సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

బండ్ల గణేష్ ఎందుకు ఇంత హర్టయ్యాడు..

ABN, Publish Date - Aug 30 , 2026 | 05:55 PM

టాలీవుడ్ ప్రముఖ నిర్మాత, నటుడు బండ్ల గణేష్ సోషల్ మీడియాలో పెట్టే పోస్టులు ఎప్పుడూ ఇండస్ట్రీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారుతుంటాయి. తాజాగా ఆయన చేసిన పోస్ట్ వైరల్ అవుతోంది.

Bandla Ganesh

టాలీవుడ్ ప్రముఖ నిర్మాత, నటుడు బండ్ల గణేష్ (Bandla Ganesh) సోషల్ మీడియాలో పెట్టే పోస్టులు ఎప్పుడూ ఇండస్ట్రీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారుతుంటాయి. మనసులో ఏముంటే అది నిర్మొహమాటంగా, కుండబద్దలు కొట్టినట్లు మాట్లాడే బండ్ల గణేష్.. తాజాగా సోషల్ మీడియా వేదికగా పెట్టిన ఒక సుదీర్ఘమైన ఎమోషనల్ పోస్ట్ సినీ సర్కిల్స్‌లో వైరల్ అవుతోంది. తనపై వస్తున్న కొన్ని వార్తలపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూనే, తన గతం, భవిష్యత్ లక్ష్యాలపై పూర్తి స్పష్టతనిచ్చారు. ప్రస్తుతం తన దృష్టి మొత్తం కేవలం మంచి సినిమాలు తీయడంపైనే ఉందని, అనవసర విషయాలను పట్టించుకునే ఆలోచన తనకు లేదని ఆయన కుండబద్దలు కొట్టారు.


ఈ సందర్భంగా బండ్ల గణేష్ స్పందిస్తూ.. ‘‘కొన్ని వార్తలు చదివితే మనసుకు చాలా బాధగా ఉంటుంది. ప్రస్తుతం నా మనసులో ఎలాంటి ఆలోచనలు లేవు. నా దృష్టి, నా ప్రయాణం ఇప్పుడు ఒక్కటే.. సినిమా. మంచి సినిమాలు తీయాలి.. ప్రేక్షకులకు మంచి సినిమాలు అందించాలి. నా జీవితంలో గతంలో కొన్ని నిర్ణయాలు తప్పుగా తీసుకుని ఉండొచ్చు. కానీ ఒక విషయం మాత్రం ఎప్పటికీ మారదు. నా కష్టకాలంలో నాకు తోడుగా నిలిచిన వారిని, నన్ను ఆదుకున్న వారిని, నన్ను మనస్ఫూర్తిగా నమ్మిన వారిని ఈ జన్మలో ఎప్పటికీ మర్చిపోలేను. వాళ్లు చేసిన సహాయానికి ఏ రోజూ విలువ కట్టలేను. నా జీవితాంతం వారికి కృతజ్ఞుడిగానే ఉంటాను’’ అంటూ హృదయపూర్వకంగా రాసుకొచ్చారు.


తన వ్యక్తిత్వాన్ని వివరిస్తూ.. ‘‘అవసరం ఉన్నప్పుడు దగ్గరై, ఆ అవసరం తీరిపోయాక దూరమయ్యే వాడుకుని వదిలేసే మనస్తత్వం నాకు లేదు. ఎవరైనా నాకు చేసిన మంచిని గుండెల్లో పెట్టుకుని జీవితాంతం గుర్తుపెట్టుకోవడమే నాకు తెలుసు. ఇకపై నా కల, నా జీవిత లక్ష్యం ఒక్కటే.. చిత్ర పరిశ్రమలో గొప్ప సినిమాలు నిర్మించడమే’’ అని బండ్ల గణేష్ తేల్చిచెప్పారు. వ్యక్తిగతంగా ఎన్ని ఒడిదుడుకులు, వివాదాలు ఎదురైనా తనను నిలబెట్టిన సినిమా రంగానికే మళ్లీ పూర్తి సమయాన్ని కేటాయిస్తానని ఆయన స్పష్టం చేశారు. ఎవరిని ఉద్దేశించి ఈ పోస్ట్ పెట్టారనే విషయంపై స్పష్టత లేనప్పటికీ, బండ్ల గణేష్ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింట విపరీతంగా ట్రెండ్ అవుతున్నాయి. తెలుగు చలనచిత్ర పరిశ్రమ నిర్మాతల మండలి అధ్యక్షుని రేస్ నుంచి చివరి నిమిషంలో బండ్ల గణేష్ తప్పుకోవడంపై ఎవరైనా ఏమైనా అని ఉంటారా? అందుకే బండ్ల గణేష్ ఇలా రియాక్ట్ అయ్యారా? అనేలా కూడా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

ఇవి కూడా చదవండి:

‘ఎపిక్’ టీమ్‌తో NSR స్పెషల్ ఇంటర్వ్యూ

పవర్ స్టార్ బర్త్‌డేకి ‘ఓజీ-2’ అప్డేట్ ఉంటుందా..

‘దాయ్రా’లో డీసీపీ అజూనీ కోహ్లీగా కరీనా.. పవర్‌ఫుల్ పోస్టర్ వైరల్

Updated Date - Aug 30 , 2026 | 05:55 PM