Tollywood: నంది అవార్డుల ప్రదానోత్సవంకు రంగం సిద్థం
ABN, Publish Date - Sep 22 , 2026 | 03:24 PM
నంది అవార్డుల ప్రదానోత్సవాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. డిసెంబర్‌లో 2012 నుంచి 2025 వరకూ నంది సినిమా, టీవీ అవార్డులను ప్రదానం చేయనుంది.
తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి అధికారంలోకి రాగానే 'గద్దర్ సినిమా' అవార్డులను ప్రకటించారు. గతంలో ప్రకటించిన నంది అవార్డులతో సంబంధం లేకుండా తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన 2014 నుంచి యేడాదికి మూడు సినిమాల చొప్పున అవార్డులను అందించారు. అలానే 2024, 2025కి పూర్తి స్థాయిలో వివిధ కేటగిరిల్లో అవార్డులను ప్రదానం చేశారు. దాంతో గతంలోని 2016 వరకూ ప్రకటించిన నంది అవార్డులను ప్రదానం చేయాల్సిన బాధ్యత ఏపీ ప్రభుత్వంపై పడింది. దానిని ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న ఏపీ ప్రభుత్వం 2012 నుంచి 2016 వరకూ ప్రకటించిన పూర్తి స్థాయి అవార్డులను ఈ యేడాది డిసెంబర్ లోగా అందించడానికి పథక రచన చేసింది. అలానే పనిలో పనిగా 2017 నుంచి 2024 వరకూ యేడాదికి నాలుగు అవార్డుల చొప్పున అంద చేయబోతోంది. ఇందులో ప్రధమ ఉత్తమ చిత్రం, ద్వితీయ ఉత్తమ చిత్రంతో పాటు రెండు జ్యూరీ అవార్డులను ఇస్తారు. ఇక 2025కు పూర్తి స్థాయిలో వివిధ కేటగిరిల్లో 46 నంది అవార్డులను ప్రకటిస్తారు. బంగారు, వెండి, కాంస్య, తామ్ర నందులతో పాటు ప్రశంసా పత్రం, నగదు పారితోషికం అంద చేస్తారు. అలానే వివిధ కేటగిరిల్లో ఎనిమిది గోల్డ్ మెడల్స్ ఇవ్వనున్నారు. వీటి ఎంపికకు సంబంధించిన జ్యూరీని త్వరలోనే ఏర్పాటు చేయనున్నారు. ఈ విషయాన్ని ఎ.పి.ఎఫ్.డి.సి. ఛైర్మన్ పి. భరత్ భూషణ్ మీడియాకు తెలియచేశారు.
ఇవి కూడా చదవండి:
‘ది ప్యారడైజ్’ అడ్వాన్స్ బుకింగ్స్.. అసలు ఊహించలేదు కదా
దర్శకుడు శ్రీను వైట్ల కూతురిని చూశారా.. హాలీవుడ్ మోడల్‌కు ఏమాత్రం తీసిపోదు
మెగాస్టార్‌తో బుచ్చిబాబు.. నిర్మాణ సంస్థ కూడా రెడీ!