లక్ష మంది యువతులకు.. అల్లు అర్జున్ ఫ్యాన్స్ అరుదైన ఘనత
ABN , Publish Date - Aug 16 , 2026 | 07:15 PM
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అభిమానులు కేవలం సినిమా వేడుకలు, రికార్డుల వేటకే పరిమితం కాకుండా నిరంతరం సమాజ హిత కార్యక్రమాల్లో ముందుంటూ తమ ప్రత్యేకతను చాటుకుంటున్నారు.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Icon Star Allu Arjun) అభిమానులు కేవలం సినిమా వేడుకలు, రికార్డుల వేటకే పరిమితం కాకుండా నిరంతరం సమాజ హిత కార్యక్రమాల్లో ముందుంటూ తమ ప్రత్యేకతను చాటుకుంటున్నారు. ఆల్ ఇండియా అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ (AAFA) సామాజిక బాధ్యతతో చేపట్టిన మరో బృహత్తర కార్యక్రమం దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటోంది. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ‘స్వస్థ్ నారీ వికసిత్ భారత్’ కార్యక్రమంలో భాగంగా సర్వైకల్ క్యాన్సర్ నివారణ, హెచ్‌పీవీ (HPV) వ్యాక్సినేషన్‌పై అవగాహన కల్పించే దిశగా బన్నీ ఫ్యాన్స్ విశేష కృషి చేస్తున్నారు.
ఈ మహోద్యమంలో భాగంగా దేశవ్యాప్తంగా ఏకంగా 7 రాష్ట్రాల్లో 400కు పైగా హెచ్‌పీవీ అవేర్‌నెస్ కార్యక్రమాలను AAFA విజయవంతంగా నిర్వహించింది. మహిళల ప్రాణాలకు ముప్పుగా మారుతున్న సర్వైకల్ క్యాన్సర్‌ను హెచ్‌పీవీ టీకా ద్వారా ఎలా సమర్థవంతంగా అడ్డుకోవచ్చో వివరిస్తూ, ఈ డ్రైవ్ ద్వారా ఇప్పటివరకు 1 లక్ష మందికి పైగా యువతులు, బాలికలకు చేరువై వారికి పూర్తిస్థాయి అవగాహన కల్పించారు. ‘7 రాష్ట్రాలు, 400కి పైగా కార్యక్రమాలు, 1 లక్ష మందికి పైగా బాలికలు.. ఒక ఉజ్వల భవిష్యత్తు’ అనే నినాదంతో అభిమానులంతా సమష్టిగా కదిలి ఈ అరుదైన మైలురాయిని చేరుకున్నారు.
సినిమా రంగంలో తమ అభిమాన కథానాయకుడు అల్లు అర్జున్ పాన్ ఇండియా స్థాయిలో సరికొత్త రికార్డులు సృష్టిస్తుంటే, ఆయన స్ఫూర్తితో అభిమానులు కూడా దేశవ్యాప్తంగా సేవా కార్యక్రమాల్లో సరికొత్త బెంచ్‌మార్క్ సెట్ చేస్తున్నారు. భవిష్యత్ తరాలైన యువతుల ఆరోగ్య పరిరక్షణకు, క్యాన్సర్ రహిత సమాజ నిర్మాణానికి తోడ్పడుతూ చేపట్టిన ఈ భారీ అవగాహన కార్యక్రమంపై సర్వత్రా ప్రశంసల జల్లు కురుస్తోంది. నెటిజన్లు, పలువురు సామాజిక కార్యకర్తలు #AAFASupportsHPVDrive హ్యాష్‌ట్యాగ్‌తో అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ చేస్తున్న ఈ గొప్ప ప్రయత్నాన్ని అభినందిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.
ఇవి కూడా చదవండి:
‘అమీర్ లోగ్’.. భాష, యాసతో సంబంధం లేకుండా భావోద్వేగాలతోనే..
ప్రభాస్, ఎన్టీఆర్ మూవీస్‌తో మైత్రీ కొత్త ట్రెండ్.. బాక్సాఫీస్ బద్దలే ఇక!
అడివి శేష్ వదిలిన ‘అ’ ఫస్ట్ లుక్.. టైటిల్ జస్టిఫికేషన్ ఇదే