సిగ్మా మూవీ రివ్యూ
ABN, Publish Date - Oct 02 , 2026 | 05:28 PM
సందీప్ కిషన్, ఫరియా అబ్దుల్లా జంటగా నటించిన సినిమా 'సిగ్మా'. విజయ్ తనయుడు జేసన్ సంజయ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మించింది. శుక్రవారం ఈ సినిమా తెలుగు, తమిళ భాషల్లో విడుదలైంది.
తమిళ స్టార్ హీరో విజయ్ కొడుకు జేసన్ సంజయ్ ను దర్శకుడిగా పరిచయం చేస్తూ లైకా ప్రొడక్షన్స్ సంస్థ తాజాగా 'సిగ్మా' చిత్రాన్ని నిర్మించింది. శుక్రవారం ఈ సినిమా తమిళ, తెలుగు భాషల్లో విడుదలైంది. ఈ సినిమాతో ఆ సంస్థ జాతకం ఏమైనా కాస్త మారుతుందేమో అని భావించిన వారి ఆశలన్నీ అడియాసలయ్యాయి. తెలుగువారైన సందీప్ కిషన్, ఫరియా అబ్దుల్లా జంటగా నటించిన 'సిగ్మా' ఎలా ఉందో తెలుసుకుందాం.
గురు (సందీప్ కిషన్) చిన్నప్పుడే తల్లిదండ్రులను కోల్పోతాడు. తండ్రి చేసిన అప్పులను తీర్చే బాధ్యత గురు మీద పడుతుంది. తల్లి నడిపిన లైబ్రరీని గురు ప్రాణప్రదంగా భావించి, కష్టాలకు ఓర్చి నిర్వహిస్తుంటాడు. కాలానుగుణంగా యూ ట్యూబ్ ఛానెల్ ద్వారా ఆడియో స్టోరీస్ పోస్ట్ చేస్తుంటాడు. కానీ దాని ద్వారా వచ్చే ఆదాయం అప్పులు తీర్చడానికి ఏ మాత్రం సరిపోదు. బాకీ తీర్చకపోతే... ఇంటి స్థలాన్ని స్వాధీనం చేసుకుంటామని అప్పులిచ్చిన వాళ్ళు ఒత్తిడి చేస్తుంటారు. ఆ సమయంలో పరిచయమైన ఆర్.జె. సామ్ (ఫరీయా అబ్దుల్లా) తో వాయిస్ ఓవర్ చెప్పిస్తూ, ఆమెనూ పార్టనర్‌గా చేసుకుంటాడు. అప్పులు ఎలా తీర్చాలో తెలియక సతమతమౌతున్న గురుకు ఓ గోల్డెన్ ఆపర్చ్యునిటీ దొరుకుతుంది. వైజాగ్‌లో థియేటర్ కమ్ పబ్ ను నిర్వహించే విన్సెంట్‌కు దయా అనే డ్రగ్స్ సప్లయర్ తో పరిచయం ఏర్పడుతుంది. విన్సెంట్ క్యాసినోలో ఇద్దరూ కలిసి డ్రగ్స్ ను సరఫరా చేస్తుంటారు. అయితే దయా భారీ స్మగ్లర్ వీరయ్య రెడ్డి (సంపత్ నంది)తో చేతులు కలిపి తన వ్యాపారాన్ని విస్తరింప చేయాలనుకుంటాడు. అతనికి అడ్వాన్స్ గా వీరయ్య రెడ్డి ఫారిన్ లో ఉన్న తన వెయ్యి కోట్ల లాకర్ కీ ని అతనికి ఇస్తాడు. ఆ తర్వాత దయా ఉన్నట్టుండి మాయమైపోతాడు. అతనికి ఇచ్చిన కీ కూడా కనిపించకుండా పోతుంది. అయితే అది ఊహించని విధంగా గురు చేతికి వస్తుంది. ఆ కీ ని అడ్డం పెట్టుకుని గేమ్ మొదలు పెట్టిన గురు తన కష్టాల నుంచి గట్టెక్కాడా? లేదా? అనేది మిగతా కథ.
ఎక్కడో ఉన్న డబ్బు కోసం రెండు వర్గాలు గొడవ పడటం, దానికి సంబంధించిన క్లూ కోసం వరుసగా హత్యలు చేసుకుంటూ వెళ్లడం... చివరకు హీరో ఆ మొత్తాన్ని హస్తగతం చేసుకోవడం... ఈ కాన్సెప్ట్ ఇప్పటికే దశాబ్దాల కాలంగా నలిగి నలిగి పోయింది. మళ్ళీ అదే కథను తీసుకుని అటూ ఇటూ తిప్పి జనాలకు చూపించాలనే ప్రయత్నం జేసన్ సంజయ్ చేశాడు. సినిమా ప్రారంభం నుంచి ముగింపు వరకూ ఒక్కటంటే ఒక్కటి కూడా ఆసక్తికరమైన సన్నివేశం లేదు. విజయ్ కొడుకు, ఫారిన్ లో ఫిల్మ్ మేకింగ్ లో శిక్షణ తీసుకున్నాడని అంటే ఏదోకొత్త కథను చూపిస్తాడని అంతా ఆశపడ్డారు. కానీ వారందరినీ తీవ్ర నిరాశకు గురిచేశాడు. పైగా సినిమాలోని కీలక సన్నివేశాలు సైతం పేలవంగా ఉన్నాయి. ఏ పాత్ర ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తుందో అర్థమే కాదు. బాకీ తీర్చకపోతే చంపేస్తామని థమ్కీ ఇచ్చిన రౌడీ గ్యాంగ్ ద్వితీయార్థంలో చిత్రంగా డిజప్పియర్ అయిపోతుంది! వెయ్యి కోట్లు ఉన్న లాకర్ కీ కోసం రెండు బృందాల మధ్య సాగే పోరాటం కూడా ఏ మాత్రం ఆసక్తికరంగా చూపించలేక పోయాడు. కథ అక్కడక్కడే తిరుగుతూ ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెడుతుంది. అసలు జేసన్ సంజయ్ చెప్పిన కథలో ఏ కొత్తదనం చూసి లైకా సంస్థ ఈ ప్రాజెక్ట్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందో అర్థం కాదు. అయినా ఏ మాత్రం రాజీ పడకుండా వాళ్ళు ఈ సినిమాను నిర్మించారు. మాస్‌ను ఆకట్టుకోవడం కోసం ప్రీ క్లయిమాక్స్ లో పెట్టిన కేథరిన్ ఐటమ్ సాంగ్ కూడా ఎలాంటి వైబ్స్ క్రియేట్ చేయలేకపోయింది. ఇక సినిమా రోలింగ్ టైటిల్ లో ప్లే చేసిన ప్రమోషనల్ సాంగ్ కోసం పెట్టిన ఖర్చంతా బూడిదలో పోసిన పన్నీరే అయ్యింది. ఆ పాట మొదలు కాగానే జనాలు థియేటర్ లోంచి బయటకు వెళ్ళిపోవడం మొదలెట్టారు. దర్శకులను గుడ్డిగా నమ్మి సినిమాలు తీసే నిర్మాతలకు లైకా ప్రొడక్షన్స్ పరిస్థితే వస్తుందనడానికి ఈ సినిమా మరో ఉదాహరణ.
సందీప్ కిషన్, ఫరియా అబ్దుల్లా తమ పాత్రల పరిధి మేరకు బాగానే నటించారు. ఇతర ప్రధాన పాత్రలు పోషించిన వారిలో సంపత్ రాజ్, రాజు సుందరం తప్పితే మిగిలిన వాళ్ళెవరూ తెలుగువారికి పరిచయం ఉన్న వాళ్ళు కాదు. సాంకేతిక నిపుణుల పనితనం బాగానే ఉంది. జేసన్ సంజయ్ తాత ఎస్.ఎ. చంద్రశేఖర్ పేరున్న దర్శకుడు. తెలుగులోనూ ఆయన కొన్ని సినిమాలు తెరకెక్కించారు. అలానే జేసన్ సంజయ్ తండ్రి విజయ్ తమిళనాట స్టార్ హీరో. ఇప్పుడు సీఎం. వారి వారసుడిగా తొలి చిత్రాన్ని రూపొందించినప్పుడు జేసన్ సంజయ్ ఎన్ని జాగ్రత్తలు తీసుకుని ఉండాల్సింది!? కానీ అలాంటిదేమీ ఈ సినిమాలో కనిపించదు. పై పెచ్చు కోట్ల రూపాయలను నీళ్ళ మాదిరి ఖర్చుచేయించాడు. మా తాతలు నేతులు తాగారు, మా మూతులు వాసన చూడండీ అని ఇవాళ్టి తరం చెబితే... జనాలు వినే పరిస్థితి లేదు. నిజానికి ముక్కు ముఖం బాగున్న జేసన్ సంజయ్ దర్శకత్వం కంటే నటన మీద దృష్టి పెట్టి ఉంటే బాగుండేదేమో!
రేటింగ్: 2/5
ట్యాగ్‌లైన్: వామ్మో సిగ్మా!