బి. నర్సింగరావుకు అంబేద్కర్ యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్!
ABN , Publish Date - Oct 01 , 2026 | 01:56 PM
ప్రముఖ సినీ దర్శకులు బి. నర్సింగరావుకు అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్‌ను ప్రదానం చేయనుంది. 'మా భూమి, రంగుల కల, దాసి' వంటి చిత్రాలతో ఆయన అంతర్జాతీయ ఖ్యాతిని పొందారు.
జాతీయ, అంతర్జాతీయ చిత్రోత్సవాల్లో తెలంగాణ సినిమా కీర్తి పతాకాన్ని రెపరెపలాడించిన దర్శక నిర్మాత బి. నర్సింగరావు. ఆయన కీర్తి కిరీటంలో మరో కలికితురాయి చేరబోతోంది. హైదరాబాద్ లోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం ఆయనకు గౌరవ డాక్టరేట్ ఇవ్వబోతోంది. అక్టోబర్ 7న తెలంగాణ గవర్నర్, యూనివర్సిటీ ఛాన్స్ లర్ శివ ప్రతాప్ శుక్లా చేతుల మీదుగా దీనిని ప్రదానం చేస్తామని యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఘంటా చక్రపాణి తెలిపారు. అక్టోబర్ 7న జరుగుతున్న 27వ స్నాతకోత్సవంలో 36, 145 మంది విద్యార్థినీ విద్యార్థులు పట్టాలు తీసుకోబోతున్నారని, అందులో 43 మంది ఆర్మీ జవాన్లు, 27 మంది ఖైదీలు, 11 మంది ట్రాన్స్ జెండర్స్ ఉన్నారని చక్రపాణి చెప్పారు. తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలను తనదైన పంథాలో భవిష్యత్ తరాలకు అందించే గొప్ప కృషిని బి. నర్సింగరావు చేశారని, దర్శకుడిగా, రచయితగా, చిత్రకారునిగా, ఛాయాగ్రాహకుడిగా, రంగస్థల కళాకారుడిగా, వాద్యకారునిగా ఆయనకు సుదీర్ఘ అనుభవం ఉందని చక్రపాణి అన్నారు.
బి. నర్సింగరావు నిర్మించిన 'మా భూమి', దర్శకత్వం వహించిన 'రంగుల కల', 'దాసి' , 'హరివిల్లు' వంటి ఫీచర్ ఫిల్మ్స్ భారత సమాంతర చిత్రాలకు ఉదాహరణలుగా నిలిచాయి. అలానే డాక్యుమెంటరీల చిత్రీకరణలోనూ బి. నర్సింగరావు తనదైన భూమికను పోషించారు. తెలంగాణ మట్టి వాసనకు ఆయన చిత్రాలు ప్రతీకలుగా నిలిచాయి.
ఇవి కూడా చదవండి:
ఇరుముడి గ్లోబల్ రికార్డ్.. ఓటీటీని షేక్ చేస్తున్న మాస్ మహారాజా
Sandeep Kishan: ఇండియన్ సెల్యులాయిడ్‌పై సరికొత్త విజువల్ ట్రీట్