Pawan Kalyan: ప్రకాశ్ రాజ్‌కు ఇచ్చిపడేసిన బండ్ల గణేశ్!
ABN , Publish Date - Jun 04 , 2026 | 12:07 PM
పవన్ కళ్యాణ్ రెండు రోజుల క్రితం హైదరాబాద్‌లో చేసిన వ్యాఖ్యలపై ప్రకాశ్ రాజ్ స్పందించారు. పవన్ పై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. దీనిపై నిర్మాత, నటుడు బండ్ల గణేశ్ తీవ్రంగా స్పందించారు.
తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ప్రెస్ మీట్‌లో చేసిన వ్యాఖ్యలు చినికి చినికి గాలి వానగా మారుతున్నాయి. ఇటు కాంగ్రెస్, అటు బీఆర్‌ఎస్ లోని ప్రముఖ నేతలు పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలను తప్పుపడుతూ విమర్శిస్తున్నారు. దాంతో తెలంగాణలోని జనసైనికులు వారికి కౌంటర్ ఇస్తున్నారు. రెండు రోజులుగా ఈ అంశంతో సోషల్ మీడియా హీటెక్కిపోయింది. ఇదే సమయంలో జాతీయ ఉత్తమ నటుడు, సామాజిక వేత్త ప్రకాశ్ రాజ్ (Prakash Raj) పవన్ కళ్యాణ్ ఉద్దేశించి వ్యంగ్యంగా వ్యాఖ్యలు చేశారు.
'మీరొస్తానంటె మేమొద్దంటామా? రండి దొర...
కానీ వచ్చే ముందు ఉత్తుత్తినే వస్తున్నారా? పొత్తుతో వస్తున్నారా? లేదా సింగిల్‌గా వస్తున్నారా?' అంటూ కామెంట్ చేశారు.
దీనిని ప్రకాశ్ రాజ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేయగానే... పవన్ కళ్యాణ్ వీరాభిమాని, నటుడు, నిర్మాత బండ్ల గణేశ్ (Bandla Ganesh) స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ప్రకాశ్ రాజ్ ను ఏక వచనంలో సంభోదిస్తూ,
'నీకెందుకురా... ప్రతిదాంట్లో వేలు పెట్టడం? అసలు నువ్వెవడివి? తమిళోడివా, తెలుగోడివా, కన్నడోడివా? నీ ఊరు ఏది, నీ కథ ఏంటి? ప్రతి ఊర్లో, ప్రతి ఇష్యూలో దూరి జడ్జిమెంట్‌లు ఇవ్వడానికి నువ్వేమైనా కలెక్టర్ వా లేక దేశ ప్రధానివా? ఎక్కడ చూసినా నువ్వే, ఏ విషయం వచ్చినా నువ్వే. నీ బతుక్కి పని లేకపోతే చూసుకో, కానీ అందరి విషయాల్లో దూరి హీరోలా ఫీలవ్వకు. ముందు నీ అడ్రస్ నువ్వు తెలుసుకో, తర్వాత ప్రపంచాన్ని మార్చే ప్రయత్నం చేయ్!' అని ప్రకాశ్ రాజ్ వ్యాఖ్యలను ట్యాగ్ చేస్తూ పోస్ట్ చేశారు. మరి బండ్ల గణేశ్ వ్యాఖ్యలపై ప్రకాశ్ రాజ్ ఎలా స్పందిస్తారో చూడాలి.
చిత్రం ఏమంటే... తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ సానుభూతి పరుడుగా పేరు తెచ్చుకున్న బండ్ల గణేశ్... పవన్ కళ్యాణ్ విషయం దగ్గరకు వచ్చేసరికీ కాంగ్రెస్‌ను పవన్ కళ్యాణ్ విమర్శించినా... వాటిని పట్టించుకోకుండా ఈ వ్యాఖ్యలు చేశారు. అలానే నిర్మాత, నటుడు రాంకీ సైతం పవన్ కళ్యాణ్ పై సీనియర్ జర్నలిస్ట్, తెలంగాణ ఉద్యమ నాయకుడు పాశం యాదగిరి చేసిన వ్యాఖ్యలను ఖండించారు. పవన్ కళ్యాణ్ అడ్డం పెట్టుకుని రెండు తెలుగు రాష్ట్రాలలోని ప్రజల మధ్య ఉద్రిక్తతలు సృష్టించడం సరికాదని, తెలుగు సినిమా రంగాన్ని విభజించాలని చూడటం మంచిది కాదని తెలిపారు.
ఇవి కూడా చదవండి:
Peddi Review: రామ్‌చరణ్ స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్ చిత్రం 'పెద్ది’ ఎలా ఉందంటే..
Kajal Aggarwal: కుర్ర హీరోయిన్లకే.. చెమటలు పట్టిస్తున్న చందమామ..
Pawan Kalyan: ప్రకాశ్ రాజ్‌కు ఇచ్చిపడేసిన బండ్ల గణేశ్!