి చేసుకుంటా: ప్రేమ
ABN , Publish Date - Sep 12 , 2026 | 01:59 PM
కన్నడ నాట కథానాయికగా ప్రయాణం మొదలుపెట్టి, తెలుగు తెరపై తనదైన అందం, అభినయంతో ప్రత్యేకమైన ముద్ర వేసిన సీనియర్ నటి ప్రేమ.. తాజాగా సెకండ్ మ్యారేజ్‌కు సంబంధించి సంచలన వ్యాఖ్యలు చేశారు.
కన్నడ నాట కథానాయికగా ప్రయాణం మొదలుపెట్టి, తెలుగు తెరపై తనదైన అందం, అభినయంతో ప్రత్యేకమైన ముద్ర వేసిన సీనియర్ నటి ప్రేమ (Prema). దివంగత దర్శకుడు కోడి రామకృష్ణ (Kodi Ramakrishna) దర్శకత్వంలో వచ్చిన క్లాసిక్ భక్తిరస చిత్రం ‘దేవి’ (Devi) ఆమె కెరీర్‌లోనే ఒక మైలురాయిగా నిలిచింది. ఆ సినిమాలో దేవి పాత్రలో ఆమె కనబరిచిన నటనకు తెలుగు ప్రేక్షకులు నీరాజనాలు పలికారు. ఆ తర్వాత వెంకటేష్ సరసన ‘ధర్మచక్రం’, మోహన్ బాబుతో ‘రాయుడు’, జగపతిబాబుతో ‘చిలక్కొట్టుడు’ వంటి పలు విజయవంతమైన చిత్రాల్లో నటించి అగ్ర తారగా వెలుగొందారు. సుదీర్ఘ విరామం అనంతరం ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టిన ప్రేమ.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత జీవితం, ఆరోగ్యం, విడాకులు, రెండో పెళ్లిపై మనసు విప్పి మాట్లాడారు.
తన ఆరోగ్యంపై గతంలో వచ్చిన వదంతులపై ప్రేమ స్పందిస్తూ.. ‘‘నాకు క్యాన్సర్ సోకిందంటూ అప్పట్లో కొన్ని ప్రసార మాధ్యమాల్లో వార్తలు వచ్చాయి. అవన్నీ పూర్తిగా అవాస్తవం, నిరాధారమైన రూమర్స్ మాత్రమే. నేను ఆరోగ్యంగానే ఉన్నాను’’ అని స్పష్టం చేశారు. ఇక తన వ్యక్తిగత జీవితంలో ఎదురైన ఒడిదుడుకులపై మాట్లాడుతూ.. 2006లో వ్యాపారవేత్త జీవన్ అప్పచ్చును వివాహం చేసుకున్నానని, అయితే ఇద్దరి మధ్య అభిప్రాయ బేధాలు, మనస్పర్థలు రావడంతో పరస్పర అంగీకారంతో 2016లో ఫ్యామిలీ కోర్టు ద్వారా విడాకులు తీసుకున్నట్లు గుర్తుచేసుకున్నారు. విడాకుల తర్వాత ఒంటరిగానే జీవిస్తున్న ఆమె, తన వైవాహిక బంధం ముగింపునకు దారితీసిన పరిస్థితులపై హుందాగానే సమాధానమిచ్చారు.
రెండో పెళ్లి ఆలోచన ఉందా అన్న ప్రశ్నకు ప్రేమ ఏమాత్రం దాపరికాలు లేకుండా ఓపెన్‌గా స్పందించారు. ‘‘జీవితంలో ప్రతి ఒక్కరికీ ఒక తోడు అవసరం. నన్ను అర్థం చేసుకుని, నా మనసుకు నచ్చే సరైన వ్యక్తి దొరికితే తప్పకుండా రెండో పెళ్లి చేసుకుంటాను. పెళ్లికి వయసుతో పనేంటి? 70 ఏళ్ల వయసొచ్చినా నాకు నచ్చిన వ్యక్తి దొరికితే పెళ్లి చేసుకోవడంలో ఎలాంటి తప్పు లేదు. అది పూర్తిగా నా వ్యక్తిగత విషయం’’ అంటూ కుండబద్దలు కొట్టారు. సమాజం ఏమనుకుంటుందోనని ఆలోచించకుండా, తన మనసులోని భావాలను నిర్భయంగా బయటపెట్టిన ప్రేమ వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింట చర్చనీయాంశంగా మారడంతో పాటు బాగా వైరల్ అవుతున్నాయి.
ఇవి కూడా చదవండి:
‘వారణాసి’ కీలక అప్‌డేట్.. ఇంత స్పీడ్ ఏంటి జక్కన్నా?
TFTDDA: జానీ మాస్టర్ వైఫ్ సుమలత స్కెచ్ అదిరిందిగా.. కోర్టు సంచలన తీర్పు
దేవిశ్రీ కాదు.. సుక్కు, చరణ్ ‘RC17’ మ్యూజిక్ డైరెక్టర్ ఎవరంటే?