సినిమా రివ్యూ: సమ్మర్ హాలిడేస్
ABN , Publish Date - Nov 06 , 2026 | 08:57 AM
ఈవారం దీపావళి సందర్భంగా అంతా అనువాద చిత్రాలదే హవా అన్నట్లుగా ఉంది. తెలుగు నుంచి 'సమ్మర్ హాలీడేస్’ ఒకటే విడుదలైంది. విలేజ్ బ్యాక్‌డ్రాప్, వేసవి సెలవులు, అమ్మమ్మ ఇంటి జ్ఞాపకాల ఇతివృత్తంతో తెరకెక్కిన ఈ సినిమాకు శ్రీకర్ నయన్. జి దర్శకత్వం వహించారు.
సినిమా రివ్యూ: సమ్మర్ హాలీడేస్
విడుదల తేది: 6–11–2026
ఈ దీపావళికి అనువాద చిత్రాలదే హవా అన్నట్లుగా ఉంది. అయితే వాటితో పాటు తెలుగు స్ర్టెయిట్ సినిమా 'సమ్మర్ హాలీడేస్’ కూడా విడుదలైంది. విలేజ్ బ్యాక్‌డ్రాప్, వేసవి సెలవులు, అమ్మమ్మ ఇంటి జ్ఞాపకాల ఇతివృత్తంతో తెరకెక్కిన ఈ సినిమాకు శ్రీకర్ నయన్. జి దర్శకత్వం వహించారు. బాలనటులు రోహన్ రాయ్, అరుణ్ దేవ్, ఖుషి కీలక పాత్రధారులు, జయసుధ, రాజీవ్ కనకాల, వాసుకి హర్షిణి, హర్షవర్దన్ ఇతర కీలక పాత్రధారులు. ధీరజ్ మొగిలినేని, గిరిబాబు వల్లభనేని నిర్మించిన ఈ చిత్రానికి ఎలాంటి ఆదరణ లభిస్తుందో చూద్దాం.
కథ:
ఆర్.వి(అరుణ్ దేవ్) సిటీలో చదువుకునే కుర్రాడు. అతనికి క్రికెట్ అంటే ఇష్టం. తండ్రి (హర్షవర్దన్) చాలా స్ట్రిక్ట్. ఎప్పుడూ చదువు, ర్యాంకులు అంటూ ఆర్వీకి స్వేచ్ఛ, ఆనందం లేకుండా చేస్తాడు. దాంతో అతను ఏదీ ధైర్యంగా చెప్పలేని స్థితిలో ఉంటాడు. వేసవి సెలవులు రావడంతో తోటవారి పాలెం లోని అమ్మమ్మ (జయసుధ) ఇంటికి వెళ్తాడు. అక్కడ కె.వి(రోహన్ రాయ్) స్నేహితుడు అవుతాడు. కేవీది నిరుపేద కుటుంబం. తండ్రి మరణంతో ఆ అప్పులన్నీ కేవీ తలకు చుట్టుకుంటాయి. తన వయసు వాళ్లు బడికి వెళ్లి చదువుకుంటుంటే అతను మాత్రం ఇంటింటికి పేపర్ వేస్తూ రోజు గడుపుతుంటాడు. పైకి నవ్వుతూ ఉంటాడు.. కానీ లోపల ఎంతో భారం మోస్తుంటాడు, తల్లి బలవంతంతో స్కూల్‌కి వెళ్తాడు. ఆమెకు మంచి చీర కొనిపెట్టాలని అతని కోరిక. అలాగే అప్పులు తీర్చడానికి వర్మ (రాజీవ్ కనకాల) మామిడి తోటను లీజ్‌కు తీసుకుని పంట పండించే ప్రయత్నం చేస్తాడు. మరి అతని ప్రయత్నం ఫలించిందా? కేవీ కష్టాల నుంచి గట్టెక్కాడా? కేవీ, ఆర్వీ ఇద్దరిలో సమ్మర్ హాలీడేస్ తీసుకొచ్చిన మార్పేంటి? అన్నదే కథ.
విశ్లేషణ
2001లో సాగే గ్రామీణ కథ ఇది. ఓ మామిడి చెట్టు ఓ ఇద్దరి స్నేహితుల గురించి చెప్పడంతో కథ మొదలవుతుంది. వేసవిలో అమ్మమ్మ ఇల్లంటే.. అమ్మమ్మ కలిపిన తినిపించిన ముద్ద, ముంజకాయల బళ్లు, తోటల్లో క్రికెట్, చెరువులో ఈత, రాత్రి అయితే చల్లని వెన్నెల్లో అమ్మమ్మ చెప్పే చక్కని కథలు.. ఇలా ఎన్నో జ్ఞాపకాలు. అవన్నీ ఈ సినిమా ద్వారా మనల్ని వెంటాడతాయి. ఈ అంశాలకు బాధ్యతలు, స్నేహం, భావోద్వేగాలు జోడించి దర్శకుడు కథ తయారు చేశారు. చదువు, ర్యాంకులు అంటూ ఆర్వి తండ్రితో మొదలైన కథ, విలేజ్‌లోని అమ్మమ్మ ఇంటికి షిఫ్ట్ అవుతుంది. కేవీకి, ఆర్ వీ పరిచయం వారి మధ్య స్నేహం, ఆటలు, పాటలు, కష్టం వస్తే ఎలా ఎదుర్కోవాలో తెలుసుకోవడం వంటి సీన్స్‌తో సరదాగా సాగిపోతుంది. ప్రేమతో చెబితేనే ఎవరికైనా వినాలనిపిస్తుంది’ అనే డైలాగ్‌తో ఓ మామిడి చెట్టుకు, ఇద్దరు స్నేహానికి కథను లింక్ చేయడం ఆకట్టుకుంటుంది. ఇంటర్వెల్ సీన్స్ భావోద్వేగం కలిగిస్తాయి. సెకెండాఫ్‌లో ఆర్వీ పుట్టిన రోజు, కేవీ మామిడి పంట, ఒక్కడే పంటను మార్కెట్‌కు తరలించడం, అమ్మకు చీర కొనడం వంటి సీన్స్ ఆకట్టుకునేలా సాగింది. కైమాక్స్ ను భావోద్వేగంగా మలిచారు. ఆర్వీ భయం పోగొట్టుకుని తనలో వచ్చిన మార్పు తండ్రికి తెలియచేసే సన్నివేశం హైలైట్. ప్రజెంట్ జనరేషన్ లో పిల్లలు పడే స్ట్రెస్ అంతా ఆర్ వి పాత్ర ద్వారా తెలిచేశారు.
నటీనటులు.. సాంకేతిక నిపుణులు పనితీరు..
ఇందులో స్టార్ హీరోలు లేరు. భారీతనం లేదు. మామిడి చెట్టు ఒక హీరో. చెట్టు కథ చెప్పడంతోనే సినిమా మొదలవుతుంది. ఆ చెట్టు చుట్టూనే కథ నడుస్తుంది. రోహన్, అరుణ్ దేవ్ ఇద్దరే ఈ సినిమాకు కీలకం. 90 బయోపిక్‌తో పాపులర్ అయిన రోహాన్ కేవీ పాత్రలో అదరగొట్టాడు. గ్రామీణ ప్రాంతంలో పెరిగిన కుర్రాడిగా మాస్‌గా కనిపించి అలరించాడు. భావోద్వేగ సన్నివేశాల్లో మెప్పించాడు. సిటీలో పెరిగిన కుర్రాడు అమ్మమ్మ ఇంటికి వచ్చి.. ఏం నేర్చుకున్నాడు.. ఏం సాధించాడు అనే పాత్రలో అరుణ్ దేవ్ కూడా చక్కటి నటన ప్రదర్శించాడు. బేబీ ఖుషిత స్క్రీన్ స్పేస్ తక్కువే అయినా బాగా చేసింది. అమ్మమ్మగా జయసుధ పాత్ర గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇలాంటి పాత్రలు ఆవిడకు కొట్ఇన పిండి. హర్షవర్ధన్, వాసుకి తల్లిదండ్రులుగా కనిపించారు. రోహన్‌కు తల్లిగా యాంకర్ హర్షిణి కి పూర్తి స్థాయి రోల్ దొరకటం గమనార్హం. వర్మ పాత్రలో రాజీవ్ కనకాల తన మార్క్ చూపించారు. సినిమాలో కనిపించిన ప్రతి ఆర్టిస్ట్ తమ బెస్ట్ ఇచ్చారు. కెమెరామెన్ సాయి ప్రకాశ్ పల్లె అందాలను చక్కగా చూపించారు. సంగీత దర్శకుడు సింజిత్ యర్రమిల్లి ఈ తరహా చిత్రాలకు కేరాఫ్‌గా నిలిచారు. పాటలు, నేపథ్య సంగీతం ఆకట్టుకుంటాయి. దర్శకుడికిది తొలి సినిమా అయినా చెప్పాలనుకున్నది ప్రేక్షకుడి మదికి చేరేలా చెప్పగలిగాడు.
'జీవితం అంటే మార్కులు, ర్యాంకులే కాదు.. ఎలాంటి సందర్భాన్ని అయినా ఎదుర్కొనే నేర్పు, ధైర్యం ఉండాలని, చదువు పేరుతో పిల్లల్ని రుద్దితే వెనకపడిపోతారని.. సమ్మర్లో గ్రాండ్ పేరెంట్స్ ఇంటి కన్నా కోచింగ్ క్లాస్ ఏముంటుందని’ ఎంతో చక్కగా చెప్పారు. కామెడీ, ఎమోషన్స్, వాల్యూస్, మెసేజ్ ఇలా ప్రతి అంశాన్ని ఓవర్ డోస్ కాకుండా ఆవిష్కరించారు. మరచిపోతున్న విలువలు, గడిచిన జ్ఞాపకాలతో కూడిన ఈ తరహా కథను తెరపైకి తీసుకురావాలనే నిర్మాతల ప్రయత్నాన్ని మెచ్చుకుని తీరాలి.
ట్యాగ్‌లైన్: సందేశాత్మక సమ్మర్ హాలీడేస్
రేటింగ్: 2.75/5