సౌందర్య అంత అందంగా ఉండేది కాబట్టే.. దేవుడు తీసుకెళ్లిపోయాడు: ఆమని
ABN, Publish Date - Oct 26 , 2026 | 01:19 PM
తాజాగా ఓ ఇంటర్వ్యూలో సౌందర్యతో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ సీనియర్ నటి ఆమని తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. ఆమె అందం, వ్యక్తిత్వం, కుటుంబం కోసం పడిన కష్టాన్ని తలుచుకుంటూ ఆమని పంచుకున్న విషయాలు సినీ ప్రియులను కలచివేస్తున్నాయి.
తెలుగు సినీ యవనికపై చెరగని ముద్ర వేసిన దివంగత అగ్ర కథానాయిక సౌందర్య (Soundarya) గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. అందం, అభినయం, సంప్రదాయానికి నిలువెత్తు రూపంగా నిలిచి దక్షిణాది ప్రేక్షకుల గుండెల్లో ‘వెండితెర దేవత’గా నిలిచిపోయారు. అయితే, ఎంతో భవిష్యత్ ఉన్న సమయంలోనే ఆమె హెలికాప్టర్ ప్రమాదంలో అకాల మరణం చెందడం యావత్ సినీ ప్రపంచాన్ని శోకసంద్రంలో ముంచెత్తింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో సౌందర్యతో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ సీనియర్ నటి ఆమని తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. ఆమె అందం, వ్యక్తిత్వం, కుటుంబం కోసం పడిన కష్టాన్ని తలుచుకుంటూ ఆమని (Actress Aamani) పంచుకున్న విషయాలు సినీ ప్రియులను కలచివేస్తున్నాయి.
సౌందర్య సహజ సౌందర్యం గురించి ఆమని మాట్లాడుతూ.. ‘‘చాలామంది ముఖానికి మేకప్ వేస్తేనే తెరపై అందంగా కనిపిస్తారు. కానీ సౌందర్య మాత్రం ఎలాంటి మేకప్ లేకపోయినా, నార్మల్గా ఉన్నా అచ్చం దేవతలా ఉండేది. అంతకుమించి నేనేం చెప్పగలను? ఆమె నిజంగానే ఓ దేవత. అంత అందంగా ఉండేది కాబట్టేనేమో, ఆ దేవుడు కూడా అంత తొందరగా ఆ దేవతల్లోనే కలిపేసుకున్నాడు. సినిమా ఇండస్ట్రీలో ఉన్నప్పటికీ తను ఎంతో పద్ధతిగా, క్రమశిక్షణతో ఉండేది. ‘నేను ఇలాగే ఉంటాను.. నాకంటూ ఒక పద్ధతి ఉంది’ అని ఒక నియమాన్ని పెట్టుకుని జీవించింది. తన గురించి మాట్లాడినప్పుడల్లా నేను తెలియకుండానే ఎమోషనల్ అయిపోతాను’’ అంటూ ఆమని కన్నీటిపర్యంతమయ్యారు.
సౌందర్య అమాయకత్వాన్ని, కుటుంబంపై ఆమెకున్న ప్రేమను గుర్తుచేసుకుంటూ.. ‘‘తనకు లోకజ్ఞానం గానీ, లౌక్యాలు గానీ అస్సలు తెలియవు. అన్నీ వాళ్ల నాన్నగారే చూసుకునేవారు. నాన్నంటే ఆమెకు ప్రాణం. ఆయన ఏది చెబితే అదే వేదం, ఆ పని వద్దు అంటే ప్రపంచంలో ఎవరు చెప్పినా ఆ పని చేసేది కాదు. అలాంటి తండ్రి హఠాత్తుగా చనిపోయినప్పుడు సౌందర్యకు అన్నీ తానై వాళ్ల అన్నయ్యే చూసుకున్నారు. అంత కష్టపడి కోట్లు సంపాదించింది కానీ, చివరకు జీవితంలో ఏదీ అనుభవించకుండానే అర్థాంతరంగా కన్నుమూసింది. తనకంటూ ఎన్నో కలలు ఉండేవి.. సినిమా వేరు, ఫ్యామిలీ వేరు అంటూ భర్త, పిల్లలతో కలసి ఉండాలని ఎన్నో ఆశలు పెట్టుకుంది. కానీ చివరకు ఆ అన్నయ్యతో పాటే ఆమె కూడా ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయింది. ఇటీవల ఓ సందర్భంలో బెంగళూరులోని వాళ్ల ఇంటి వైపు వెళ్లి చూశాను. ఎంతో కళకళలాడిన ఆ ఇల్లు, ఇప్పుడు ఎవరూ లేక ఓ పాడుపడిన భవనంలా మారిపోవడం చూసి మనసు బరువెక్కింది’’ అంటూ ఆమని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇవి కూడా చదవండి:
రజనీతో రజనీకే పోటీ.. టాప్-3లో ఒకడే కింగ్
సూర్యకు ఈ ఏడాది త్రిపుల్ ధమాకా.. అదే జరిగితే హిస్టరీనే
అలరిస్తున్న ‘తోట తరణి - ఒక పునరావలోకనం’ ప్రదర్శన