స్టార్స్ సినిమా కాదు.. అయినా టికెట్ ధర 3 వేలు!

ABN , Publish Date - Jun 09 , 2026 | 06:02 PM

ఒకప్పుడు బ్లాక్‌లో టికెట్‌ని 2 వేలు, 3 వేలు ఇచ్చి కొన్నామని అంటుండే వారు. ఇప్పుడో సినిమా అడ్వాన్స్ బుకింగ్స్‌లోనే టికెట్ ధర రూ. 3000కు చేరుకోవడంతో.. అంతా ఈ సినిమా గురించే చర్చిస్తున్నారు.

The Odyssey Movie Still

ఒకప్పుడు బ్లాక్‌లో టికెట్‌ని 2 వేలు, 3 వేలు ఇచ్చి కొన్నామని అంటుండే వారు. మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi), నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) నటించిన చిత్రాల టికెట్స్‌ని బ్లాక్‌లో అమ్మి సెటిలైన వారు ఉన్నారంటే అది వారి క్రేజ్. మరిప్పుడు అలాంటి స్టార్స్ లేకపోయినా, ఒక సినిమాకు టికెట్ ధర 3 వేలు పలుకుతుందంటే.. ఆ సినిమాపై ఎలాంటి అంచనాలు ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. హాలీవుడ్ ప్రముఖ దర్శకుడు క్రిస్టోఫర్ నోలన్ (Christopher Nolan) తెరకెక్కించిన చిత్రం ‘ది ఒడిస్సీ’ (The Odyssey). ఈ చిత్రానికి సంబంధించి జూన్ 8న ఉదయం 10 గంటలకే ఇండియాలో అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. జూలై నెలలో విడుదల కానున్న ఈ హాలీవుడ్ సినిమాకు ఈ స్థాయిలో డిమాండ్ ఉంటుందని అసలెవరూ ఊహించలేదు.


అందరినీ షాక్‌కు గురిచేస్తూ ఉత్తరాదిలోని ఓ నగరంలో ఈ సినిమా టికెట్ ధర ఏకంగా రూ. 3000 మార్కును తాకబోతోంది. యూనివర్సల్ పిక్చర్స్ ఈ చిత్రం కోసం కేవలం రెండు షోలను మాత్రమే ప్లాన్ చేసింది, అదీ ఐమాక్స్ (IMAX) స్క్రీన్స్‌పైనే. ఒకటి మార్నింగ్ షో అయితే.. రెండోది ఫస్ట్ షో లేదంటే సెకండ్ షో‌గా ప్రదర్శించాలని ప్లాన్ చేశారు. క్రిస్టోఫర్ నోలన్ గత చిత్రం ‘ఓపెన్‌ హైమర్’ కూడా భారీ క్రేజ్ తెచ్చుకున్నప్పటికీ, అప్పట్లో ఈ స్థాయి భారీ ధరలు పలకలేదు. ఇటీవలి కాలంలో కేవలం ‘ధురంధర్: ది రివెంజ్’ సినిమాకు మాత్రమే ఇలాంటి డిమాండ్ కనిపించింది.


‘ది ఒడిస్సీ’ విషయానికి వస్తే.. భారతదేశంలోనే అత్యంత ఖరీదైన స్క్రీనింగ్‌కు పూణే నగరం వేదిక కాబోతోంది. అక్కడ టికెట్ ధరలు కనీసం రూ. 1400 నుంచి ప్రారంభమై.. గరిష్టంగా రూ. 3000 వరకు పలుకుతుండటం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. దీనికి భిన్నంగా ముంబైలో ఈ సినిమా టికెట్ ధరలు కాస్త అందుబాటులోనే ఉండటం విశేషం. అక్కడ రూ. 1000 కంటే తక్కువే ఉంది. కేవలం పీవీఆర్ లోయర్ పరేల్‌లో మాత్రమే ధరలు ఎక్కువగా ఉన్నాయి, అక్కడ ప్రారంభ ధర రూ. 700 ఉంటే, గరిష్టంగా రూ. 1400 వరకు ఉంది. ముంబై నగరంలో ఈ సినిమా గరిష్ట టికెట్ ధర రూ. 2000 లోపే ఉంది. నిజంగా ఈ ధరలను చూస్తుంటే సామాన్యుడి పరిస్థితి ఏంటనేలా సోషల్ మీడియాలో ముచ్చట మొదలైంది. ఇండియన్ సినిమాలను సామాన్య ధరలకు అమ్మి, హాలీవుడ్ చిత్రాలకు మాత్రం ఇంత భారీ ధరలు పెట్టడం చూసిన వారంతా.. ఇండియన్ సినీ ఇండస్ట్రీకి ఈ పరిణామం అంత మంచిది కాదనేలా చర్చలు మొదలయ్యాయి. మరి రాబోయే రోజుల్లో.. ఈ విషయమై ఎలాంటి కాంట్రవర్సీలు, చర్చలు నడుస్తాయో చూడాల్సి ఉంది.

ఇవి కూడా చదవండి:

మెగా హీరోస్ రేంజ్ అది.. మూడు వందల కోట్ల క్లబ్‌లో ఆ ముగ్గురు

Peddi: గురువు సుకుమార్‌లా బ్యాలెన్స్ చేయలేకపోయిన బుచ్చి!

ఆ పనిచేస్తే టీవీకే సర్కారుకు మంచి పేరు -సత్యరాజ్

Updated Date - Jun 10 , 2026 | 09:12 AM